వాటా ఇస్తేనే..
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:39 AM
నగరపాలక సంస్థ పరిధిలో ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు ఇటీవలే ప్రభుత్వం బకాయి వేతనాలను విడుదల చేసింది. సుమారు 21 మంది కార్మికులకు మూడేళ్ల కిందట రావాల్సిన బకాయిలు వచ్చాయి. ఈ క్రమంలో బకాయి వేతనాలు శానిటరీ ఇన్స్పెక్టర్ల ఖాతాలో జమఅయ్యాయి. వేతనాల్లో తమ వాటా ఇస్తేనే మిగతా డబ్బులు ఇస్తామని కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చెబుతున్నట్లు సమాచారం.
శానిటరీ ఇన్‌స్పెక్టర్ల డిమాండ్
యూనియన్ నాయకులతో కలిసి దందా
ఇబ్బందులు పడుతున్న కార్మికులు
హాట్ టాపిక్‌గా బకాయిల పంచాయితీ
కర్నూలు న్యూసిటీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలో ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు ఇటీవలే ప్రభుత్వం బకాయి వేతనాలను విడుదల చేసింది. సుమారు 21 మంది కార్మికులకు మూడేళ్ల కిందట రావాల్సిన బకాయిలు వచ్చాయి. ఈ క్రమంలో బకాయి వేతనాలు శానిటరీ ఇన్స్పెక్టర్ల ఖాతాలో జమఅయ్యాయి. వేతనాల్లో తమ వాటా ఇస్తేనే మిగతా డబ్బులు ఇస్తామని కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చెబుతున్నట్లు సమాచారం.
దందాకు తెర..
శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కార్మిక సంఘాల నాయకులతో దందాకు తెర లేపారు. కార్మికుల నుంచి అందినకాడికి దోచుకునేందుకు పావులు కదుపుతున్నారు. బకాయి వేతనాలు తామే ప్రభుత్వంతో ఒప్పించి ఇప్పించామని యూనియన్ నాయకులు అంటున్నారు. అయితే వేతనం రూ.13 వేలు ఉండగా రూ.15 వేలు చేయించింది తామేనని శానిటరీ ఇన్‌స్పెక్టర్ల్లు చెప్పుకుంటున్నారు. మూడేళ్ల క్రితం పారిశుధ్య విభాగంలో 21 మంది కార్మికు లను విధుల్లోకి తీసుకున్నారు. వారికి అప్పట్లో ఆరు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఆ బకాయిలొచ్చాయి. ఒక్కో కార్మికుడికి ఆరు నెలలకు కలిపి రూ.90 వేలు రావాలి. ఒక్కో కార్మికుడి నుంచి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రూ.10 నుంచి రూ.15 వేలు డి మాండ్ చేస్తుండగా యూనియన్ నాయకులు ఒక్కో కార్మికుడి నుంచి రూ.2 నుంచి రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేతనాల పంచాయితీ నగర పాలకలో హట్ టాపిక్‌గా మారింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఈ విషయంపై స్పందించి న్యాయం చేస్తారని కార్మికులు ఆశిస్తున్నారు. బకాయిలను నేరుగా కార్మికుల ఖాతాల్లో జమచేయవచ్చు. అధికారులు ఆ దిశగా ఆలోచించకుండా వాటాలు పంచుకోవచ్చనే ఉద్దేశ్యంతో శానిటరీ ఇన్స్పెక్టర్ల ఖాతాలో జమ చేశారు. ఈ నేపథ్యంలోనే వాటాలు పంచుకోవడానికి మార్గం సులువైంది.
ఫిర్యాదు చేస్తే చర్యలు
కార్మికుల నుంచి శానిటరీ ఇన్‌స్పెక్టర్ల డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఇప్పటి వరకు ఎవ్వరూ మా దృష్టికి తీసుకు రాలేదు. మాకు తెలిసి కూడ కార్మికులను ఫిర్యాదు చేయమని చెప్పినా ఎవ్వరు ముందుకు రావడము లేదు. అలాంటప్పుడు చర్యలు ఎలా తీసుకుంటాం. ముగ్గురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఇవ్వలేదని తెలిసింది. మిగిలిన వారందరు కార్మికులకు డబ్బులు ఇచ్చేసారు. - డా.కే. విశ్వేశ్వరరెడ్డి, మెడికల్ హెల్త్ ఆఫీసర్, నగర పాలక సంస్థ, కర్నూలు