Share News

విచారించి న్యాయం చేస్తాం

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:32 PM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారించి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

విచారించి న్యాయం చేస్తాం
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారించి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. నగరంలోని కొత్తపేటలోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 83 ఫిర్యాదులు వచ్చాయి.

ఫిర్యాదుల్లో కొన్ని..

ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్‌ ట్రైనర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విజయవాడకు చెందిన ఎండ్రపల్లి శివ, కోవెలకుంట్లకు చెందిన మధ్యవర్తి రామకృష్ణ కలిసి ఐదుగురు నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఇప్పించుకొని మోసం చేశారని పత్తికొండ మండలం పులికొండ గ్రామానికి చెందిన రాజశేఖర్‌, నరేష్‌, లింగరాజు, పీటర్‌ పాల్‌, చైతన్య ఫిర్యాదు చేశారు. నకిలీ ఉద్యోగాలు ఇచ్చి ఏలూరులో ట్రైనింగ్‌ ఇచ్చి, ఆలూరులో 6 నెలల పాటు పని చేయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడిని కోడలు, ఆమె బంధువులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కర్నూలు గణేష్‌నగర్‌కు చెందిన అజ్మత్‌ఖాన్‌ ఫిర్యాదు చేశారు. ఆదోని సబ్‌ రిజిస్టర్‌ ఆఫీసులో జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దేవదానం, జ్యోతి కలిసి రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశారని కౌతాళం మండలం చిరుతపల్లి గ్రామానికి చెందిన రాజు, మునిస్వామి ఫిర్యాదు చేశారు. కొడుకు, కోడలు తమను కొట్టి పొదుపులో వచ్చిన డబ్బులతో పాటు బంగారం తీసుకెళ్లారని తుగ్గలి మండలం గుండాల్‌ తండాకు చెందిన దానమ్మ, రాముడు నాయక్‌ దంపతులు ఫిర్యాదు చేశారు. మద్యానికి బానిసై తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని తమ సోదరుడు శివరాజ్‌ ఇతరులకు విక్రయించారని స్వామిరెడ్డి నగర్‌కు చెందిన తిరుపాల్‌ ఫిర్యాదు చేశారు. బాబు అనే వ్యక్తి తన దుకాణం ఎదుట కూరగాయల బండి పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కర్నూలు చౌక్‌ మసీదుకు చెందిన నజీర్‌ అహ్మద్‌ ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ హుస్సేన్‌పీరా, సీఐలు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 11:32 PM