Share News

సర్వం కోల్పోయాం

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:44 PM

సర్వం కోల్పోయాం

సర్వం కోల్పోయాం
ప్యాలకుర్తి ఉల్లి రైతులతో మాట్లాడుతున్న కేంద్ర బృందం

అధిక వర్షాలు.. పతనమైన ధరలు..

పంట కోత, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదు

ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం

ఒక ఏడాది లాభం.. మూడేళ్లు తీవ్ర నష్టం

కేంద్ర బృందంతో ఉల్లి రైతుల ఆవేదన

ప్యాలకుర్తిలో అర గంట.. గోనెగండ్లలో ఐదు నిమిషాలు

ఇదీ కేంద్ర బృందం పర్యటన తీరు

అధిక వర్షాలు.. పతనమైన ధరలు నిలువునా ముంచేశాయి... పంట కోత, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదు.. చివరికి అప్పులే మిగిలాయి.. ఒక ఏడాది లాభం వస్తే.. మూడేళ్లు నష్టం వస్తోంది. ఉల్లి సాగు చేయాలంటేనే భయమేస్తోంది.. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి.. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం.. అంటూ ఉల్లి రైతులు కేంద్ర బృందానికి వివరించారు. రైతుల విన్నపాలు ఆలకించిన కేంద్ర బృందం సభ్యులు పూర్తి నివేదికలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఇస్తామని వెల్లడించారు. అయితే కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో అర గంట, మండల కేంద్రం గోనెగండ్లలో ఐదు నిమిషాలు మాత్రమే బృందం సభ్యులు వెచ్చించి రైతులతో మాట్లాడారు. మంగళవారం కేంద్ర బృందం ఉల్లి పంటను పరిశీలించిన తీరు ఇది. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి కథనం.

కర్నూలు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2025 ఖరీఫ్‌లో 45,278 హెక్టార్లలో రైతులు ఉల్లి సాగు చేసినట్లు ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉల్లి సాగు చేసే జిల్లాల్లో కర్నూలు ఒకటి. ప్రధానంగా సి.బెళ గల్‌, కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ, ఆదోని, కోసిగి, ఎమ్మిగనూరు, పత్తికొండ, తుగ్గలి మండలాల్లో ఉల్లి సాగు అధికంగా చేస్తున్నారు. బోరుబావుల కిందే కాకుండా వర్షాధారంగా కూడా సాగు చేస్తున్నారు. ఆగస్టు ఆఖరు నుంచే పంట కోతకు వస్తుంది. అయితే.. పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు ఉల్లి రైతులను కోలుకోని దెబ్బతీశాయి. అరకొర పంటను మార్కెట్‌కు తీసుకొస్తే పతనమైన ధరలు అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని దైన్యపరిస్థితుల్లో రైతులు కుదేలయ్యారు. కష్టకాలంలో అండగా నేనున్నానని కూటమి ప్రభుత్వం క్వింటాలుకు రూ.1,200 కనీస మద్దతు ధర ప్రకటించి ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేపట్టింది. ఏపీ మార్క్‌ఫెడ్‌, లైసెన్సుడ్‌ వ్యాపారులు 2,800 మంది రైతుల నుంచి దాదాపుగా 1.55 లక్షల క్వింటాళ్లు ఉల్లి సేకరించారు. రైతులకు రూ.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. వారం పది రోజుల్లోగా ఖాతాల జమ చేస్తామని ఏపీ మార్క్‌ఫెడ్‌ అధికారులు రైతులకు భరోసా ఇచ్చారు. రెండు నెలలు గడిచినా మెజార్టీ రైతులకు ఉల్లి డబ్బులు ఏపీ మార్క్‌ఫెడ్‌ ఇవ్వలేదని రైతులు అంటున్నారు. అదే క్రమంలో హెక్టారుకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇంత వరకు ఆ దిశగా చర్యలు శూన్యం.

అప్పుల ఊబిలో కూరుకుపోయాం..

