Share News

కుంగిన రివిట్‌మెంట్‌ను సరిచేస్తాం : సీఈ

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:52 PM

అవుకు రిజర్వాయర్‌లో అంతర్భాగమైన తిమ్మరాజు చెరువు లోపల కుంగిన ఎర్రరాతి రివిట్‌ మెంట్‌ను సరిచేసి లీకేజీని అరికడతామని జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ కబీర్‌ బాషా అన్నారు.

కుంగిన రివిట్‌మెంట్‌ను సరిచేస్తాం : సీఈ
రిజర్వాయర్‌ వద్ద అధికారులతో మాట్లాడుతున్న సీఈ కబీర్‌బాషా

అవుకు రిజర్వాయర్‌లో

రూ. 57 లక్షలతో త్వరలో పనులు ప్రారంభం

అవుకు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): అవుకు రిజర్వాయర్‌లో అంతర్భాగమైన తిమ్మరాజు చెరువు లోపల కుంగిన ఎర్రరాతి రివిట్‌ మెంట్‌ను సరిచేసి లీకేజీని అరికడతామని జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ కబీర్‌ బాషా అన్నారు. బుధవారం ఎస్సార్బీసీ ఎస్‌ఈ రెడ్డి శేఖర్‌రెడ్డి, ఈఈ శుభకుమార్‌తో కలిసి రిజర్వాయర్‌ వద్దకు చేరుకుని కుంగిన రివిట్‌మెంట్‌ను, మట్టి కట్టల నుంచి నీరు లీకవుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ తిమ్మరాజు చెరువుకు గతంలో ఉన్న పాత తూము వద్ద నిర్మాణ లోపం జరిగినట్లు గుర్తించామన్నారు. గత ఏడాది రివిట్‌మెంట్‌ కుంగటంతో మరమ్మతుల కోసం మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చొరవతో డీఎంఎఫ్‌ నిధుల నుంచి రూ.కోటి మంజూరు చేశారన్నారు. మరమ్మతు పనుల కోసం కర్ణాటక రాష్ట్రానికి చెందిన అక్షిత్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ రూ.57 లక్షలకు కాంట్రాక్ట్‌ దక్కించుకుందన్నారు. అగ్రిమెంట్‌ ప్రకారం ఈనెల 12వ తేదీ తరువాత కుంగిన రివిట్‌మెంట్‌ను కాంట్రాక్టరు సిబ్బందితో కలిసి పరిశీలిస్తారన్నారు. ప్లగ్గింగ్‌ వర్కు (నీటిలో కాంక్రీట్‌ వేసి లీకేజీ నియంత్రణ) విధానంతో కుంగిన రివిట్‌మెంట్‌ ద్వారా మట్టికట్టల నుంచి బయటకు వస్తున్న నీటిని అరికడతారన్నారు. ప్రస్తుతం రిజ ర్వాయర్‌లో 2.5 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. రిజర్వాయర్‌కు ఎలాంటి ముప్పు లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. అవుకు రిజర్వాయర్‌ నుంచి చెర్లోపల్లె సమీపంలోని జీఎన్‌ఎ్‌సఎ్‌స హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా ప్రతి ఏటా కడప జిల్లా వాసుల తాగు, సాగు నీటి అవసరాల కోసం 70 నుంచి 100 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రిజర్వాయర్‌ మరమ్మతులకు గురి కాకుండా ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. పనులు పూర్తయిన వెంటనే రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపి వచ్చే సీజన్‌కల్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్బీసీ డీఈలు మల్లికార్జున, సాయికిరణ్‌, సుబ్బారావు, జేఈ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 11:52 PM