Share News

విచారించి న్యాయం చేస్తాం: ఎస్పీ

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:15 AM

విచారించి న్యాయం చేస్తాం: ఎస్పీ

విచారించి న్యాయం చేస్తాం: ఎస్పీ
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేధిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి 95 ఫిర్యాదులు వచ్చాయి. అడిషనల్‌ ఎస్పీ హుశేన్‌ పీరా, సీఐలు శివశంకర్‌, రామకృష్ణ, విజయలక్ష్మి ఉన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి మోసం చేశాడానికి కర్నూలు నగరంలోని శరీన్‌నగర్‌కు చెందిన పుల్లయ్య ఫిర్యాదు చేశారు. తనకు వచ్చిన ఒక ఈ-మెయిల్‌లో కర్నూలు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఇండిగో ఎయిర్‌లైన్‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని, ఆన్‌లైన్‌లో మునేష్‌ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడని చెప్పారు. సీనియర్‌ ఫ్లోర్‌ మేనేజర్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి పోన్‌ పే స్కానర్‌ ద్వారా రూ.23వేలు వేయించుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. కోర్టు ఇంజెక్షన్‌ ఆర్డర్‌ మేరకు పొలం వేసుకున్నామని, అయితే తాము లేని సమయంలో చిన్న సుంకన్నతో పాటు 30 మంది కలిసి వరి పంటను కోసుకుని వెళ్లిపోయారని కోడుమూరు మండలం లద్దగిరి గ్రామానికి చెందిన విక్రమ్‌ ఫిర్యాదు చేశారు. కోడుమూరుకు చెందిన హనుమన్న టాటా ర్యాలీస్‌ కంపెనీ తరుపున నకిలీ మొక్కజొన్న విత్తనాలు ఇచ్చి మోసం చేశాడని, పెట్టుబడి ఖర్చులు, ఇన్సూరెన్స్‌ డబ్బులు అడిగితే ఇవ్వడం లేదని తుగ్గలి మండలం లంకాయపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. శ్రావణ్‌ అనే వ్యక్తి కంప్యూటర్‌ జాబ్‌ ఇప్పిస్తామని చెప్పి రూ.40 వేలు తీసుకొని మోసం చేశాడని ఎమ్మిగనూరుకు చెందిన సురేంద్రబాబు ఫిర్యాదు చేశారు. పుల్లగుమ్మికి చెందిన వడ్డె వెంకటేశులు, వడ్డె వెంకట్రాముడు తన 100 క్వింటాళ్ల (రూ.13 లక్షలు విలువ చేసే) మిరప పంటను తీసుకెళ్లి 8 నెలలు అయినా డబ్బులు ఇవ్వడం లేదని క్రిష్ణగిరి మండలం ఆగవెల్లి గ్రామానికి చెందిన వడ్డె గిడ్డయ్య ఫిర్యాదు చేశారు. కర్నూలు మున్సిపాలిటీలో స్వీపర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కురువ భీమన్న రూ.30వేలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు బండిమెట్టకు చెందిన వెంకటరమణ ఫిర్యాదు చేశారు.

Updated Date - Nov 25 , 2025 | 12:16 AM