జీడీపీకి జలకళ
ABN , Publish Date - Aug 18 , 2025 | 11:30 PM
జిల్లాలో రైతుల జీవనాడి అయిన గాజులదిన్నె ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతోంది.
ప్రస్తుతం ప్రాజెక్టులో 2.010 టీఎంసీల నీరు
రబీలో సాగుకు ఇబ్బంది ఉండదని ఆయకట్టు రైతుల ఆనందం
పలు ప్రాంతాలకు తీరనున్న తాగునీటి సమస్య
గోనెగండ్ల, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతుల జీవనాడి అయిన గాజులదిన్నె ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతోంది. పది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జీడీపీకి రోజూ వరద వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రంకు జీడీపీలో 2.010 టీఎంసీ(లైవ్) నీరు ఉన్నట్లు జీడీపీ ఇరిగేషన్ ఏఈ మహమ్మద్ అలీ తెలిపారు. హంద్రీ-నీవా నుంచి రోజుకు 120 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అలాగే తుంగభద్ర దిగువ కాలువ నుంచి రోజుకు 60 క్యూసెక్కుల నీరు చేరుతోంది. సోమవారం ఒక్కటే ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి దాదాపు వెయ్యి క్యూసెక్కుల నీరు ప్రాజెక్టును చేరింది. మూడేళ్లుగా వరద నీరు వచ్చి చేరలేదు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన మద్దికెర, తుగ్గలి, పత్తికొండ, రాతన, తదితర ప్రాంతాలలో వర్షం కురవడంతో వరద నీరు వచ్చి చేరుతోంది. తెర్నేకల్లు వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి నుంచి కూడా నీరు జీడీపీలోకి చేరుతోంది. ప్రాజెక్టు కింద ఉన్న తాగునీటి పథకాలకు ఇక నీటి ఇబ్బంది ఉండదు. పత్తికొండ, డోన్, క్రిష్ణగిరి తాగునీటి పథకాలకు, అవసర సమయంలో కర్నూలు, కోడుమూరు, గూడూరు, సి.బెళగల్ ప్రాం తాలకు కూడా తాగునీటి కోసం నీటిని విడుదల చేస్తారు. ఇక వచ్చే రబీకి నీటి కష్టాలు తీరుతాయని ఆయకట్టు రైతుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కింద 24,500 ఎకరాలు రబీలో సాగుకావాల్సి ఉంది. జీడీపీ లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో వచ్చే ఏడాది ఆయ కట్టు భూములకు సాగు ఇబ్బంది లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.