టమోటాకు గిట్టుబాటు ధర అందిస్తాం
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:16 PM
టమోటా రైతులకు గిట్టుబాటు ధర అందించేలా చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ శాఖ కడప ఆర్‌డీడీ( రీజినల్ డిప్యూటీ డైరెక్టర్) లావణ్య అన్నారు.
మార్కెటింగ్ శాఖ కడప రీజినల్ డీడీ లావణ్య
పత్తికొండ మార్కెట్ యార్డులో తనిఖీలు
పత్తికొండ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): టమోటా రైతులకు గిట్టుబాటు ధర అందించేలా చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ శాఖ కడప ఆర్‌డీడీ( రీజినల్ డిప్యూటీ డైరెక్టర్) లావణ్య అన్నారు. సోమవారం పత్తికొండ మార్కెట్ యార్డును ఆమె తనిఖీ చేశారు. మార్కెట్‌కు వచ్చిన టమోటా నాణ్యతను పరిశీలిస్తూ రైతులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచి ధర అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, మీరు కూడా గ్రేడింగ్ టమోటాను మార్కెట్‌కు తీసుకువస్తే మంచి ధరను అందించేందుకు అవకాశం ఉంటుందని రైతులకు సూచించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ మదనపల్లి మార్కెట్‌కు సంబందించిన ప్రాంతాల్లో రైతులు స్టేకింగ్ పద్ధతిలో టమోటాను సాగుచేస్తున్నారని, అక్కడి టమోటా నాణ్యతతో పోల్చుకుంటే పత్తికొండ ప్రాంతంలో కొ ద్దిగా నాణ్యత తక్కువగా కనిపిస్తుందన్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ఇబ్బందులు కలిగిస్తున్నారా అన్న కోణంలో కూడా విచారణ చేపడుతామన్నారు. ప్రస్తుతం ఉన్న వ్యాపారులతో పాటు వేరేప్రాంతాల నుంచి వ్యాపారులను కొనుగోలుకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఎమ్మిగనూరు కార్యదర్శికి అదనపు బాద్యతలు
పత్తికొండ మార్కెట్‌యార్డులో సమస్యలను పరిష్కరించేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న కార్యదర్శి కార్నలి్‌సతో పాటు ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డు కార్యదర్శి పద్మావతికి అదనపు బాద్యతలు అప్పగిస్తున్నామని ఆర్‌డీడీ తెలిపారు. పత్తికొండ మార్కెట్‌యార్డులో సమస్యలు సద్దుమణిగే దాకా ఆమె అదనపు బాధ్యతలలో కొనసాగుతారన్నారు.
విజిలెన్స్ తనిఖీలు
పత్తికొండ మార్కెట్‌యార్డులో సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలుచేశారు. విజిలెన్స్ తహసీల్దార్ వెంకటరమణ, అసిస్టెంట్ జియాలజిస్టు సిద్దయ్య మార్కెట్‌లో పంటకొనుగోళ్లను పరిశీలించడంతో పాటు మార్కెట్‌యార్డు పరిస్థితులపై రైతులను ప్రత్యేకంగా విచారించారు.