నిరీక్షణ..!
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:43 PM
సి. బెళగల్ మండలం తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన ఓ రైతు రెండెకరాల్లో ఉల్లి సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో ధర పతనమైంది.
రెండు నెలలు గడిచినా రైతుల ఖాతాలో జమకాని ఉల్లి డబ్బు
చెల్లించాల్సిన మొత్తం రూ.17 కోట్లు
ఇప్పటికి ఇచ్చింది రూ.2.11 కోట్లే
మార్క్‌ఫెడ్ కార్యాలయం చుట్టూ రైతుల ప్రదక్షిణలు
వడ్డీలు పెరిగిపోతున్నాయని ఏకరువు
సి. బెళగల్ మండలం తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన ఓ రైతు రెండెకరాల్లో ఉల్లి సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో ధర పతనమైంది. ప్రభుత్వం క్వింటాకు రూ.1,200 మద్దతు ధర ప్రకటించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడంతో సంతోషించాడు. 86 క్వింటాళ్లు గత సెప్టెంబరు మొదటి వారంలో కర్నూలు మార్కెట్ యార్డులో ఏపీ మార్క్‌ఫెడ్‌కు విక్రయించాడు. వారంలో రోజుల్లో రూ.1.03 లక్షలు ఖాతాలో జమ చేస్తామన్నారు. దాదాపు రెండు నెలలు గడిచినా ఉల్లి డబ్బులు ఇవ్వలేదు. పెట్టుబడికి చేసిన అప్పులు, వడ్డీలు పెరిగిపోయి నష్టపోతున్నానని, పంట నమ్మి రెండు నెలలైనా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని రైతు అంటున్నాడు. అప్పు కట్టలేక అబద్ధాలు చెబుతున్నావని రుణదాతలు అంటున్నారని ఆవేదన చెందాడు. ఇది ఆ ఒక్క రైతు వ్యథే కాదు. ఏపీ మార్క్‌ఫెడ్‌లో, మార్కెట్‌లో ఉల్లి విక్రయించిన 2,445 మంది రైతుల బాధ. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉల్లి డబ్బులు ఇవ్వాలని కన్నీరు పెడుతున్నారు.
కర్నూలు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అత్యధిక ఉల్లి సాగు చేస్తున్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. సాధారణ సాగు విస్తీర్ణం 45,278 హెక్టార్లు. పంట దిగుబడులు చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలకు ఉల్లి దిబ్బతిని దిగుబడి కూడా భారీగా తగ్గిపోయింది. చేతి కొచ్చిన అరకొర పంట దిగుబడులు విక్రయించేందుకు కర్నూలు మార్కెట్ వెళ్తే ధరలు పతనమై కూలి, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని పలువురు రైతులు పొలంలోనే వదిలేశారు. కొంతైనా చేతికొస్తుందని కర్నూలు మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులు కొందరు లారీల బాడుగులు చేతి నుంచి కట్టాల్సి వచ్చింది. క్వింటా కనిష్టంగా రూ.వంద కూడా పలకపోవడంతో మట్టిలో పోసిన పెట్టుబడి, భార్యాపిల్లల కష్టం మట్టిపాలైంది. ఉల్లి రైతుల కన్నీటి కష్టాలను ‘ఆంధ్రజ్యోతి’ పలు కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చింది. సీఎం చంద్రబాబు సారథ్యంలోకి కూటమి ప్రభుత్వం స్పందించి ఉల్లి క్వింటా మద్దతు ధర రూ.1,200 ప్రకటించడమే కాకుండా ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. అదే క్రమంలో వ్యాపారులు కొను గోలు చేసినా మద్దతు ధర, కొనుగోలు ధర వ్యత్యాసం అమౌంట్ ప్రభు త్వం చెల్లిస్తుందని ప్రకటించింది. అప్పటి జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ విక్రాంత్‌పాటిల్ మార్కెట్‌కు వెళ్లి ఏపీ మార్క్‌ఫెడ్‌కు అమ్మాలని, వ్యాపారులకు విక్రయించినా వ్యత్యాసం అమౌంట్ ప్రభుత్వం చెల్లిస్తుందని భరోసా ఇచ్చారు.
