రెవెన్యూలో వసూల్ రాజా
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:06 PM
అన్ని ప్రభుత్వ శాఖల్లో కన్నా రెవెన్యూ శాఖ అత్యంత కీలకమైనది. పరిపాలన విభాగంలో కూడా రెవెన్యూ శాఖ గుండెకాయ లాంటిది.
అక్కడ అతడి మాటే వేదం.. చెప్పిందే శాసనం
గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 వీఆర్వోగా పదోన్నతులకు ముడుపులు
ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30వేల వరకు వసూలు
గ్రేడ్-1వీఆర్వోలు అనధికారికంగా ఆర్‌ఐలుగా చెలామణి
విధులు నిర్వహించకుండానే వేతనాలు
కలెక్టరేట్‌లో చక్రం తిప్పుతున్న ఏ-సెక్షన్‌లోని డీటీ
అన్ని ప్రభుత్వ శాఖల్లో కన్నా రెవెన్యూ శాఖ అత్యంత కీలకమైనది. పరిపాలన విభాగంలో కూడా రెవెన్యూ శాఖ గుండెకాయ లాంటిది. కలెక్టరేట్‌లో పని చేసే కొందరు రెవెన్యూ ఉన్నతాధికారులు, ఉద్యోగుల వల్ల జిల్లాలో రెవెన్యూ శాఖ అస్తవ్యస్తంగా మారింది. కూటమి ప్రభుత్వం గ్రేడ్-2 వీఆర్వోలకు గ్రేడ్-1 వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించనుంది. దీనిపై గ్రేడ్-2 వీఆర్వో ఒక్కరు దృష్టి పెట్టాడు. వసూలుకు తెర లేపాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10వేల నుంచి రూ.30వేలు వసూలు చేశాడు. సదరు అధికారికి కలెక్టరేట్‌లోని ఏ-సెక్షన్‌కు చెందిన ఓ డీటీ అండదండలు ఉన్నాయి. ఇటీవలే ఆ గ్రేడ్-2 వీఆర్వోను కలెక్టర్ కార్యాలయంకు సమీపంలోని ఓ సచివాలయానికి ఆ డీటీనే బదిలీ చేయించినట్లు తెలిసింది. ఆ వీఆర్వో మాటే వేదం.. చెప్పిందే శాసనంగా కొనసాగుతోంది. వీరిద్దరూ కలిసి రెవెన్యూ శాఖను శాసిస్తున్నారు.
కర్నూలు కలెక్టరేట్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖలో జరుగుతున్న పదోన్నతులపై వసూల్ రాజా దృష్టి పెట్టాడు. ప్రభుత్వం అన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లాలో 150మంది గ్రేడ్-2 వీఆర్వోలకు గ్రేడ్-1 వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించనుంది. నగరంలోని కలెక్టరేట్ సమీపాన గల సచివాలయంలో పని చేస్తున్న ఒక గ్రేడ్-2 వీఆర్వో పదోన్నతులు పొందుతున్న కొంతమంది వీఆర్వోలతో ఒక్కొక్కరి నుంచి రూ.10వేలు నుంచి రూ.30వేల వరకు వసూలు చేశాడు. ఇటీవల గ్రేడ్-2 వీఆర్వో బదిలీలలో కలెక్టరేట్‌లోని ఏ-సెక్షన్‌లో పని చేస్తున్న ఏ-1 డిప్యూటీ తహసీల్దార్ వసూల్ రాజా గ్రేడ్-2 వీఆర్వోకు కలెక్టరేట్ సమీపాన సచివాలయంలో పోస్టింగ్ ఇప్పించాడు. ప్రస్తుతం ఆగ్రేడ్-2 వీఆర్వో కలెక్టరేట్ రెవెన్యూ కార్యాలయాన్ని శాసిస్తున్నాడు. డీఆర్వో కార్యాలయంలో పని చేసే రెవెన్యూ అధికారులు కలెక్టరేట్‌లో జరిగే చిన్న కార్యక్రమాలకు కూడా మండల స్థాయి నుంచి రూ.15వేలు ఇటీవల వసూలు చేశారు.
ఏ సెక్షన్‌లోని ఏ1 డీటీ నుంచి..
