Share News

ప్రతి ఎకరాకూ నీరు

ABN , Publish Date - Jul 18 , 2025 | 12:02 AM

కృష్ణా జలాలతో రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్లివ్వడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

ప్రతి ఎకరాకూ నీరు

మల్లన్న నీళ్లు.. వెంకన్న వరకు

సీమను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా

హంద్రీ నీవా ద్వారా సాగు, తాగు నీరు

నందికొట్కూరు అభివృద్ధికి అడుగులు

కర్నూలులో హైకోర్ట్‌ బెంచ్‌ ఏర్పాటు

నంద్యాల, జూలై17(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలతో రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్లివ్వడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీశైల మల్లన్న నీళ్లను.. తిరుపతి వెంకన్న వరకు తీసుకెళ్తామన్నారు. గురువారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పర్యటనలో ఆయన ముందుగా మల్యాల పంపింగ్‌ స్టేషన్‌ వద్ద వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేసి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత మూడు మోటర్లను ఆన్‌చేసి నీరు వదిలారు. అనంతరం నంది కొట్కూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ సీమ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. హార్టికల్చర్‌ పంటలను మరింత పెంచి రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టేలా చూస్తామన్నారు. రైతులకు అండగా ఉండేలా పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తామన్నారు. పారిశ్రామికంగా సీమ లోని నాలుగు జిల్లాలను విడుతల వారిగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధానంగా హంద్రీనీవా ద్వారా నీరు 600కిలోమీటర్లు ప్రవహించి చిత్తూరు జిల్లా కుప్పం వరకు వెళ్తాయన్నారు. హంద్రీ నీవా నీటితో రాయలసీమలోని 6లక్షల ఎకరాలకు సాగునీరు.. 33 లక్షల మందికి తాగునీరు అందిస్తున్నామన్నారు. రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి కనీసం రెండు పంటలను వేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.వేదవతి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి..ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజక వర్గాలకు సాగునీరు ఇస్తామన్నారు. గోరకల్లు మరమ్మతులకు రూ.96 కోట్లు మంజూరు చేస్తామన్నారు. అలగనూరు జలాశయానికి రూ. 36 కోట్లు విడుదల చేసి పూర్తి చేస్తామన్నారు. మిట్టూరులో లిప్ట్‌ ఇరిగేషన్‌ కింద కలవందలపాడు, హంద్రీనీవా సుజల స్రవంతి కెనాల నుంచి 19వ కిలోమీటర్‌లో ఒక లిఫ్ట్‌ పెడితే 6వేల ఎకరాలకు సుభిక్షమవుతుందని స్థానిక రైతులు చెప్పారు. దీని కోసం రూ. 60 కోట్లు విడుదల చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఒక మోడల్‌ స్కూల్‌, ఆస్పత్రి పడకలను పెంచుతామని ప్రజలకు వరాల జల్లు కురిపించారు. 98జీవో ప్రకారం బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రాయలసీమకు నీళ్లిచ్చానన్న సంతృప్తి జీవితంలో ఎప్పటికీ మరవలేనన్నారు. త్వరలోనే హంద్రీనీవా ఫేజ్‌-2 పనులు పూర్తి చేసి సత్యసాయి జిల్లాలోని మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, అన్నమయ్య జిల్లాలోని శ్రీనివాసపురం, అడివిపల్లి రిజర్వాయర్లు నింపుతామన్నారు. సుపరిపాలనతో తొలి అడుగు వేశామన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు అద్భుత విజయం అందించారన్నారు. ఇచ్చిన హామీల పరంగా.. ఒకటో తేదినే పింఛన్‌ అందజేస్తున్నామన్నారు. తల్లికి వందనం అందరికి వర్తింప చేస్తున్నామన్నారు. 207 అన్న క్యాంటీన్‌లు పెట్టి పేద ప్రజల కడుపు నింపుతున్నామన్నారు. అన్నదాత సుఖీభవ కూడా త్వరలోనే అందజేస్తామన్నారు. రాయలసీమను రతనాల సీమ మార్చడంతో పాటు రాష్ట్రానికే మణిహారంగా సీమను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. హంద్రీ నీవా నుంచి చిత్తూరుకు నీరు తీసుకెళ్లి ఎన్టీఆర్‌ కలను టీడీపీ నెరవేర్చిందన్నారు. కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి, పత్తికొండ, అనంతపురం జీడీపల్లి రిజర్వాయర్లను త్వరలోనే నింపుతామన్నారు.

