నెలాఖరులోపు పల్లె పండుగ నిధులు విడుదల
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:42 PM
పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం నిధులతో ఈ ఏడాది జనవరిలో పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను ఈ నెలాఖరులోపు 50 శాతం చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పీఆర్ చీఫ్ ఇంజనీరు కె.విజయకుమారి తెలిపారు.
50 శాతం బిల్లుల చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు
సీఎంవో నుంచి వచ్చిన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి
పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీరు విజయకుమారి
కర్నూలు న్యూసిటీ, జూన్ 20(ఆంధ్రజ్యోతి): పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం నిధులతో ఈ ఏడాది జనవరిలో పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను ఈ నెలాఖరులోపు 50 శాతం చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పీఆర్ చీఫ్ ఇంజనీరు కె.విజయకుమారి తెలిపారు. శుక్రవారం విజయజవాడ నుంచి కర్నూలుకు వచ్చిన ఆమె జిల్లా పరిషత్ ఆవరణలోని విశ్వేశ్వరయ్య భవన్ పీఆర్ ఎస్‌ఈ కార్యాలయంలో పీఆర్‌ఐ, పీఐయూ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయకుమారి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ పనులకు సంబంధించి సుమారు రూ.1800 కోట్ల వరకు బిల్లులను చెల్లించాల్సి ఉందని, ప్రస్తుతం రూ.900 కోట్లు కేటాయించారని చెప్పారు. కర్నూలు జిల్లాకు రూ.26 కోట్లు విడుదల కానున్నాయని మిగిలిన 50 శాతం బిల్లులను జూలై నెలాఖరుకు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,200 కిలోమీటర్ల మేర సీసీ, బీటీ రోడ్లు వేసినట్లు తెలిపారు. ఉపాధి నిధులతో ఈ పనులకు సంబంధించిన బిల్లులన్నింటినీ క్లియర్ చేసిన అనంతరం కొత్త పనులను చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. నాబార్డు-30 కింద ఉమ్మడి కర్నూలు జిల్లాకు రూ.43 కోట్లతో 29 పనులు మంజూరు అయ్యాయని చెప్పారు. ఈ పనుల టెండర్లను వెంటనే పూర్తి చేసి అగ్రిమెంట్ తీసుకుని పనులను ప్రారంభించాలన్నారు. రూ.2 కోట్ల విలువైన పనులను 9 నెలల్లో, రూ.2 కోట్లకు పై బడిన పనులను 12 నెలల్లో పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి వచ్చిన పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే జిల్లాలోని పుచ్చకాయలమాడకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన సమయంలో, పూడిచెర్లకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వచ్చిన సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు వీలుగా అంచనాలను వెంటనే పంపించాలన్నారు. సమావేశంలో పీఆర్ ఎస్‌ఈ వి.రామచంద్రారెడ్డి, కర్నూలు, ఆదోని ఈఈలు ఎస్‌సీఈ మద్దన్న, వెంకటేశ్వర్లు, డీఈఈలు రవీంద్రారెడ్డి, బండారు శ్రీనివాసులు, ధనిబాబు, శేషయ్య, హెచ్‌డీ ఈరన్న, మహేశ్వరరెడ్డి, నాగిరెడ్డి, పీఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.సతీష్‌కుమార్, ఏఈఈలు తదితరులు పాల్గొన్నారు.