464 లక్షల లీటర్ల పాలు సేకరిస్తాం
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:38 PM
విజయ డెయిరీలో 2026-27 సంవత్సరానికి 464 లక్షల లీటర్ల పాల సేకరణే లక్ష్యమని ఆ సంస్థ ఎండీ ప్రదీప్ కుమార్ అన్నారు.
విజయ డెయిరీ ఎండీ ప్రదీప్‌కుమార్
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): విజయ డెయిరీలో 2026-27 సంవత్సరానికి 464 లక్షల లీటర్ల పాల సేకరణే లక్ష్యమని ఆ సంస్థ ఎండీ ప్రదీప్ కుమార్ అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సమితి 38వ వార్షిక సర్వసభ్య సమావేశం కర్నూలు విజయ పాల డెయిరీ ప్రాంగణంలో చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని విజయ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి రోజురోజుకు అభివృద్ది చెందుతోందని అన్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అనేక పథకాలు, కార్యక్రమాలను చైర్మన్ ఎస్‌వీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నారు. నెయ్యి తయారీ 630 టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. గత సంవత్సరం వార్షిక టర్నోవర్ రూ.319కోట్లు కాగా, ఈ ఏడాది రూ.393కోట్ల టర్నోవర్ సాధించాలని నిర్ణయించుకున్నామని, అందులో భాగంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఐదేళ్లుగా ప్రతి ఏటా పాడి రైతులకు క్రమం తప్పకుండా బోనస్‌ను చెల్లిస్తున్నామన్నారు. రైతులు సంస్థ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగించుకొని సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.