రాక్‌గార్డెన్‌ను మరింత అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:11 PM
సహజ సిద్ధంగా ఏర్పడిన రాక్ గార్డెన్‌ను మరింతగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
ఓర్వకల్లు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సహజ సిద్ధంగా ఏర్పడిన రాక్ గార్డెన్‌ను మరింతగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అనంతపు రంలో జరుగుతున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమానికి వెళ్లిన ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా వెనుదిరిగారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి సహాయార్థం మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మానిటరింగ్ కోసం విజయవాడ కంట్రోల్ రూమ్‌కు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బయల్దేరారు. అనంతపురం నుంచి విజయవాడకు వెళ్తూ మార్గమధ్యలో కర్నూలుకు చేరుకున్న మంత్రి దుర్గేష్ ప్లైట్‌కు సమయం ఉండటంతో సమీపంలోని ఓర్వకల్లు రాక్ గార్డెన్‌ను సందర్శించారు. హరిత రిసార్ట్స్, హరిత రెస్టారెంట్‌ను పరిశీలించారు. అక్కడి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. సహజసిద్ధంగా కొండల మధ్య ఉన్న రాతివనం, చెరువు, లక్షల ఏళ్ల క్రితం ఏర్పడిన వివిధ ఆకృతులతో కూడిన రాళ్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయన్నారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుతో స్థానిక పర్యాటక ప్రదేశాలకు అనుసంధానం పెరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర సహకారంతో ఓర్వకల్లు ఇండస్ర్టిరియల్ కారిడార్ ఏర్పాటు కానుందని తద్వారా ఉపాది అవకాశాలు పెరుగుతాయనీ మంత్రి దుర్గేష్ వెల్లడించారు.