ఏసీబీ వలలో వీఆర్వో
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:25 PM
తండ్రి పేరుతో ఉన్న పొలం కొడుకు పేరిట మ్యూటేషన్ చేసేందుకు రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఓ వీఆర్‌ఓ సోమవారం ఏసీబీ వలకు చిక్కాడు.
పత్తికొండ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): తండ్రి పేరుతో ఉన్న పొలం కొడుకు పేరిట మ్యూటేషన్ చేసేందుకు రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఓ వీఆర్‌ఓ సోమవారం ఏసీబీ వలకు చిక్కాడు. దేవనకొండ మండలం నల్లచెలిమల గ్రామానికి చెందిన కురువ మల్లన్న చనిపోవడంతో ఆయన పేరిట ఉన్న నాలుగు ఎకరాల పొలాన్ని తన తమ్ముడు కురువ కిష్టన్న పేరిట మ్యూటేషన్ చేయాలని అదే గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి శివన్న గ్రామ వీఆర్‌ఓ అశోక్‌కుమార్‌ను కోరాడు. దీనికి రూ.40 వేలు లంచం ఇవ్వాలని శివన్నను వీఆర్‌ఓ అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. కురువ శివన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ముందస్తు పన్నిన పథకం ప్రకారం సోమవారం పత్తికొండ పట్టణం నాలుగు స్తంభాల కూడలి వద్ద ఓ నెట్‌సెంటర్‌లో కురువ కిష్టన్న వీఆర్‌ఓ అశోక్‌కుమార్‌కు రూ.40 వేలు లంచం ఇచ్చారు. ఆ డబ్బును లెక్కపెట్టమని అక్కడే ఉన్న మధ్యవర్తి కుమ్మరి జయరాముడుకు వీఆర్‌ఓ అందించాడు. మధ్యవర్తి జయరాముడు లెక్కపెడుతుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి వీఆర్‌ఓ అశోక్‌కుమార్‌ను, మధ్యవర్తి జయరాముడును అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు క్రిష్ణయ్య, రాజప్రభ, ఎస్‌ఐ సుబ్బరాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.