తప్పుడు కేసులతో భయపెట్టలేరు
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:10 AM
తప్పుడు కేసులతో భయపెట్టలేరని ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తమపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారికి లొంగిపోవాలని ఒత్తిడి చేశారని, అయినా భయపడలేదన్నారు.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): తప్పుడు కేసులతో భయపెట్టలేరని ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తమపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారికి లొంగిపోవాలని ఒత్తిడి చేశారని, అయినా భయపడలేదన్నారు. కార్యకర్తల పోరాటం ఫలితంగా మళ్లీ ఎన్నికల్లో గెలిచామమన్నారు. శనివారం కర్నూలు నగరంలోని మహిళా ఉప కారాగారాన్ని ఆమె సందర్శించారు. అక్కడ రక్షిత మంచినీటి ప్లాంటు, రెండు టీవీలను ఉచితంగా అందజేశారు. ఉప కారాగారం పరిసరాల్లో సీసీ రహదారి కోసం విన్నవించారని, దాన్ని కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో తనను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు కూడా ఇదే కారాగారంలో ఉంచారని, ఇక్కడి సమస్యలు, పరిస్థితులు, అవసరాలను గుర్తించి వారికి సాయం చేశానని గుర్తు చేశారు. తప్పుడు కేసుల మూలంగా తాను సంవత్సరం బిడ్డను ఇంటి వద్ద వదిలి ఎంతో మానసిక క్షోభను అనుభవించానన్నారు. ఈ విషయం ఎన్నటికీ మర్చిపోనన్నారు. అధికారంలో ఉన్నా గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డవారు ఎవరూ వాటిని విస్మరించరాదని, అక్రమార్కులపై పోరాటాన్ని అలాగే కొనసాగించాలని పిలుపునిచ్చారు. వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్దార్థరెడ్డి రీల్సు రాజకీయాలకు సరిపోతాడే తప్ప, రియల్ రాజకీయాలకు పనికిరారన్నారు. ఆయన మాటకారితనం, ప్రత్యేక యాసతో మాట్లాడటమే రాజకీయమని భ్రమ పడుతున్నారని అఖిలప్రియ ఎద్దేవా చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయి కాబట్టే ప్రతిపక్ష పార్టీ నామినేషను వేసిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు కాబట్టే పులివెందులలో ప్రతిపక్ష పార్టీకి డిపాజిట్ గల్లంతైందని అఖిలప్రియ అన్నారు. ఈ కార్యక్రమాలో టీడీపీ నాయకుడు భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.