రిజర్వాయర్ లీకేజీలను అరికడతాం : మంత్రి బీసీ
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:54 PM
రిజర్వాయర్ లీకేజీలను అరికడతాం : మంత్రి బీసీ
రివిట్‌మెంట్ పనులను పరిశీలించిన మంత్రి బీసీ
ఈనెల చివరికి పనులు పూర్తి
అవుకు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : అవుకు రిజర్వాయర్ లీకేజీలను పూర్తి స్థాయిలో అరికడతామని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రిజర్వాయర్ వద్దకు చేరుకొని జలవనరుల శాఖ ఎస్‌ఈ రెడ్డి శేఖర్‌రెడ్డి, ఎస్సార్బీసీ ఈఈ శుభకుమార్‌తో కలసి కుంగిన రివిట్‌మెంట్ వద్ద జరుగుతున్న మరమ్మతుల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ పాలేరు, గొల్లలేరు, తిమ్మరాజు చెరువులను కలుపుతూ 4.148 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2009లో రిజర్వాయర్ నిర్మాణం జరిగిందన్నారు. అయితే పాలేరు, తిమ్మరాజు చెరువులకు గతంలో ఉన్న పాత తూముల వద్ద నిర్మాణ లోపం జరిగిందన్నారు. దీంతో ప్రారంభం నుంచే పాత తూముల ద్వారా నీరు లీకేజీ రూపంలో బయటకు వస్తుందన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ ఆదేశాలతో 2015లో డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్ బృందం లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించిందని అన్నారు. తూము నిర్మాణంలోని ప్రాంతంలో అక్కడక్కడ రంధ్రాలు వేసి ప్లాస్టిక్ పైపుల ద్వారా కాంక్రీట్‌ను లోపలికి పంపి లీకేజీని కొంత మేర అరికట్టారని తెలిపారు. గత వైసీపీ 5ఏళ్ల పాలనలో రిజర్వాయర్ నిర్వహణను గాలికి వదిలేయటంతో రిజర్వాయర్ పరిస్థితి ప్రమాదకరంగా మారిందని విమర్శించారు. గత ఏడాది రిజర్వాయర్‌లో 4 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే తిమ్మరాజు చెరువు రివిట్‌మెంట్ కుంగిపోగా, ఈఏడాది అక్టోబరు నెల 3వ తేదీన గతంలో కుంగిన ప్రాంతంలోనే రెండోసారి రివిట్‌మెంట్ కుంగి పోయిందన్నారు. మట్టికట్టల నుంచి నీరు భారీగా లీకయిందన్నారు. మరమ్మతు కోసం రూ. కోటి విడుదల చేశామన్నారు. ప్రస్తుతం కుంగిన రివిట్‌మెంట్ పనులను రూ. 57 లక్షలతో చేపట్టినట్లు తెలిపారు. అనంతరం బోటింగ్ నిర్వహణ మూడేళ్లుగా మూతపడిందని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకరాగా త్వరలో పరిష్కారం చూపుతానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఐవీ పక్కీరరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయభాస్కర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మారం పుల్లారెడ్డి, టీడీపీ నాయకులు మొట్ల రామిరెడ్డి, మద్దిలేటిగౌడు, దంతెల రమణ, తిక్కన్న, జయశివుడు, జగన్, నాయుడు, వీరారెడ్డి, ఇస్మాయిల్‌ఖాన్, నాగిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఎస్సార్బీసీ డీఈ సాయికిరణ్, జేఈ సుధాకర్ పాల్గొన్నారు.