Share News

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:40 PM

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకో వాలని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు రాజన్‌ క్షీరసాగర్‌, ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య కోరారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మాట్లాడుతున్న అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు రాజన్‌ క్షీరసాగర్‌

అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు రాజన్‌ క్షీరసాగర్‌

ఆదోని అగ్రికల్చర్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకో వాలని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు రాజన్‌ క్షీరసాగర్‌, ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య కోరారు. ఆదోని జేబీ గార్డెన్‌లో మంగళవారం రాష్ట్ర స్థాయి పత్తి రైతుల సమ్మేళనాన్ని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రామచంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ క్వింటం పత్తికి రూ. 12 వేలు చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో క్వింటానికి రూ.3 వేలు బోనస్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సీసీఐ 11 కింటాళ్లు కొంటామని మాట ఇచ్చి కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం దారుణమని అన్నారు. రైతు ప్రయోజనాలను సీసీఐ దెబ్బతీస్తూ కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య మాట్లాడుతూ గతంలో ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, గుంతకల్లు, కడపలో స్పిన్నింగ్‌ మిల్లులు ఉండేవని, అయితే నేడు ఆదరణ లేక మూతపడ్డాయని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయింపులో ప్రభుత్వం వివక్ష చూపడం వల్ల రాయలసీమ రైతులు వలస బాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్‌, సిద్ధేశ్వరం, గండికోట ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. టమోటా, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. పత్తి గ్రేడింగ్‌ పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తే వ్యవసాయ రంగం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు రామాంజినేయులు, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, జిల్లా అధ్యక్షుడు నాగేంద్రయ్య, పంపన్న గౌడ్‌, వీరేష్‌, సురద్శన్‌ రాజు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 11:40 PM