పథకం ప్రకారమే హత్య?
ABN , Publish Date - May 12 , 2025 | 11:30 PM
మానవ అస్తిపంజరంలోని కొన్ని ఎముకలు, లభ్యమైన ఆనవాళ్లతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిపై ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన వరుస కథనాలతో ఓ కేసు మిస్టరీ వీడుతోంది.
గడివేముల ఘటనలో రోజుకో ట్విస్ట్
వివాహేతర సంబంధమే హత్యకు దారి?
మద్యం తాపి..ఆపై పెట్రోల్ పోసి..
చిన్న ఎముకలను విసిరేశారు
పెద్ద ఎముకలను పొడిగా మార్చి..
పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు
పోలీసుల తీరుపైనా అనుమానాలు
ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో వెలుగులోకి వాస్తవాలు
నంద్యాల, మే 12 (ఆంధ్రజ్యోతి): మానవ అస్తిపంజరంలోని కొన్ని ఎముకలు, లభ్యమైన ఆనవాళ్లతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిపై ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన వరుస కథనాలతో ఓ కేసు మిస్టరీ వీడుతోంది. గత నాలుగు రోజులుగా ‘పోలీస్.. ఇదేం తీరు..’ ‘మిస్టరీ వీడేనా..’ కథనాలు పోలీస్ శాఖను కుదిపేసింది. ఈ కథనాలపై జిల్లా పోలీస్ బాస్ తమదైన శైలిలో స్పందించి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ మంద జావలి అల్ఫోన్స్ నేతృత్వంలో సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐలు నరేంద్రరెడ్డి, నాగార్జునరెడ్డిలు తదితర సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి మూడు రోజులుగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు మరింత ఉత్కంఠ రేపుతోంది. విశ్వనీయవర్గాల సమాచారం మేరకు.. పథకం ప్రకారమే హత్య జరిగినట్లు స్పష్టమైంది. అయితే హత్య అనంతరం విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసి గుర్తు పట్టకుండా శరీరంపై యాసిడ్, పెట్రోల్ పోసి దహనం చేశారు. ఆ తర్వాత మిగిలిన అస్తిపంజరంలోంచి చిన్న ఎముకలను విసిరేసి.. పెద్ద ఎముకలను పిండి చేసి అక్కడక్కడ పడేశారని సమాచారం. మొత్తంగా వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు మొదట్లోనే కేసు నమోదు చేయకుండా జాప్యం చేయడం, ఆనవాళ్లను పోలీసులే మాయం చేసిశారంటూ స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిగా లభ్యమైన ఆనవాళ్లతో ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకోవడం హాట్ టాఫిగా మారింది.
హత్యలో పక్కా స్కెచ్?
గడివేమల మండలానికి చెందిన ఓ గొర్రెల కాపరి కొన్నేళ్లుగా తాగుడికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్య, పిల్లలు కూడా సదరు కాపరిని వదిలేశారు. దీంతో అక్కడక్కడ గొర్రెల కాపరిగా వెళ్తూ.. వచ్చే కూలీ డబ్బుతో వ్యసనాలు తీర్చుకునేవారు. ఆ గొర్రెల కాపరి గత నెల 23వ తేదీ నుంచి తన సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ అయినట్లు గుర్తించారు. దీంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని నెలలలుగా అదే మండలానికి చెందిన ఓ గొర్రెల యజమానికి వద్ద గొర్రెల కాపరిగా కూలీకి చేరాడు. అయితే సదరు యజమానికి చెందిన బంధువుల్లో ఇద్దరు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు గొర్రెల కాపరికి, యజమాని కుటుంబ సభ్యులతో పాటు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులతో వివాదం మొదలైంది. గొర్రెల కాపరి చేసిన పనికి కుటుంబ పరువు బజారున పడుతుందని ఆ కాపరిపై కక్ష పెంచుకున్నట్లు సమాచారం. యజమాని కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారా..? లేక వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు సదరు కాపరిపై కక్ష పెట్టుకున్నారా...? అన్న విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఏప్రిల్ 23వ తేదీన గడివేముల మండల పరిధిలో సదరు గొర్రెల కాపరితో పాటు మరోక వ్యక్తి కూడా మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డయినట్లు సమాచారం. మొత్తంగా గొర్రెల కాపరిని పథకం ప్రకారమే హత్య చేసిన ట్లు దర్యాప్తులో వెలుగు చూసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.
మద్యం తాపి ఆపై...
పథకం ప్రకారమే గొర్రెల కాపరిపై కక్ష పెంచుకున్న రెండు వర్గాలు సైతం (వీరిలో ఏ వర్గం ఈ దాడికి పాల్పడిందో) సదరు కాపరిని అంతమొందించడానికి ప్యూహాత్మకంగా పథకం వేసినట్లు తెలుస్తోంది. సదరు కాపరికి మద్యానికి బానిసగా ఉండటంతో సదరు నిందితులకు మరింత కలిసి వచ్చినట్లైంది. గత నెల 23న పథకంలో భాగంగా మద్యం షాపునకు పంపారు. ఆ తర్వాత అక్కడి నుంచి కాపరిని మాయమాటలతో నమ్మించి.. ఈనెల 9వ తేదిన గడివేముల మండల శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. నిందితులు మాటువేసి మద్యం సేవించిన తరువాత కాపరిని రాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. అనుమానం రాకుండా మృతదేహంపై పెట్రోల్ లేదా యాసిడ్ పోసి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. తర్వాత ఆనవాళ్లు గుర్తు పట్టకుండా పెద్ద ఎముకలను పొడి చేసి అక్కడక్కడ పడేశారని తెలిసింది. మిగిలిన కొన్ని ఎముకలను సైతం వేర్వేరుగా విసిరేసినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే ఎంతో కర్కశంగా సదరు కాపిరిని హత్య చేశారనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఘటనకు సంబందించి ఆరుగురు నిందితులను డీఎస్పీ నేతృత్వంలో సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు తదితర సిబ్బంది కలిసి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఒక్కొక్కరిగా విచారణ చేయగా.. పలు ఆసక్తి విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో పోలీసుల్లోను ఉత్కంఠ రేపుతోందని తెలిసింది.
కొందరు పోలీసులపై ఆరోపణలు
ఈ ఘటన విషయంలో లోతుగా పరిశీలిస్తే కొందరు పోలీసులపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ రైతు తన పొలంలో గత నెల 28వ తేదిన జొన్న పంటను తొలగిస్తుండగా.. అస్థి పంజరం ఆనవాళ్లు బయటపడ్డాయని గడివేముల పోలీసులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత పోలీసులు సైతం సంఘటన స్థలానికి స్పష్టత లేని ఆనవాళ్లు ఉన్నాయని గ్రహించారో..? లేక గుర్తు తెలియని శవం కదా...? భవిష్యత్‌లో మనకెందుకు సమస్య అని వదిలేశారో..? కానీ స్పాట్‌కు వెళ్లి కూడా ఆ రోజున పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలేశారు. ఆ తర్వాత ఆనవాళ్లు సైతం బూడిద కావడంతో పోలీసులే ఈ పని చేయించారన్న ఆరోపణలు లేకపోలేదు. అంతటితో ఆగకుండా సదరు ఆనవాళ్ల ఫొటోలు తీసిన రైతుతో కూలీలు (ఇతర వ్యక్తులు) సెల్‌ఫోన్లు తీసుకుని పోలీసులు డిలీట్ చేయించడం అనుమానాలకు తావిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల్లో ఒకింత ఆందోళన కలిగిస్తోంది. మొత్తం మీద నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఎలాంటి చర్యలు ఉంటాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.