జీతాల కోసం ఎదురుచూపులు
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:40 AM
నగరంలోని పరిసరాల శుభ్రత గురించి తెల్లవారుజామున నుంచే ఆలోచించే వారు పారిశుధ్య కార్మికులు. మిగతా ప్రజల జీవన విధానం ఎట్టా ఉన్న కార్మికుల జీవన విధానం భిన్నంగా ఉంటుంది
200 మందికి నెలకు రూ.24 లక్షలు
ఆరు నెలలకు రూ.1.44 కోట్లు పెండింగ్
ఇబ్బందులు పడుతున్న కార్మికులు
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): నగరంలోని పరిసరాల శుభ్రత గురించి తెల్లవారుజామున నుంచే ఆలోచించే వారు పారిశుధ్య కార్మికులు. మిగతా ప్రజల జీవన విధానం ఎట్టా ఉన్న కార్మికుల జీవన విధానం భిన్నంగా ఉంటుంది. మన ఇంట్లో పొరక పట్టుకుని శుభ్రం చేసేందుకే నామోషి పడే రోజుల్లో కూడా కార్మికులు ఎటువంటి జంకు బొంకు లేకుండా నగరంలోని ప్రతి చోట కాలువలను శుభ్రం చేస్తూ నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దేందుకు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆరు నెలలుగా వారికి జీతాలు అందడం లేదు. ఒక్కో కార్మికునికి వచ్చేది కేవలం రూ.12 వేలు మాత్రమే. అది కూడ ఇవ్వకపోవడంతో కార్మికులు గత ఆరు నెలలుగా ఇంట్లో పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
14 డివిజన్లలో 200 మంది కార్మికులు
నగర పాలక సంస్థ పరిధిలో 14 డివిజన్లలో కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు 200 మంది ఉన్నారు. నగర పాలక పరిధిలోని కాలువల్లో పూడికతీత తీయడం కోసమే వీరిని ఏర్పాటు చేసుకున్నారు. కాలువలను శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికులకు జీతాలు ఇవ్వడం కొరవడింది. ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, సంసారం ఎలా నెట్టుకురావాలో అర్థం కావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.10 వేల వేతనంతో పాటు రూ.2 వేలు అలవెన్సు అందాల్సి ఉంది. నెలకు రూ.24.00 లక్షలు, ఆరు నెలలకు రూ.1,44,45,000 చెల్లించాల్సి ఉంది. ప్రారంభంలో ప్రతి నెల తీసుకునేవారని, రాను రాను రెండు నెలలకు ఒక్కసారి వస్తున్నట్లు కార్మికులు చెబుతున్నారు.
ప్రభుత్వానికి నివేదిక పంపించాం
కార్మికులకు రావాల్సిన జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రస్తుతం అకౌంట్స్ విభాగంలో నుంచి ప్రభుత్వానికి వెళ్లినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి నిధులు ఎప్పుడు మంజూరు అయితే అప్పుడే కార్మికులకు అందజేస్తాం. - డా.ఎస్‌బీ విష్ణుమూర్తి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్
జీతాలు సక్రమంగా ఇవ్వాలి
ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇంటి అద్దెలు...పిల్లలకు పాఠశాల ఫీజులు చెల్లించలేని దిక్కు తోచని స్థితిలో ఉన్నాము. సెలవులు ఇవ్వరు. ప్రతి రోజు పని చేయాల్సిందేనని చెబుతున్నారు. జ్వరం వచ్చి ఒక్కరోజు పనికి రాకుంటే జీతం కట్‌చేస్తున్నారు. అలాంటప్పుడు జీతాలు పెండింగ్ లేకుండా ఇస్తే బాగుంటుంది. - సరోజ, కార్మికురాలు