Share News

మేము కట్టం..!

ABN , Publish Date - Jun 20 , 2025 | 11:30 PM

నగర పాలక సంస్థకు ఆదాయం రావాలంటే ట్రేడ్‌ లైసెన్సు ఒక మార్గం ఉంది. అయితే ఏ వ్యాపారం చేసినా నగర పాలకకు ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం ఫీజు చెల్లించాలి.

మేము కట్టం..!

ట్రేడ్‌ లైసెన్సు చెల్లింపుపైౖ మద్యం వ్యాపారుల విముఖత

నోటీసులు జారీ చేస్తున్న నగర పాలక అధికారులు

కర్నూలు న్యూసిటీ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థకు ఆదాయం రావాలంటే ట్రేడ్‌ లైసెన్సు ఒక మార్గం ఉంది. అయితే ఏ వ్యాపారం చేసినా నగర పాలకకు ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం ఫీజు చెల్లించాలి. ఈ క్రమంలో నగరపాలక పరిధిలో 52 వార్డులు ఉండగా ఇందులో 20 మద్యం దుకాణాలు ఉన్నాయి. అంతే కాకుండా 10 బార్లు ఉన్నాయి. ఒక్కో మద్యం దుకాణం సంవత్సరానికి రూ.10 వేలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు రూ.25 వేలు ట్రేడ్‌ లైసెన్సు ఫీజు చెల్లించాలి. ఈ క్రమంలో నగర పాలకకు మద్యం దుకాణాల నుంచి సంవత్సరానికి రూ.2లక్షలు, అదేవిధంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నుంచి రూ.2.50 లక్షలు ఆదాయం వస్తుంది. లైసెన్సు తీసుకుని ఫీజు చెల్లించాలని నగర పాలక అధికారులు దుకాణ యజమానులకు అడుగుతున్నారు. ట్రేడ్‌ లైసెన్సు ఫీజు చెల్లింపులపై వ్యాపారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము ఒక్కపైసా కూడా చెల్లించేది లేదంటూ వ్యాపారులు చెబుతున్నారు. ట్రేడ్‌ లైసెన్సు ఫీజు జనవరి నుంచి డిసెంబరు చివరి లోపల చెల్లించాలని నిబంధనలు ఉన్నాయి. ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయినా కూడా ఫీజులు చెల్లించడం లేదు. ఇలా లైసెన్సు ఫీజులు చెల్లించకపోతే నగరపాలక సంస్థకు ఆదాయం ఎలా వస్తుందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మొండికేస్తున్న టీడీపీ నాయకుడు!

నగర పాలక పరిధిలో మొత్తం మద్యం దుకాణాలు 20 ఉన్నాయి. ఇందులో కేవలం ఒక్క దుకాణం నుంచి మాత్రమే ట్రేడ్‌ లైసెన్సు ఫీజు కార్పొరేషన్‌కు వచ్చింది. మిగిలిన 19 మద్యం దుకాణ యజమానులు చెల్లించలేదు. అదే విధంగా మొత్తం 10 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉండగా ఇందులో ఎనిమిది బార్లు ట్రేడ్‌ లైసెన్సు ఫీజు చెల్లించాయి. అయితే రెండు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మాత్రం చెల్లించలేదు. ఫీజు చెల్లించని రెండు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు నగర తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రధాన నాయకుడివి. ఆయనపై నగర పాలక అఽధికారులు ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. ‘వచ్చింది మా ప్రభుత్వమే మేము ఎలాంటి ఫీజులు చెల్లించేది’ లేదంటూ ఆయన కూడా భీష్మించారని సమాచారం. దీంతో అధికారులు సైతం చేసేదేమీ లేక మిన్నుకుండిపోతున్నారు.

ఐదేళ్లు ప్రభుత్వ దుకాణాల తీరు అంతే..

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వ మధ్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. సుమారు ఐదేళ్ల పాటు ఒక్క దుకాణం నుంచి కూడ ట్రేడ్‌ లైసెన్సు ఫీజు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో నగర పాలక సుమారు రూ.13.50లక్షల మేర ఆదాయం కోల్పోయింది. అయితే నగరంలో ఉండే బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మాత్రం సంవత్సరానికి రూ.25 వేల చొప్పున ట్రేడ్‌ లైసెన్సు ఫీజు చెల్లిస్తున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణ యజమానులు ట్రేడ్‌ లైసెన్సు ఫీజు చెల్లిస్తుండేవారు. కేవలం వైసీపీ ప్రభుత్వ వచ్చాక...కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఏర్పాటు చేసిన దుకాణదారులు ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడం లేదు. ఇదిలా ఉండగా ట్రేడ్‌ లైసెన్సు ఫీజుల విషయం స్థానిక ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లినట్లు సమాచారం.

త్వరలో నోటీసులు జారీ చేస్తాం

నగర పాలక పరిధిలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలకు సంబంధించి ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవాలని చెబుతూనే ఉన్నాము. ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. త్వరలోనే దుకాణాలకు నోటీసులు జారీ చేస్తాం.

- డాక్టర్‌ కె.విశ్వేశ్వరరెడ్డి, ప్రజారోగ్య అధికారి, కర్నూలు

Updated Date - Jun 20 , 2025 | 11:30 PM