విచారణ జరిపి న్యాయం చేస్తాం
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:23 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
పీజీఆర్‌ఎస్‌కు 58 ఫిర్యాదులు
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 58 మంది వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చుకున్నారు. వీటిలో ప్రధానంగా... రైల్వే శాఖలో ప్రభుత్వ ఉద్యోగం లేదా మైక్రోసాఫ్ట్‌వేర్‌లో ప్రైవేటు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాదుకు చెందిన విజయభాస్కర్ రూ.7 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు చెందిన దినేష్ నాయుడు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ సంతకాలతో నకిలీ భూమి పట్టాభూమి ఇచ్చి రూ.10లక్షలు తీసుకుని తిరిగి డబ్బులు ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్న కుమ్మరి విజయలక్ష్మి, రాముడు, ఏజెంట్ చిలక రాజశేఖర్‌లపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కర్నూలు ఏ.క్యాంప్ చెందిన ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. పెద్దపాడు చెందిన గిడ్డయ్య అనే వ్యక్తి రూ.5లక్షలు తీసుకుని ఇవ్వడం లేదని, రూ.8 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉన్నాననీ, కోర్టు నుండి ఉత్తర్వులు వచ్చినా కూడా స్పందించడం లేదని కర్నూలు కొత్తపేటకు చెందిన జే.లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశాడు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని సాగు చేసుకుంటూ మోసం చేస్తున్న నాగరాజు అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని హోళగుంద మండలం పెద్దహ్యాట్ గ్రామానికి చెందిన సతీష్ ఫిర్యాదు చేశారు. పెద్దపాడు గ్రామం దగ్గర ఉన్న హరికృష్ణ నగర్‌లోని తమ ప్లాట్‌లో వేరే వ్యక్తులు రాళ్లు పాతి మోసం చేస్తున్నారనీ న్యాయం చేయాలని కర్నూలు ఆదిత్య నగర్‌కు చెందిన లక్ష్మిరెడ్డి ఫిర్యాదు చేశారు.