టీడీపీ ఆలూరు ఇన్‌చార్జిగా వైకుంఠం జ్యోతి
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:31 AM
నాలుగు నెలలుగా ఆలూరు ఇన్‌చార్జిని మార్పు తథ్యం అంటూ జరుగుతున్న చర్చకు అధినేత చంద్రబాబు తెర దించారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలు
వీరభద్రగౌడ్‌ను బాధ్యతల నుంచి తప్పించిన అధిష్ఠానం
కర్నూలు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నాలుగు నెలలుగా ఆలూరు ఇన్‌చార్జిని మార్పు తథ్యం అంటూ జరుగుతున్న చర్చకు అధినేత చంద్రబాబు తెర దించారు. కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇన్‌చార్జిగా కొనసాగిన వీరభద్ర గౌడ్‌ను బాధ్యతలను టీడీపీ తప్పించింది. టీడీపీ ఆలూరు నియోజకర్గం సారథిగా ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, మాజీ ఎంపీపీ వైకుంఠం ప్రసాద్ సతీమణి వైకుంఠం జ్యోతిని అధిష్ఠానం నియమించింది. 2015 నుంచి టీడీపీ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆమె గత ఎన్నికల్లో ఆలూరు టికెట్ ఆశించారు. ఈ క్రమంలో ఆమెను ఆలూరు ఇన్‌చార్జిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో వైకుంఠం వర్గీయులు, టీడీపీ శ్రేణులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. వర్గవిభేదాలకు తావు లేకుండా అధిష్ఠానం అదేశాల మేరకు అందరినీ కలుపుకుంటూ నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని ఇన్‌చార్జిగా నియమితులైన వైకుంఠం జ్యోతి వెల్లడించారు. వర్గవిభేదాలు వీడి అందరిని కలుపుకొని పార్టీ బలోపేతం కోసం పని చేయాలని వీరభద్రగౌడ్ అధిష్ఠానం పలు అవకాశాలు ఇచ్చినా ఆయనలో మార్పు కనిపించలేదని టీడీపీ భావించింది. ఆయన ఒంటెత్తుపోకడ వల్ల పార్టీకి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని గుర్తించిన అధిష్ఠానం నియోజకవర్గ ఇన్‌చార్జి మార్పు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ముఖ్య నాయకులు అంటున్నారు.
15 ఏళ్ల తరువాత పగ్గాలు
ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ అంటే గుర్తుకొచ్చేది వైకుంఠం కుటుంబమే. 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కేడీసీసీబీ మాజీ చైర్మన్ వైకుంఠం శ్రీరాములు కుటుంబం టీడీపీలో కొనసాగుతోంది. 1983, 1987 (ఉప ఎన్నిక), 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం కోసం వైకుంఠం కుటుంబం పని చేసింది. 1985 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకుంఠం శ్రీరాములు తనయుడు వైకుంఠం ప్రసాద్ చిప్పగిరి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2006లో వైకుంఠం శ్రీరాములు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఆ తరువాత 2011లో వైకుంఠం ప్రసాద్ నియోజకవర్గం ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో టికెట్ ఆశించినా అధిష్ఠానం వీరభద్రగౌడ్‌కు అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన నియోజకవర్గం ఇన్‌చార్జిగా కొనసాగారు. 2019లో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కు బరిలో దింపితే ఆమె కూడా ఓటమి చెందినా.. ప్రతిపక్షంలో పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగారు. గత ఎన్నికల్లో మళ్లీ వీరభద్రగౌడ్‌కు టికెట్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయ సునామి సృష్టించినా ఆలూరులో ఓటమి చెందారు. 15 నెలలుగా పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న ఆయన అన్ని వర్గాలను సమన్వయం చేయడంలో విఫలమయ్యారని, ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయని అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ బస్తిపాటి నాగ రాజు, ఆర్టీసీ కడప రీజన్ చైర్మన్ పూల నాగరాజులతో త్రిసభ్య కమి టీని నియమించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గంలో నిర్వహించిన ‘తొలి అడుగు’ కార్యక్రమాలు ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ లేకుండా ఎలా నిర్వహిస్తారు అంటూ ఆయన వర్గీయులు ఆస్పరి, ఆలూరులో అడ్డుకున్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఇన్‌చార్జిగా వీరభద్రగౌడ్ తొలగిస్తున్నట్లు ఆలూరులో జిల్లా పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రకటించారు. మూడు నెలలు తరువాత వైకుంఠం జ్యోతిని ఇన్‌చార్జిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అధికారి కంగా ఉత్తర్వులు జారీ చేశారు. 15 ఏళ్ల తరువాత టీడీపీ సారథి పగ్గాలు వైకుంఠం కుటుంబం చేతికి దక్కడం కొసమెరుపు.
జ్యోతి ఎదుట సవాళ్లు..!
ఆలూరు టీడీపీ ఇన్‌చార్జిగా నియమితులైన వైకుంఠం జ్యోతి ఎదుట పార్టీ అంతర్గతంగా పలు సవాళ్లు ఉన్నాయి. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కార్యకర్తలు, నాయకత్వం ఉన్నా.. వర్గవిభేదాలు వల్ల పార్టీ ఓటమి చెందుతూ వస్తోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి 2024 వరకు ఉప ఎన్నికతో కలిపి 11 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 1983, 1987 (ఉప ఎన్నిక), 1994 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ విజయం సాధిచింది. గత 30 ఏళ్లుగా అక్కడ టీడీపీ జెండా ఎగరలేదు. టీడీపీలో వైకుంఠం, కోట్ల, వీరభద్రగౌడ్, గుమ్మనూరు వర్గాలు బలంగా ఉన్నాయి. వీరితో పాటుగా దివంగత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన కుమార్తె, ఏపీ వాల్మీకి/బోయ కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ కూడా తన వర్గాన్ని బలపేతం చేసుకునే క్రమంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ 2029 ఎన్నికల్లో ఆలూరులో పసుపు జెండా ఎగురవేసే దిశగా పార్టీని బలోపేతం చేయడం వైకుంఠం జ్యోతికి కత్తిమీద సాములాంటిదే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యం
మా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నాపై ఎంతో నమ్మకంతో ఆలూరు టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. వారి నమ్మకాన్ని తప్పకుండా నిలబెడుతాను. నాకు వర్గాలతో సంబంధం లేదు. అధినేత చంద్రబాబు, అధిష్టానం నిర్ణయాలే నాకు శిరోధార్యం. అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా ముందు వెళ్తాను. టీడీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్త అభ్యునతి కోసం కృషి చేస్తాను. అన్ని వేళల వారికి అండగా ఉంటాను. అందరిని సమన్వయం చేసుకుంటూ 2029లో ఆలూరులో టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేస్తాను. కార్యకర్తలు, మండల నాయకులు స్వేచ్ఛగా నన్ను కలసి తమ సమస్యలు చెప్పుకోవచ్చు. ఆలూరు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న వలసలు, తాగునీటి సమస్య నివారణకు కృషి చేస్తాను. ఆ సమస్యలు తీరాలంటే వేదావతి ప్రాజెక్టు పూర్తి చేయడమే ప్రథమ లక్ష్యం. తనకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చేందుకు సంపూర్ణ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బడుగు వర్గాల అభ్యునతి కోసం పరితపించే మా మామ దివంగత కేడీసీసీబీ మాజీ చైర్మన్ వైకుంఠం శ్రీరాములు ఆశయాలను నెరవేరుస్తా.
- వైకుంఠం జ్యోతి, టీడీపీ ఇన్‌చార్జి, ఆలూరు