ఎల్లెల్సీలో.. జల చౌర్యం
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:43 PM
రైతులు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతోంది. అలాంటి అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు.
కన్నెత్తి చూడని లస్కర్లు, అధికారులు
చివరి ఆయకట్టుకు అందని సాగునీరు
నీటిపై ఆశలు వదులుకున్న రైతులు
మోటార్లు బిగించిన నానాయకట్టుదారులు
రైతులు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతోంది. అలాంటి అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. వాతావరణం అనుకూలించపోవడం, మార్కె టింగ్, ధరలు వంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటికి తోడు సాగునీరు అనేది కీలకమైనది. నీరుంటేనే పంటలు పండుతాయి. అలాంటి నీటిని సైతం కొందరు దొంగలిస్తున్నారు. అధికారుల కళ్లముందే సాగుతున్న తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎల్లెల్సీ పరిధిలో జలచౌర్యం జోరుగా సాగుతోంది. దీంతో ఆయకట్టు రైతులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. వర్షంపై ఆధారపడి పంటలు పండించాల్సిన పరిస్థితి నెలకొంది. కోడుమూరు సబ్‌డివిజన్‌లో సాగుతున్న జల చౌర్యంపై ‘ఆంధ్య్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కోడుమూరు రూరల్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కోడుమూరు సబ్‌డివిజన్ పరిధిలో ఎల్లెల్సీలో జల చౌర్యం జోరుగా సాగుతోంది. చివరి ఆయకట్టు ప్రశ్నార్థకంగా మా రింది. చాలా ఏళ్లుగా ఇదే పరిస్థితి. సబ్‌డివిజన్‌కు రావాల్సిన వాటా అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీనికి తోడు నానాయకట్టు అడ్డుఅదుపూ లేకుండా సాగవుతోంది. రైతులు కాలువ గట్టుపై మోటార్లు శాశ్వతంగా ఉంచి అక్రమంగా నీటిని వాడుకుంటున్నారు. లస్కర్లు ఏళ్ల తరబడి పాతుకుపోవడంతో ఇష్టారాజ్యమైంది. ఒకవేళ బదిలీ జరిగినా రాజకీయ నాయకుల సిఫారసుతో కొన్నాళ్లకే తిరిగి వస్తున్నారు. కాసుల కక్కుర్తితో చివరి ఆయకట్టును ముంచారు.
కాలువల ఆనవాళ్లు..
జలచౌర్యంతో చివరి ఆయకట్టుకు సాగునీరు చేరడం లేదు. దీంతో పిల్ల కాలువలకు పూడిక నిండి జంబు, పిచ్చిమొక్కలు, కంప పెరిగిపోయింది. కాలువల ఆనవాళ్లు కనిపించడం లేదు. సాగునీటిపై రైతులు ఆశలు వదులుకున్నారు. పొలం కలిసి వస్తుందని కాలువలు చదును చేసుకున్నారు. ఏళ్ల తరబడి సాగునీరు అందకపోవడంతో విసుగుచెందిన ఓ రైతు ఆయ కట్టు రద్దుచేసి మెట్టభూమిగా కింద నమోదు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు.
125 క్యూసెక్కులు..
గోనెగండ్ల మండలంలోని పుట్టపాశం పరిధిలో 4/7 కి.మీ వద్ద కోడుమూరు సబ్‌డివిజన్ (ఎల్లెల్సీ కేబీసీ (కర్నూలు బ్రాం చ్ కెనాల్) ఆరంభమవుతుంది. అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 125 క్యూసెక్కులు విడుదల కావాలి. నీటి విడుదలను లస్కర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. సబ్‌డివిజన్‌లో కోడుమూ రు, గూడూరు, పోలకల్లు, కె.నాగలాపురం, కర్నూలు సెక్షన్‌లు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం కోడుమూరులో ఉంది. డీఈ , ముగ్గురు జేఈలు, ఇద్దరు వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, ఏడుగురు లస్కర్లు, 34మంది అవుట్‌సోర్సింగ్ లస్కర్లు పనిచేస్తున్నారు. మరో 30 మందిని డైవర్షన్ కింద పంపినట్లు డీఈ తెలిపారు
1980 ముందు వరకు స్వర్ణయుగం
కోడుమూరు సబ్ డివిజన్‌కు 1980 ముందు వరకు స్వర్ణ యుగం. సబ్ డివిజన్ పరిధిలో సుమారు 50వేలు ఎకరాలకు పైగా పంట పండేది. రైతులు ఖరీఫ్, రబీ రెండు పంటలు పండించుకున్నారు. పల్లెలు ధాన్యరాశులతో కళకళలాడేవి. క్రమేణా ఆదోని 1, 2 ఎమ్మిగనూరు, గోనెగండ్ల పరిధిలో నానాయకట్టు పెరిగిపోయింది. అధికారులు చర్యలకు రాజకీయ ఒత్తిళ్లు అడ్డుకట్ట వేస్తున్నాయి. సుమారు 30 ఏళ్ల నుంచి చివరి ఆయకట్టు అంపశయ్యపై ఉంది. కోడుమూరు సబ్ డివిజన్ పరిధిలో 5ఆర్ (డబ్య్లూ) పిల్లకాలువ దాదాపుగా కనమరుగైంది. ఈ కాలువకు ఏళ్ల తరబడి సాగునీరు అందకపోవడంతో చివరి పొలాలు చాలా వరకు ప్లాట్లుగా మారాయి. కోడుమూరులో ఈ కాలువను పూడ్చి పేదలు గుడిసెలు నిర్మించుకున్నారు. 11ఎల్ కాలువ పరిస్థితి ఇదేమాదిరిగా ఉంది. 1ఎల్, 3 ఎల్, 6 ఎల్, 7 ఎల్, 8 ఎల్ కాలువలపై నానాయకట్టు పెరిగింది. ప్రధాన కాలువను ఆనుకుని ఉన్న పొలాల రైతులు ఏకంగా కాలువ కట్టపై మోటార్లు బిగించారు.
