Share News

రైతుల భూములను లాక్కుంటే ఊరుకోం

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:26 AM

పవర్‌గ్రిడ్‌ పేరిట రైతుల సాగు భూములను లాక్కుంటే ఊరుకోమని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు

రైతుల భూములను లాక్కుంటే ఊరుకోం
రైతులకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, రైతులతో మాట్లాడుతున్న రామచంద్రయ్య, నాయకులు

ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఫ రైతుల నిరసన వైసీపీ నాయకుల మద్దతు

ఆలూరు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పవర్‌గ్రిడ్‌ పేరిట రైతుల సాగు భూములను లాక్కుంటే ఊరుకోమని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆలూరు మండలం మనెకుర్తి గ్రామంలో పవర్‌గ్రిడ్‌కు స్థలాలు ఇచ్చేది లేదంటూ రైతులు జాతీయ రహదారిపై తెలిపిన నిరస నకు మద్దతు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం సారవంతమైన భూములను బలవంతంగా లాక్కునే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని, పవర్‌ గ్రిడ్‌ ఏర్పాటుతో మనేకుర్తి, కమ్మరచేడు వరకు రైతులు భూములను కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతే రైతులు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. పవర్‌గ్రిడ్‌ను సాగుకు పనికిరాని భూముల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచిం చారు. అధికారులు రైతులను బెదిరించి, బలవంతం చేస్తే సహించబోమని హెచ్చరించారు. వైసీపీ రైతులకు అండగా ఉంటుందన్నారు. ఎంపీపీ రంగమ్మ, కన్వీనర్‌ మల్లికార్జున, నాయకులు మల్లికార్జునరెడ్డి, వీరభద్రరెడ్డి, నాగరాజు, వీరేష్‌, భాస్కర్‌, రామాంజి నేయులు, గుర్రం హరి, గిరి, సోమశేఖర్‌, రాజు, వరుణ్‌ పాల్గొన్నారు.

పచ్చని భూములను లాక్కుంటారా?

పచ్చని భూములను లాక్కొని పవర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేస్తారా? అని రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సీపీఐ మండల కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆలూరు మండలం మనెకుర్తి గ్రామంలో బాధిత రైతుల పొలాలను పరిశీలించారు. సాగుకు పనికిరాని భూముల్లో పవర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్‌, వైసీపీ నాయకులు వీరభద్రారెడ్డి, వ్యవసాయ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భూపేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 12:26 AM