రెండు నెలలైనా ఖాతాలో జమ కాని ఉల్లి డబ్బులు
కర్నూలు మార్కెట్ యార్డులో ఆగస్టు 31 నుంచి మద్దతు ధర రూ.1,200 ప్రకారం ఏపీ మార్క్‌ఫెడ్ నేరుగా కొనుగోలు చేసింది. మార్కెట్ యార్డు లైసెన్స్‌డ్ వ్యాపారులు పర్చేజ్ డిఫరెంట్ ప్రైజ్ స్కీం (పీడీపీఎస్) కింద కొనుగోలు చేసిన ఉల్లి ధరపై వ్యత్యాసం అమౌంట్ (ఉదా: వ్యాపారికి క్వింటా రూ.350కు కొనుగోలు చేస్తే మిలిగిన వ్యత్యాసం డబ్బులు రూ.950 ప్రభుత్వం చెల్లిస్తుంది) ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏపీ మార్క్‌ఫెడ్, లైసెన్సుడ్ వ్యాపారులు 2,800 మంది రైతుల నుంచి దాదాపుగా 1.55 లక్షల క్వింటాళ్లు ఉల్లి సేకరించారు. రైతులకు రూ.17కోట్లు చెల్లించాల్సి ఉంది. వారం పది రోజుల్లోగా ఖాతాల జమ చేస్తామని ఏపీ మార్క్ ఫెడ్ అధికారులు రైతులకు భరోసా ఇచ్చారు. ఉల్లి అమ్మకాలు చేసిన రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, ఈక్రాప్ జిరాక్స్ కాపీలు తీసుకున్నారు. వారం పది రోజుల్లో ఖాతాల ఉల్లి డబ్బులు వస్తాయని, పెట్టుబడి వడ్డీలైన కట్టుకోవచ్చని ఆశించారు. అయితే రెండు నెలలు కావస్తున్నా నేటికీ ప్రభుత్వం ఉల్లి అమ్మిన రైతులకు డబ్బులు చెల్లించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కేవలం 350 మంది రైతులకు రూ.2.11 కోట్లు మాత్రమే జమ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. 2,445 మంది రైతులకు రూ.14.89 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2018-19లో కొనుగోలు చేసిన ఉల్లికి దాదాపు రూ.6.50 కోట్లకుపైగా రావాలి. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికీ ఒక్క పైసా ఇవ్వలేదు. తాజాగా రూ.14.89 కోట్లు చెల్లించాల్సి ఉంది.
వడ్డీలు పెరుగుతున్నాయి
బ్యాంకుల్లో ఇచ్చే పంట రుణాలు సరిపోక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి వందకు రూ.2 వడ్డీ ప్రకారం అప్పులు చేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు. కౌలు రైతులకు బ్యాంకుల్లో రుణాలే ఇవ్వడం లేదు. వంద శాతం ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధాద పడాల్సిందే. మార్కెట్ నిబంధనల ప్రకారం పంట అమ్మిన రోజే అమ్మకం డబ్బు రైతులకు చెల్లించాలి. కొందరు వ్యాపారులు వారం పది రోజుల్లోపు ఇచ్చేలా మార్కెట్ యార్డు అధికారులు అనధికారిక ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వమే ఉల్లి కొనుగోలు చేయడంతో వారం పది రోజుల్లో ఉల్లి అమ్మకం డబ్బులు వస్తాయని ఆశిస్తే.. రెండు నెలైనా అందకపోవడం అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వడ్డీలు పెరగడమే కాక, అప్పులు ఇచ్చిన వారు రైతుల ఇళ్ల చుట్టు తిరుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉల్లి డబ్బు బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఏపీ మార్క్‌ఫెడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మెజార్టీ రైతులకు ఏపీజీబీ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, గ్రామీణ బ్యాంకులు వీలినం కారణంగా కొత్త బ్యాంక్ ఖతాలు రావడంతో ఈ సమస్య తలెత్తిందని, త్వరలోనే రైతులు ఖాతాలో జమ చేస్తామని పేర్కొనడం కొసమెరుపు.