Share News

పాతికేళ్లకు జలకళ

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:35 AM

ఎక్కడ నీరుంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. నీరు ఉంటే బంగారు పంటలు పండుతాయి. నీరు లేకపోతే కరువు కాటకాలతో అల్లాడాల్సిన పరిస్థితులు. అందుకే మన పూర్వికులు నీటి ప్రాధాన్యాన్ని గుర్తించి, ముందుచూపుతో వ్యవహరించారు.

పాతికేళ్లకు జలకళ
కళకళలాడుతున్న చెరువు

మొన్నటి దాకా ఒట్టిపాయె..

నేడు నీటితో కళకళలాడే

75శాతం నిండిన చెరువు

పెరుగుతున్న భూగర్భ జలాలు

ఆనందంలో అన్నదాతలు

ఎక్కడ నీరుంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. నీరు ఉంటే బంగారు పంటలు పండుతాయి. నీరు లేకపోతే కరువు కాటకాలతో అల్లాడాల్సిన పరిస్థితులు. అందుకే మన పూర్వికులు నీటి ప్రాధాన్యాన్ని గుర్తించి, ముందుచూపుతో వ్యవహరించారు. చెరువులు, కుంటలను తవ్వించారు, ప్రాజెక్టులను నిర్మించారు. వర్షపు నీటిని మళ్లించి భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకున్నారు. ఎర్రదొడ్డి గ్రామానికి అనుకొని ఉన్న చెరువుకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చెరువును తవ్వినప్పటి నుంచి ఒట్టిపోయింది. ఇటీవలే రైతులు ప్రజాప్రతినిధులను కలిసి సమస్యను వివరించారు. దీంతో వారు సమస్యను కలెక్టర్‌, ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు టీబీపీ నీటిని గోరంట్ల మేజర్‌ ద్వారా మళ్లించారు. దాదాపుగా నెలరోజుల పాటు చెరువుకు నీటిని విడుదల చేయడంతో 75 శాతం నిండింది. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కోడుమూరు రూరల్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎర్రదొడ్డి గ్రామానికి అనుకొని ఓ చెరువు ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వమే దీన్ని తవ్వించినట్లు తెలుస్తోంది. మొదట్లో ఈ చెరువు పంచాయతీరాజ్‌ విభాగం కింద ఉండేది. 2007లో చెరువును మైనర్‌ ఇరిగేషన్‌ శాఖకు బదలాయించారు. ఎర్రదొడ్డి చెరువు మొత్తం 3.06 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వ్యాపించింది. ఈచెరువు దాదాపు 11.43 మెట్రిక్‌ క్యూసెక్కుల (ఫర్‌ ఫీట్‌) సామర్థ్యం ఉంది. అధికారుల లెక్కల ప్రకారం చెరువు ఆయకట్టు 20.3ఎకరాలు మాత్రమే. అయితే అనధికారికంగా సుమారు 200 ఎకరాలకు పైనే.

రైతుల విన్నపాలు నెరవేరిన వేళ

నెల రోజుల క్రితం రైతులు డీసీ-8 చైర్మన్‌ కే. చంద్రశేఖర్‌, డబ్య్లూయూఏ అధ్యక్షుడు మేకల శంకర్‌, టీడీపీ నాయకులతో కలిసి కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిలను కలిశారు. ఎన్నోఏళ్లుగా చెరువుకు నీళ్లు రావడం లేదని తమ ఇబ్బందులపై విన్నవించారు. వారు సమస్యను కలెక్టర్‌, ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు టీబీపీ నీటిని గోరంట్ల మేజర్‌ ద్వారా మళ్లించారు. దాదాపుగా నెలరోజుల పాటు చెరువుకు నీటిని విడుదల చేయడంతో 75 శాతం నిండింది. ఎగువ రైతుల అవసరాల అనంతరం తిరిగి చెరువుకు మళ్లించి పూర్తిగా నింపుతా మని అధికారులు అంటున్నారు.

నీళ్లు అందక చాలా ఏళ్లయ్యింది

ఎర్రదొడ్డి చెరువుకు కాలువల ద్వారా నీళ్లు అందక చాలా ఏళ్లయ్యింది. వర్షాకాలంలో భారీ వర్షాలు వస్తే కొంతమేర జలాలు చేరేవి. పాతికేళ్లలో చెరువు ఎన్నడూ నిండలేదు. దీంతో రైతులు ఖరీఫ్‌ పంటపై ఆధారపడేవారు. రబీ సీజన్‌లో చాలా కుటుంబాలు వలస వెళ్లేవారు. సమీప బోరు బావులు కూడా భూగర్బజలాలు అందక అరకొరగా పారేవి. వర్షాభావ పరిస్థితుల్లో చెరువులో చుక్కనీరు ఉండేది కాదు. చెరువు ఒట్టిపోయిన సందర్భాలే అధికంగా ఎదుర్కొన్నామని స్థానిక ప్రజలు ఆవేదన చెందారు.

సుమారు లక్ష చేప పిల్లలను..

ఒట్టిపోయిన చెరువుకు జలజీవం కలగడంతో రైతుల సంతోషానికి అవ ధులు లేవు. పనిలో పనిగా చెరువులో సుమారు లక్ష వరకు చేపపిల్లలను వదిలారు. చేపలను పెంచి విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును గ్రామాభి వృద్ధికి వినియోగిస్తామని తెలిపారు.

భూగర్భ జలాలు పెరుగుతాయి

మా పెద్దల హయాంలో చెరువు తవ్వించారని విన్నా. ఎప్పుడూ చెరువు ఒట్టిగానే ఉంది. వర్షాలు ఎక్కువగా కురిసిన ఏడాది మాత్రమే కొద్దోగొప్పో నీరు చేరేది. ఇప్పటిలా నిండుగా ఎన్నడూ చూడలేదు. బోర్లకు భూగర్భ జలాలు పెరుగుతాయి. మూగజీవాలకు నీటి సమస్య తీరింది.

సోమన్న, రైతు, ఎర్రదొడ్డి

పూర్తిగా నింపుతాం

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎర్రదొడ్డి చెరువును పూర్తిస్థాయిలో నింపుతాం. ఎగువ ప్రాంతంలో రైతుల అవసరాలకు వినియోగిస్తున్నాం. వర్షం పడ్డ వెంటనే తిరిగి చెరువుకు మళ్లిస్తాం. ఇటీవల డీఈ చెరువును పరిశీలించారు.

దుర్గాభవాని, ఏఈ, టీబీపీ

గర్వంగా ఉంది

ఎర్రదొడ్డి చెరువుకు నీరు విడుదల చేయించాలని కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కోరాం. వారు స్పందించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. టీబీపీ నీటిని విడుదల చేయడంతో చెరువులో నీరు చేరింది. ఎన్నో ఏళ్లుగా ఒట్టిపోయిన చెరువు నీటితో కళకళలాడుతుండడం గర్వంగా ఉంది.

కే. చంద్రశేఖర్‌, చైర్మన్‌, డీసీ-8

Updated Date - Sep 15 , 2025 | 12:35 AM