పకడ్బందీగా వన్యప్రాణులను లెక్కిస్తాం
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:08 PM
ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ పరిధిలో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ - 2026 కార్యక్రమంలో భాగంగా ఫేస్-1 వన్యప్రాణుల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నట్లు ఆత్మకూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు.
ఆత్మకూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్
ఆత్మకూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ పరిధిలో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ - 2026 కార్యక్రమంలో భాగంగా ఫేస్-1 వన్యప్రాణుల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నట్లు ఆత్మకూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆత్మకూరు ప్రాజెక్ట్ పరిధిలో జరుగుతున్న వన్యప్రాణుల లెక్కింపు అంచనాల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబరు 1 నుంచి 8వ తేది వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు 178కిమీల అటవీ మార్గాల్లో లెక్కింపు బృందాలు పర్యటించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా వన్యప్రాణులను ప్రత్యక్ష వీక్షణం ద్వారా గుర్తించి వాటి వివరాలను నమోదు చేసుకున్నట్లు చెప్పారు. అలాగే అడవి స్థితిగతులకు సంబంధించిన వివరాలను కూడా సేకరించామని అన్నారు. ఈ క్రమంలోనే బైర్లూటి రేంజ్‌లో ఓ చిరుతను అటవీ సిబ్బంది గమనించినట్లు తెలిపారు. అలాగే ఒక పెద్దపులి పాదముద్రికను, పలు వన్యప్రాణుల మలమూత్రాలను కూడా సేకరించినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు లెక్కింపు వివరాలను ఎంస్ట్రైప్స్ ఎకలాజికల్ మొబైల్ యాప్‌లో నిక్షిప్తపరుస్తున్నట్లు వెల్లడించారు.