జిల్లాలో ఉల్లి రైతుల కన్నీటి కష్టాలు క్షేత్రస్థాయిలో చూసి, ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చేందుకు కేంద్ర బృందం సభ్యులు కేంద్ర ఉద్యానవన మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్‌ బీజే బ్రహ్మ, అండర్‌ సెక్రెటరీ మనోజ్‌, డిప్యూటీ డైరెక్టర్‌ రాజీవ్‌ కుమార్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హేమాంగ్‌ భార్గవ్‌, సెంట్రల్‌ హెడ్‌ శరవణన్‌ల బృందం బుధవారం కోడుమూరు మండలం ప్యాలకుర్తి, గోనెగండ్ల మండలం గాజులదిన్నె, గోనెగండ్లలో ఉల్లి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఇప్పటికే మెజార్టీ పంటను రైతులు మార్కెట్‌కు తరలించి అమ్మకాలు చేశారు. కొందరైతే రవాణా ఖర్చులు రావడం లేదని పొలంలోనే వదిలేశారు. కేంద్ర బృందం ఏ ఉల్లి రైతును కదిపినా కన్నీటి సుడులే. ‘అయ్యా..! ఎన్నో ఆశలతో ఉల్లి సాగు చేస్తే కన్నీళ్లు పెట్టించింది. ఒక ఏడాది లాభం వస్తే.. మూడేళ్లు నష్టపోతున్నాం. ఈ ఏడాది అధిక వర్షాలకు దిగుబడి భారీగా తగ్గిపోయింది. అరకొర దిగుబడిని మార్కెట్‌కు తీసుకెళితే ధరలు పతనమై అప్పుల ఊబిలోకి కూరుకుపోయాం. కూటమి ప్రభుత్వం ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా కనీస మద్దతు ధర రూ.1,200కు కొనుగోలు చేసి కొంత ఊపిరి పోసినా, ఆ ధర కూడా గిట్టుబాటు కాలేదు. కనీస మద్దతు ధర రూ.2 వేలు కేంద్రం ప్రకటించి ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాల’ని విన్నవించారు. ఈ ఏడాది ఎకరాకు ఉల్లి సాగుకు రూ.లక్షకు పైగా ఖర్చు చేశామనీ, కేంద్ర ప్రభుత్వం ఆదుకునేలా నివేదిక ఇవ్వాలనీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హెక్టారుకు రూ.50 వేలు ఆర్థిక సాయం తక్షణమే ఇచ్చేలా చూడాలని కోరారు. అదే క్రమంలో ఉల్లి సాగు, రాయితీపై ఉల్లి విత్తనాల పంపిణీ, శీతల గిడ్డంగులు కొరత, ప్రభుత్వ ప్రోత్సాహం... తదితర వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అయితే కేంద్ర బృందం సభ్యులు తెలుగులో మాట్లడకపోవడం, రైతులకు హిందీ, ఇంగ్లీష్‌ రాకపోవడంతో రైతులు చెప్పే సమస్యలు అర్థం చేసుకోవడానికి కేంద్ర బృందం సభ్యులు కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్యాలకుర్తిలో మోహిద్దీన్‌ అనే రైతు ఉల్లి సాగు కష్టాలను హిందీలో వివరించారు. ఉల్లి పంటను ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు..? ఏ సీజన్‌లో.. ఎలాంటి రకాలు సాగు చేస్తున్నారు..? మార్కెట్‌ ధరలు ఎలా ఉన్నాయి..? కోల్డ్‌ స్టోరేజ్‌ గోదాములు అందుబాటులో ఉన్నాయా..? ఉల్లి సాగులో ఎదురవుతున్న సమస్యలు, ఎకరాకు సాగు ఖర్చు, మార్కెట్‌ ధరలు.. వంటి వివరాలను కేంద్ర ఉద్యామ మంత్రిత్వశాఖ డిప్యూటీ కమిషన్‌ డాక్టర్‌ బీజే బ్రహ్మ రైతులను అడిగి తెలుసుకున్నారు.

ఇలా వచ్చారు.. అలా వెళ్లారు

కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి కేంద్ర బృందం సాయంత్రం 3.20 గంటలకు వచ్చారు. అప్పటికే జిల్లా ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు రప్పించిన రైతులలో కేవలం ముగ్గురితో ఓ అర గంట మాట్లాడి వెళ్లిపోయారు. అక్కడి నుంచి గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామానికి 4.15 గంటలకు చేరుకున్నారు. అక్కడ కేవలం పది నిమిషాలు ఇద్దరు రైతులతో మాట్లాడారు. 4.35 గంటలకు గోనెగండ్లకు చేరుకొని ఐదు నిమిషాలు ఓ రైతుతో మాట్లాడారు. అక్కడి నుంచి కర్నూలుకు వెళ్లిపోయారు. కేంద్ర బృందం కేవలం 1.15 గంటల పర్యటనలో రైతులతో 40-45 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. అది కూడా రోడ్డు పక్క గ్రామాల్లో మాత్రమే ఉల్లి రైతులను పలకరించారు. అత్యధికంగా ఉల్లి సాగు చేసే శివారు మండలాలు సి. బెళగల్‌, దేవనకొండ, కోసిగి.. వంటి మండలాలకు వెళ్లలేదు. ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతే రైతుల కష్టాలు ఏం తెలుస్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. నేడు కర్నూలు మార్కెట్‌ యార్డులో కేంద్ర బృందం పర్యటిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 11:44 PM