Share News

హంద్రీకి నీటి విడుదల

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:51 PM

గాజులదిన్నె ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురియడంతో జీడీపీకి వరద వచ్చి చేరుతుంది.

హంద్రీకి నీటి విడుదల
శనివారం 10వేల క్యూసెక్కుల నీటిని హంద్రీని వదిలిన దృశ్యం

జీడీపీని సందర్శించిన ఇరిగేషన్‌ ఎస్‌ఈ

గోనెగండ్ల, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురియడంతో జీడీపీకి వరద వచ్చి చేరుతుంది. దీంతో శుక్రవారం రాత్రి 4, 5 గేట్లను ఎత్తి 2వేల క్యూసెక్కులను విడుదల చేశారు. అయితే ఎగువ ప్రాంతాల నుంచి 15వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రావడంతో శనివారం ఉదయం పది గంటలకు రెండు గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కులను హంద్రీనదికి విడుదల చేశారు. కాగా శనివారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. ప్రస్తుతం 376.70 మీటర్లు (3.88 టీఎంసీలు)వరకు నీటిని నిల్వ ఉంచాలని అధికారులు నిర్ణయించారు. సాయంత్రం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో తగ్గి పోవడంతో 4, 5 గేట్లను రాత్రి మూసివేశారు. అనంతరం మూడో గేట్‌ తెరిచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన మద్దికెర, పత్తికొండ, ఆస్పరి, తుగ్గలి ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షాలు కురియడంతో వరద నీరు వచ్చి జీడీపీకి చేరింది. ఈ ప్రాంతాల నుంచి శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు 15వేల క్యూసెక్కులు చేరాయి.

ప్రాజెక్టును సందర్శించిన ఇరిగేషన్‌ ఎస్‌ఈ

గాజులదిన్నె ప్రాజెక్టును జిల్లా ఇరిగేషన్‌ ఎస్‌ఈ బాల చంద్రారెడ్డి, ఈఈ పాండురంగయ్య శనివారం సందర్శించారు. ప్రాజెక్టులో ఎంత నీరు ఉంది? ప్రస్తుతం ఇన్‌ఫ్లో ఎంత ఉంది?, అవుట్‌ గోయింగ్‌ ఎంత ఉంది? అని ఇరిగేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గేట్ల పరస్థితిని కూడా తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా చూడాలని అధికారును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీడీపీ ఏఈ మహుమ్మద్‌ఆలీ, ఉగ్రనరసింహులు, సిబ్బంది పాల్గొన్నారు.

కోడుమూరు: గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో కోడుమూరు హంద్రీనదికి జలకళ సంతరించుకున్నది. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో పంచాయతీ మంచినీటి పథకాల వైపు నీటి ప్రవాహం ముంచుకురావడంతో ముందుస్తు జాగ్రత్తగా అధికారులు మోటార్లను తొలగించారు. దీని ఫలితంగా తాగునీటికి కొంత అంతరాయం వాటిల్లుతుందని అధికారులు ప్రజలకు తెలిపారు.

Updated Date - Sep 13 , 2025 | 11:51 PM