Share News

రూ.400 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:08 AM

డోన్‌ నియోజకవర్గ ప్రజల దాహం తీర్చేందుకు ప్రభుత్వం రూ.400 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ పథకం చేపడుతున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

రూ.400 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే కోట్ల

కలెక్టర్‌ రాజకుమారి

ప్యాపిలి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : డోన్‌ నియోజకవర్గ ప్రజల దాహం తీర్చేందుకు ప్రభుత్వం రూ.400 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ పథకం చేపడుతున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. శనివారం మండలంలోని చంద్రపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డితో కలసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి డోన్‌ నియోజకవర్గానికి వాటర్‌గ్రిడ్‌ ద్వారా తాగునీరు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే బేతంచెర్ల మండలానికి నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే మార్చి నాటికి డోన్‌, ప్యాపిలి మండలాలకు ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. అలాగే జిల్లాలో 330 మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులున్నాయని, అందులో 249 ట్యాంకులకు నీరు నింపామని కలెక్టర్‌ తెలిపారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ డోన్‌ నియోజకవర్గంలోని 30 చెరువులకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా నీరు నింపామన్నారు. మరో 5 చెరువులకు కూడ త్వరలో నీరందిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌, ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అంతకు ముందు మండలంలోని వెంగళాంపల్లి, గుడిపాడు, చంద్రపల్లి, హుసేనాపురం చెరువులను కలెక్టర్‌, ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ నాగేశ్వరరావుయాదవ్‌, ప్రభాకర్‌రెడ్డి, వై లక్ష్మీనారాయణయాదవ్‌, టి శ్రీనివాసలు, ఖాజాపీర్‌, మోపూరి రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 12:08 AM