కాలువల్లో కృష్ణమ్మ పరవళ్లు..

సీఎం చంద్రబాబు చేతులు మీదుగా నీటిని విడుదల చేయడంతో సీమలోని కూటమి శ్రేణలతో పాటు రైతుల్లో సంతోషం రెట్టింపైంది. ఇదే క్రమంలో హంద్రీ నీవా కాలువల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తరలివచ్చిన టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పలు సాగునీటి సంఘాలు, రైతులు తదితర వారితో నందికొట్కూరు కిక్కిరిసిపోయింది.

రుణం తీర్చుకుంటా

సీఎం చంద్రబాబు

నందికొట్కూరు సీఎం హామీలు

నందికొట్కూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు నియోజకవర్గంలో 20 ఏళ్లుగా గెలవని టీడీపీని గెలిపించిన ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని, ఆ బాధ్యత తనపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా గెలుపెరగని టీడీపీని ఈసారి నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. అలాంటి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆ దిశగా ఇక్కడున్న ఎంపీ, ఎమ్మెల్యే కూడా పని చేయాలని అన్నారు. మల్యాల పర్యటన సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గంపై సీఎం హామీల జల్లు కురిపించారు.

మిడ్తూరు మండలం కలమందలపాడు వద్ద మిడ్తూరు ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు అతి త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. హంద్రీనీవా కాలువ 19వ కిలోమీటరు వద్ద రూ.60 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 6 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

నందికొట్కూరు మండలంలో మోడల్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రస్తుతం 30 పడకలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తామన్నారు.

అలగనూరు రిజర్వాయర్‌ మరమ్మతులకు రూ.36 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామన్నారు.

98 జీవో బాధితులకు కూడా న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

కృష్ణమ్మకు జలహారతి

హంద్రీ నీవాకు నీరు విడుదల చేసిన సీఎం చంద్రబాబు

నందికొట్కూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హంద్రీ-నీవా కాలువకు నీరు విడుదల చేస్తూ జలహారతి సమర్పించారు. గురువారం నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం వద్ద శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా హెచ్‌.ఎన్‌.ఎస్‌.ఎస్‌ కాలువకు నీరు విడుదల చేశారు. అక్కడ ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు, రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు బాబు సూచించారు. ఇరిగేషన్‌ శాఖ అంటే ప్రాజెక్టులు, కాల్వలే కాకుండా, భూగర్భ జలాల వినియోగం వంటివి కూడా చూసుకోవాలన్నారు. తిరుపతి వద్ద గాలేరు-నగరి, హంద్రీ-నీవా, సోమశిల- స్వర్ణముఖి కలిసేలా ప్రణాళికలు చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. మల్యాల పంపింగ్‌ స్టేషన్‌ వద్ద పూజలు నిర్వహించి బటన్‌ నొక్కి మూడు పంపుల ద్వారా నీరు విడుదల చేశారు. అనంతరం హంద్రీనీవా కాలువ వద్దకు చేరి వేదమంత్రాల నడుమ కృష్ణమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించి జలహారతి ఇచ్చారు. చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు గిత్తా జయసూర్య, బుడ్డా రాజశేఖరరెడ్డి, గుమ్మనూరు జయరాం, గౌరు చరితారెడ్డి, అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానందరెడ్డి, కోట్ల సుజాతమ్మ, కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా, మాండ్ర శివానందరెడ్డి, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మౌలానా షేక్‌ ముస్తాక్‌ అహ్మద్‌, డీసీఎంస్‌ నాగేశ్వరరావు యాదవ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, రెవెన్యూ, పోలీసు అధికారులు తదితరులు ఉన్నారు.

రైతుల ఘనస్వాగం: మల్యాల ఎత్తిపోతల పథకం వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులు మల్యాల సర్పంచ్‌ ఉమాదేవి, మాజీ సర్పంచ్‌ గూడ్‌సాహెబ్‌ తదితరులు పూలమాల వేసి ఘనస్వాగతం పలికారు.

సీఎం పర్యటన సాగిందిలా..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నందికొట్కూరు పర్యటన విజయవంతంగా ముగిసింది. గురువారం మధ్యాహ్నం 12.59 గంటలకు ఓర్వకల్లు విమాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో అల్లూరు గ్రామానికి బయలుదేరి 1.08 గంటలకు అల్లూరు గ్రామంలోని ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.