జీడీపీ పరిధి రైతులు కూడా..
జీడీపీ పరిధి రైతులు కూడా మోటార్ల ద్వారా తరలించు కుంటున్నారు. కొన్నిచోట్ల జీడీపీ, టీబీపీ మధ్య ఖాళీ ప్రదేశాన్ని చదునుచేసి పంటలు వేస్తున్నారు. దీనినిబట్టి అధికారుల ఉదాసీనత ఎంతో అర్థం అవుతుంది. దీంతో చివరి భూముల రైతులు వర్షాధార పంటలపై ఆధారపడాల్సి వస్తోంది. రబీలో చాలా రైతు కుటుంబాలు వలస వెళ్తున్నాయి. జలచౌర్యం పెచ్చుమీరడంతో ఆయకట్టు రైతులు ఒకటి రెండు తడులకు పోరాటం చేయాల్సివస్తోంది. చివరి ఆయకట్టుకు నీరందించ డంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. కోడుమూ రు సెక్షన్ పరిధిలోనే దాదాపు రెండువేల ఎకరాల నానాయకట్టు సాగవుతోందని అంచనా. నిర్వహణ పారదర్శకంగా జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
అడుగడుగునా మోటార్లు బిగించి..
కోడుమూరు సబ్ డివిజన్ ప్రారంభమయ్యే 4/7 కి.మీ కింద నుంచి కాలువకట్టపై అడుగడుగునా మోటార్లు బిగించారు. అక్రమంగా సాగునీటిని తరలించి పంటలు పండించుకుం టున్నారు. 2ఆర్ కాలువ దగ్గర నుంచి 3ఎల్(డై) కాలువ వరకు సుమారు 50 మోటార్లు ఉన్నాయి. కాలువలో యథేచ్ఛగా పైపులు వేసి తరలిస్తున్నా లస్కర్లు, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ముడుపులతో జేబులు తడుస్తుండటమే ఇందుకు కార ణం. నానాయకట్టు రైతుల దగ్గర ఎకరాకు రూ.2వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
సాగునీటి చౌర్యం జరగకుండా చూస్తా
కోడుమూరు సబ్ డివిజన్ ఎల్లెల్సీ కాలువ 4/7 కిమీ. నుంచి ప్రారంభ మవుతుంది. సబ్ డివిజన్‌కు రావా ల్సిన వాటాను అందించడానికి కృషి చేస్తాం. నానాయకట్టు తన దృష్టికి రా లేదు. సాగునీటి చౌర్యం జరగకుండా చూస్తాం.
సుబ్బరాయుడు, డీఈ, కోడుమూరు సబ్ డివిజన్
కోర్టును ఆశ్రయించా
మాకు 3ఎల్, 7ఎల్, 8ఎల్ ఆరుతడి కింద దాదాపు 36 ఎకరాల సొంత పొలం ఉంది. ఆయా కాలువల పరిధిలో 4వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గత 25 ఏళ్లకు పైగా ఆయకట్టుకు నీరందడం లేదు. సాగునీటి కోసం ఏఈ, డీఈ, ఈఈ అధికా రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. సాగునీరందక వర్షాధార పంటలపై ఆధారపడుతున్నాం. ఈ పరిస్థితుల్లో మెట్ట భూమిగా పరిగణించాలని హైకోర్టును ఆశ్రయించా.
విజయభాస్కరరెడ్డి, రైతు, పులకుర్తి