కలెక్టరేట్‌లోని రెవెన్యూ కార్యాలయంలో ఏఫైల్ అయినా ఏసెక్షన్‌లోని ఏ1 డిప్యూటీ తహసీల్దార్(డీటీ) అనుమతి లేనిదే కదలని పరిస్థితి నెలకొంది. ఇక్కడ నామమాత్రపు అధికారిక హోదాలో కలెక్టరేట్ పరిపాలన అధికారి కొనసాగడం కొసమెరుపు. వసూల్‌రాజా గ్రేడ్-2 వీఆర్వోకు ఏ-1 డీటీలు అండదండలు ఉన్నాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కొన్ని అధికారిక ఫైల్ సైతం ఏ-1 డీటీ కనుసైగల్లో పరిష్కారం అవుతున్నాయి.
గ్రేడ్-1 వీఆర్వోలు..
జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయంలో గ్రేడ్-1 వీఆర్వోలు అనధికారికంగా మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు(ఆర్‌ఐ)గా చెలామణి అవుతున్నారు. జీవో.నెం.154 ప్రకారం గ్రేడ్-1 వీఆర్వోలకు 2021లో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ఈమేరకు జిల్లాలో 50 మంది పదోన్నతులు పొందారు. సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన వారు 154 జీవోలోని రూల్.నెం.-4(సీ) ప్రకారం సీపీటీ, సర్వే పరీక్షలను రెండేళ్లలోపు కచ్చితంగా ఉత్తీర్ణత పొం దాలి. ఉత్తీర్ణత సాధించని రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్లు తిరిగి యధాస్థానంగా గ్రేడ్-1 వీఆర్వోలుగా కొనసాగాలి. జిల్లాలో దాదాపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీపీటీ సర్వే పరీక్షల ఉత్తీర్ణతకాని మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు 1 మంది ఉన్నారు. వీరు రెవెన్యూ శాఖలోని అధికారుల అండదండలు ఉండటంతో నేటికీ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐలుగా కొనసాగుతుండటం కొసమెరుపు. రెవెన్యూ అధికారులు ప్రశ్నించకపోవడంతో అనధికారిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉత్తీర్ణత సాధించని మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను తొలగిస్తే జిల్లాలోని సీపీటీ, సర్వే పరీక్షలు ఉత్తీర్ణత పొందిన కిందిస్థాయి గ్రేడ్-1 వీఆర్వోలకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది.
40 మంది గ్రేడ్-1 వీఆర్వోలు..
ప్రభుత్వం ఇటీవల జీవోఎంఎ్‌స.నెం.4ను విడుదల చేసింది. దీని ప్రకారం రెండు, లేదా మూడు సచివాలయాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. ఒక క్లస్టర్‌కు ఒక వీఆర్వో విధులు నిర్వహిస్తారు. మున్సిపాలిటీల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 40మంది గ్రేడ్-1వీఆర్వోలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏదో ఒక సచివాలయంలో విధులు నిర్వహించకుండా గాలిలో తిరుగుతూ నెల నెలా జీతాలు తీసుకుంటూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో గ్రేడ్-2 వీఆర్వోలకు కమిషనర్ డీడీవోగా ఉంటారు. గ్రేడ్-1 వీఆర్వోలకు సంబంధిత తహసీల్దార్ డీడీవోగా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీలలో పనిచేసే గ్రేడ్-1 వీఆర్వోలకు ఎటువంటి మ్యాపింగ్‌గానీ, బయోమెట్రిక్ గానీ లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయాలకు హాజరు కావడం లేదనే ఆరోపణలున్నాయి. డీఆర్వో కార్యాలయంలో పనిచేసే వివిధ సెక్షన్లలో పనిచేసే రెవెన్యూ అధికారులు సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను ఇబ్బంది కలగజేస్తున్నారు. సమస్యలపై రెవెన్యూ ఉన్నతాధికారులకు తెలియజేస్తే ఇక్కడ నేను చెప్పేదే వేదం.. నా మాటే శాసనమని ఒక రెవెన్యూ ఉన్నతాధికారి చెప్పడం కొసమెరుపు.
విచారణ జరిపిస్తాం
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అనధికారికంగా చెలామణి అవుతున్న మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను తొలగిస్తాం. మ్యాపింగ్, బయోమెట్రిక్ లేని వారికి త్వరలో మ్యాపింగ్, బయోమెట్రిక్ కల్పిస్తాం.
వెంకట నారాయణమ్మ, డీఆర్వో, కర్నూలు