అక్కడ మంత్రులు, ఎమ్మెల్యే, అధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు.

1.25 గంటలకు అల్లూరు నుంచి బయలుదేరి 1.40 గంటలకు మల్యాల పంపింగ్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో పండితులు ఆహ్వానం పలికారు.

1.53 గంటలకు పూజలు చేసి బటన్‌ నొక్కి మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా హెచ్‌.ఎన్‌.ఎస్‌.ఎస్‌.కు నీటిని విడుదల చేశారు.

2.04 గంటలకు హంద్రీనీవా వద్ద ముఖ్యమంత్రి జలహారతి ఇచ్చారు.

2.10 వరకు సీఎంకు ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య రైతులను పరిచయం చేశారు.

2.11 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.25కు మల్యాల క్రాస్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు.

2.14 గంటలకు సభ ప్రారంభమైంది.

2.52 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభించి 3.56 గంటలకు ముగించారు.

4 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.05 గంటలకు అల్లూరు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.

4.36 గంటలకు నందికొట్కూరు మల్యాల గ్రామంలో సీఎం పర్యటను ముగించుకొని ఓర్వకల్లు విమానాశ్రయానికి హెలికాఫ్టర్‌ ద్వారా బయలుదేరి వెళ్లారు.

జూలైలోనే నీరు విడుదల: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎప్పూడూ లేని విధంగా జూలై నెలలోనే హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు విడుదలైంది. నందికొట్కూరు నియోజకవర్గ చరిత్రలో ఈ రోజు నిలిచిపోతుంది. ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన హెచ్‌.ఎన్‌.ఎస్‌.ఎస్‌ ప్రాజెక్టుకు నీరు విడుదల చేసి రాయలసీమకు నీళ్లివ్వడం సంతోషించదగ్గ విషయం. నియోజకవర్గ ప్రజల కలగా ఉన్న మిడ్తూరు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలి. పట్టణంలోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలి. బేడ బుడగజంగాలకు కుల ధృవీకరణ పత్రాన్ని అందజేయాలి.

రాయలసీమ రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు: నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి

రైతులకు సాగునీరు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ రైతుబిడ్డ. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పక్కనపెట్టి రైతులను నట్టేట ముంచింది. కూటమి ప్రభుత్వం రూ.3,890 కోట్లతో వంద రోజుల్లో హంద్రీనీవా విస్తరణ పనులు పూర్తి చేసింది. ఇది సీఎంకు ప్రాజెక్టులపై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌ ట్రాన్స్‌ఫరాఆలు ఏర్పాటు చేయాలి. సిద్ధేశ్వరం అలుగును నిర్మించాలి.

రాయలసీమ ద్రోహి జగన్మోహన్‌రెడ్డి: నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖామంత్రి

హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ విస్తరణ పనులు చేపడతానని రాయలసీమకు ఏ ముఖ్యమంత్రీ చేయని ద్రోహం జగన్మోహన్‌రెడ్డి చేశారు. ఆనాడు జగన్‌ హంద్రీనీవా విస్తరణ పనులను ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేస్తానని 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఒక్క తట్టమట్టికూడా వేయలేదు. చివరికి విద్యుత్‌ బిల్లులు కూడా చెల్లించలేదు. 1995లో నందమూరి తారక రామారావు హంద్రీ నీవాకు బీజం వేస్తే... చంద్రబాబు నాయుడు 3,850 క్యూసెక్కుల సామర్థ్యం గల పంపుల ద్వారా రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.

గంట గంటకు జగన్మోహన్‌రెడ్డి దిగజారుతున్నారు : పయ్యావుల కేశవ్‌, ఆర్థిక శాఖామంత్రి

రోజురోజుకు ఎదిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు, గంట గంటకు దిగజారిపోయే వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి. వైసీపీ గత ఐదేళ్ల కాలంలో హంద్రీ నీవా కాలువ విస్తరణ పనులకు ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు. రప్పారప్పా నరుకుతాం...రక్తపాతం, అశాంతి సృష్టిస్తాం అని వాళ్లు అంటే... అభివృద్ధి, సాగునీరు అందించే సుపరిపాలన కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Jul 18 , 2025 | 12:02 AM