కూర'గాయాలు'
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:46 PM
పట్టణంలో కూరగాయల ధరలు కొండెక్కాయి.
ఆలూరులో పెరిగిపోయిన కూరగాయల ధరలు
బీన్స్, చిక్కుడు రూ.100, మిరప రూ.80లు..
మిగతావి రూ.50-60లు
సాగు తగ్గడం, రైతు బజార్ లేకపోవటమే కారణం
ఆలూరు, జూలై 20(ఆంధ్రజ్యోతి): పట్టణంలో కూరగాయల ధరలు కొండెక్కాయి. ఏ కూరగాయ కొనాలన్నా ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగ దారులు బెంబేలెత్తుతున్నారు. జూలై వచ్చినా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతులు కూరగాయలను సాగు చేయలేదు.
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి..
వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే మి రప, క్యారెట్, బీట్‌రూట్, బీన్స్, క్యాబేజీ, క్యాప్సికం అందుబాటులో లేవు. ఈ కూరగాయలను చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ, ధార్వాడ మార్కెట్‌ల నుంచి దిగుమతి చేసుకుంటు న్నారు. దీంతో వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత 15 రోజుల్లోనే ధరలు పెరిగాయి. బీన్స్, చిక్కుడు రూ.100లకు చేరగా మిరప రూ.80లు పలుకుతోంది. మిగతావి రూ.50ల నుంచి రూ.60ల వరకు పలుకుతున్నాయి.
కూరగాయ ధర(కిలో)
బీన్స్ రూ.100
చిక్కుడు రూ.100
మిర్చి రూ.80
క్యాప్సికం రూ.70
క్యారెట్ రూ.60
కాకర రూ.50
బీర రూ.60
బీట్‌రూట్ రూ.50
దొండ రూ.50
బెండకాయలు రూ.60
రైతు బజారు లేకపోవడంతో..
ఆలూరు పట్టణంలో అధికారులు రైతు బజారు ఏర్పాటు చేయలేదు. దీంతో ఇక వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఎంత ధర చెబితే అంతకే కొనాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. స్థానికంగా రైతు బజారు ఏర్పాటు చేస్తే రైతులే మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తారని ధరలు అందుబాటులో ఉంటాయని లాభంతో వినియోగదారులు కోరుతున్నారు.
రైతు బజార్ ఏర్పాటు చేయాలి
కూరగాయల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో రూ.500లు తీసుకెళ్తే మూడు రోజులకు సరిపడా కూరగాయలు కూడా రావడం లేదు. ఇది సామాన్యుడికిగా భారంగా మారింది. ఆలూరులో ప్రభుత్వం రైతు బజార్ ఏర్పాటు చేయాలి. - ప్రసాద్, వినియోగదారుడు, ఆలూరు
రైతులు ముందుకు వేస్తే రైతు బజార్ ఏర్పాటు
ఆలూరులో రైతు బజార్ ఏర్పాటుకు షెడ్లు అందుబాటులో వున్నాయి. పదిమంది దాకా రైతులు ముందుకు వస్తే ఏర్పాటు చేస్తాం. రైతులు కూరగాయలు తెస్తే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాం - సునీత, కార్యదర్శి, మార్కెట్ యార్డు