స్థలం కోసం తహసీల్దార్‌పై దౌర్జన్యం
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:24 AM
యాభై ఏళ్ల క్రితం స్థలాన్ని అమ్ముకొని వేరే ప్రాంతానికి వలస వెళ్లి ఇప్పుడు వచ్చి తమ స్థలం తమకే అప్పగించాలంటూ బుధవారం తహసీల్దార్ నాగమణిపై దౌర్జన్యం చేశారు.
బేతంచెర్ల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): యాభై ఏళ్ల క్రితం స్థలాన్ని అమ్ముకొని వేరే ప్రాంతానికి వలస వెళ్లి ఇప్పుడు వచ్చి తమ స్థలం తమకే అప్పగించాలంటూ బుధవారం తహసీల్దార్ నాగమణిపై దౌర్జన్యం చేశారు. ఈ ఘటన పట్టణంలో చోటుచేసు కున్నది. స్థానికులు తెలిపిన వివరాలు.. రిటైర్డు ఆర్మీ ఉద్యోగి సానే శ్రీనివాసులు, ఆయన కుమార్తె పద్మ, కుటుంబ సభ్యులు గతంలో బేతంచెర్లలో నివాసం ఉండేవారు. 50 సంవత్సరాల క్రితం తమకున్న స్థలాన్ని అమ్ముకుని హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఇప్పుడు వచ్చి తమ స్థలాన్ని తమకు సర్వే చేయించి అప్పగించాలంటూ తహసీల్దార్‌పై దౌర్జన్యం చేస్తూ తమ స్థలం అప్పగించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లమని అన్నారు. అంతలో పోలీసులు వచ్చి వారి దౌర్జన్యాన్ని నివారించే ప్రయత్నం చేశారు. పద్మ మాట్లాడుతూ పోలీసులు తహసీల్దార్‌కు దాసోహం చేస్తున్నారే తప్ప తమకు న్యాయం చేయలేదని, తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటామని అన్నారు. సర్వేయర్ స్థలం సర్వే చేయించకుండా తహసీల్దార్ నాగమణి అడ్డుపడ్డారని, ఆమెపై దాడికి పాల్పడటంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని కార్యాలయం నుంచి బయటికి తీసుకువచ్చారు.
వివరణ: ఈ విషయమై తహసీల్దార్ నాగమణిని వివరణ కోరగా తమకు ఆర్మీ ఉద్యోగి శ్రీనివాసులు స్థలం విషయంలో ఎలాంటి జోక్యం లేదని, గతంలోనే వారి స్థలమును ఇతరులకు విక్రయించారని తెలిపారు. అయితే ప్రస్తుతం తన స్థలం తనకు కావాలని సర్వే చేయించి ఇవ్వాలని కుటుంబ సభ్యులంతా తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. స్థలంకు సంబందించిన వ్యక్తి కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకుని వచ్చారని, కోర్టు అనుమతుల ప్రకారమే తాను ఫాలో అవుతున్నామని ఆమె తెలిపారు.