ఉల్లి రైతులను ఆదుకుంటాం
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:48 PM
ఉల్లి రైతులను ఆదుకుంటామని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. మంగళవారం మండలంలోని రాతనలో ఉల్లి పంటను గ్రేడింగ్ చేస్తున్న రైతుల వద్దకు కలెక్టర్ వెళ్లారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
కలెక్టర్ సిరి
తుగ్గలి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఉల్లి రైతులను ఆదుకుంటామని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. మంగళవారం మండలంలోని రాతనలో ఉల్లి పంటను గ్రేడింగ్ చేస్తున్న రైతుల వద్దకు కలెక్టర్ వెళ్లారు. ఎకరాకు ఎంత ఖర్చు అయిందని, ఎంత దిగుబడి వస్తుందని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్‌తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ ఏడాది సకాలం వర్షాలు రావడంతో ఎకరాకు 75 క్వింటాళ్ల వరకు ఉల్లి ఎంత దిగుబడి వస్తుందని అనుకున్నట్లు తెలిపారు. 75 క్వింటాళ్లు వస్తాయనుకున్న పంట వర్షాలకు తడవడంతో సగానికి సగం ఉల్లిగడ్డలు కుళ్లి పాడైపోయ్యాయన్నారు. ఎకరాకు దాదాపు రూ.1.20 లక్ష వరకు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే ఎకరాకు రూ.30 నుంచి రూ.40వేల వరకు దిగుబడి వచ్చిందన్నారు. రైతులకు ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని వినతి పత్రం అందజేశారు. వ్యవసాయాధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఉల్లి పంట సాగు చేసిన రైతులందరినీ ఈక్రాఫ్ నమోదు చేయాలన్నారు. మొంథా తుఫాన్ పై రైతులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు కార్యక్రమంలో ఆర్డీవో భరత్ నాయక్, తహసీల్దార్ రవి, టీడీపీ తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మనోహర్ చౌదరి, వ్యవసాయాధికారి సురేష్ యాదవ్, ఆర్‌ఐ వెంకట్రాముడు, వీఆర్వో నాగేంద్ర, ఏఈవోలు లక్ష్మీనారాయణ, మల్లేష్ ఉన్నారు.
మెనూ పాటించకపోతే చర్యలు
ప్రభుత్వ పాఠశాలలో, హాస్టళ్లలో భోజనం విషయంలో మెనూ తప్పక పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ ఏ.సిరి హెచ్చరించారు. రాతన గిరిజన సంక్షేమ హాస్టల్ ఆశ్రమ పాఠశాలలో తనిఖీ చేసి హాస్టల్‌లో డైనింగ్ హాల్, వంట గది, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విశ్వమోహన్, ఎంఈవోలు రమావెంకటేశ్‌గౌడు, మాలతి, ఏపీవో హేమసుందర్, ఉపాధ్యాయులు ఉన్నారు.