విచారించి న్యాయం చేస్తాం:ఎస్పీ
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:09 AM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత పాటిల్ తెలిపారు.
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 97 ఫిర్యాదులు
కర్నూలు క్రైం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత పాటిల్ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని టూటౌన పోలీ్‌సస్టేషన సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 97 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తన హోండా షైన ద్విచక్రవాహనాన్ని కర్నూలు అవుట్ డోర్ స్టేడియం వద్ద తెలియని వ్యక్తి దొంగిలించాడని కర్నూలు మండలం ఈ-తాండ్రపాడు గ్రామానికి చెందిన బొల్లెద్దుల వెంకటసాయి క్రిష్ణ ఫిర్యాదు చేశారు. కర్నూలు మిలిటరీ కాలనీ వద్ద ఉన్న కరెంటు సబ్ స్టేషన ఆఫీసులో కరెంటు ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నంద్యాలకు చెందిన దుర్గాప్రసాద్ డబ్బులు తీసుకుని మోసం చేశాడని కర్నూలు మండలం నూతనపల్లెకు చెందిన లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. తన పొలంలో పండించిన 220 ప్యాకెట్ల పత్తిని ఎత్తుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని దేవనకొండ మండలం, అలారుదిన్నె గ్రామానికి చెందిన వీరభద్ర ఆచారి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు శివశంకర్, ఇబ్రహీం, ఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.