ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:28 PM
ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు హెచ్చరించారు.
ఆరునెలలైనా అమలుకాని మంత్రి హామీ
ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు
డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో ఆందోళన
కర్నూలు ఎడ్యుకేషన్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు హెచ్చరించారు. ఏపీ డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయులకు పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీ కృష్ణారెడ్డి, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాముడు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి, ప్యాప్టో సేవాలాల్ నాయక్, బీటీఏ గౌరవాధ్యక్షులు రామశేషయ్య, ఆపస్ సత్యనారాయణ, ఏపీటీఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు రంగన్న, పీఎన్‌యూఎస్ ప్రతినిధి బజారన్న సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జి.హృదయరాజు మాట్లాడు తూ గత డిసెంబరు 13న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో చర్చించామని, ఈ చర్చల్లో భాగంగా కేంద్రం ఇచ్చే పెన్షన్ స్కీం కాబట్టి.. దీనిన్ని కచ్చితంగా అమలు చేస్తామనీ హామీ ఇచ్చారన్నారు. ఆరు నెలలు గడచినప్పటికీ ఇచ్చిన హామీలకు అతీగతీ లేదన్నారు. ఈ పాత పెన్షన్ స్కీం అమలైతే విద్యా, హోంశాఖలతో పాటు ఇతర శాఖల ఉద్యోగులను కలుపుకుని మొత్తం 11వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో మెమో.57ను అమలుచేసి ఒక ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు వర్తింపజేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం ధర్నా చౌక్ నుంచి మెడికల్ కళాశాల, ఆసుపత్రి మీదుగా కలెక్టరేట్ వరకు ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల పోరం నాయకులు ఎస్.వెంకటేశ్వర్లు, ఎస్.ముజహర్ హుశేన్, పి.సుకుమార్, ఎస్.బాలాజీరావు, ఎస్.పి.మంగళ లక్ష్మి, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.