Share News

ప్రతి రైతుకు న్యాయం చేస్తాం

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:51 PM

మొంథా తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన ప్రతి రైతుకు, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ప్రతి రైతుకు న్యాయం చేస్తాం
మాట్లాడుతున్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్‌ రాజకుమారి

పంట నష్టాన్ని క్షేత్రస్థాయికెళ్లి పరిశీలించాలి

జిల్లా యంత్రాంగం కృషితో ముప్పు తప్పింది

మంత్రులు ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి

నంద్యాల నూనెపల్లి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : మొంథా తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన ప్రతి రైతుకు, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో మొంథా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన పంట పొలాలు, నష్ట ప్రభావిత ప్రాంతాలపై కలెక్టర్‌ రాజకుమారి, జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌, నందికొట్కూరు శాసనసభ్యుడు గిత్తా జయసూర్యలతో కలిసి సంయుక్తంగా అధికారులతో సమీక్షించి అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనాలను కచ్చితంగా లెక్కించి నివేదికలు సమర్పించాలని ఆదేశించామని పేర్కొన్నారు. వాగులు, వంకలు పొంగిన నేపథ్యంలో రివర్స్‌ స్ర్టాటజీ ద్వారా నీటిని మళ్లించడంతో నంద్యాలను పెద్ద ప్రమాదం నుంచి కాపాడగలిగామన్నారు. కలెక్టర్‌, అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు శ్రమించి పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రించారని మంత్రి ప్రశసించారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే అంచనా వేసి అధికారులు అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఈ సమయంలో జిల్లా యంత్రాంగం వ్యవహరించిన తీరు ఒక కేస్‌ స్టడీగా నిలిచిందని, దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా పంట నష్టం అంచనా వేయాలని, అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయికెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో అధిక వర్షాల కారణంగా వెలుగోడు రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటంతో నీటిని కుందూ నదికి విడుదల చేసినట్లు తెలిపారు. అయితే కుందూనదిలో నీరు పెరిగితే నంద్యాలకు ముప్పు ఉండే అవకాశమున్నందున కుందూనదిలోని నీటిని గాలేరు- నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు మళ్లించినట్లు తెలిపారు. ఈ చర్యలో జిల్లా మైనర్‌, మేజర్‌ ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో పనిచేసినట్లు వివరించారు.

Updated Date - Nov 01 , 2025 | 11:51 PM