Share News

యూరియా వచ్చేసింది..!

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:24 AM

యూరియా వచ్చేసింది..!

యూరియా వచ్చేసింది..!
కర్నూలు రైల్వే స్టేషన్‌ గూడ్‌ షెడ్‌ నుంచి యూరియా సరఫరా

రైతులకు తీరనున్న కష్టాలు

జిల్లాకు 6,102 మెట్రిక్‌ టన్నులు కేటాయింపు

కర్నూలు, ఆదోనికి చేరుకున్న 2,203 మెట్రిక్‌ టన్నులు

యూరియా సరఫరాపై విజిలెన్స్‌ నిఘా

రైతులను వేధిస్తున్న యూరియా వ్యథలు తీరబోతున్నాయి. అన్నదాతలకు అవసరమైన యూరియాను అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కర్నూలు జిల్లాకు తక్షణం 6,102 మెట్రిక్‌ టన్నులు అవసరం ఉందని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం స్పందించింది. యూరియా సరఫరాకు చర్యలు చేపట్టింది. శుక్రవారం కర్నూలు, ఆదోని రైల్వే స్టేషన్‌ గూడ్‌ షెడ్లకు ఆయా కంపెనీల యూరియా 2,203 మెట్రిక్‌ టన్నులు చేరింది. అక్కడి నుంచి ఏపీ మార్క్‌ఫెడ్‌ గోదాములకు, ప్రైవేటు వ్యాపారులకు సరఫరా చేశారు. మిగిలిన కోటా కూడా రెండు మూడు రోజుల్లో వస్తుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. అయితే.. యూరియా పక్కదారి పట్టకుండా విజిలెన్స్‌ అధికారులు నిఘా పెట్టారు. ప్రతి బస్తా రైతు ఇంటికే చేరేలా చర్యలు తీసుకుంటున్నారు.

కర్నూలు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 4,22,540 హెక్టార్లు. ఈ ఏడాది 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో 3,38,488 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. అందులో ధాన్యపు పంటలు 14,900 హెక్టార్లు, పప్పు దినుసులు 39,147 హెకార్లు, నూనె గింజలు (ఆయిల్‌ సీడ్స్‌) పంటలు 37,157 హెకార్లు, పత్తి 2,17,430 హెక్టార్లు, మిరప 5,538 హెక్టార్లు, ఉల్లి 10,797 హెక్టార్లు, వరి 6,668 హెక్టార్లలో సాగు చేశారు. ఖరీఫ్‌ మొత్తానికి ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు ఆఖరు వరకు యూరియా 51,275 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 19,035 టన్నులు, పోటాష్‌ 1,485 టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 1,04,840 టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1,587 మెట్రిక్‌ టన్నులు అవసరం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏ నెలలో ఏ ఎరువు ఎంత అవసరం ఉందో ప్రణాళికను ప్రభుత్వానికి పంపించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10-15 శాతం యూరియా సరఫరా తగ్గించింది. ఆ స్థానంలో నానో యూరియాను ప్రొత్సహించింది. అయితే గుళికల యూరియాకు అలవాటి పడిన రైతులు నానో యూరియాపై మొగ్గు చూపకపోవడం, యూరియా సరఫరాలో లోపాలు ఉండటంతో అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అసరమైన మేరకు యూరియా సరఫరాకు చర్యలు తీసుకుంది.

జిల్లాకు చేరిన యూరియా

ఖరీఫ్‌ సీజన్‌ మొత్తానికి 51,275 మెట్రిక్‌ టన్నులు యూరియా అవసరం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 24,991 టన్నుల యూరియా ఏపీ మార్క్‌ఫెడ్‌, ప్రైవేటు వ్యాపారుల ద్వారా అందజేశారు. 1,244 టన్నులు ప్రస్తుతం నిల్వ ఉంది. సెప్టెంబరు నెలలో 6,102 మెట్రిక్‌ టన్నుల యూరియా కావాలంటూ జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. స్పిక్‌ కంపెనీ యూరియా 904 మెట్రిక్‌ టన్నులు, ఐపీఎల్‌ కంపెనీ 2,600 మెట్రిక్‌ టన్నులు, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (సీఐఎల్‌) 2,598 మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు కేటాయించారు. శుక్రవారం కర్నూలు రైల్వే స్టేషన్‌ గూడ్స్‌షెడ్‌కు స్పిక్‌ యూరియా 904 టన్నులు వచ్చింది. అందులో 70 శాతం ఏపీ మార్క్‌ఫెడ్‌కు, 30 శాతం డీలర్లకు సరఫరా చేశారు. ఆదోని రైల్వే గూడ్‌షెడ్‌కు సీఐఎల్‌ కంపెనీ యూరి 1,299 టన్నులు వచ్చింది. అందులో 55 శాతం ఏపీ మార్క్‌ఫెడ్‌కు, 20 శాతం మన గ్రోమోర్‌ కేంద్రాలకు, 25 శాతం ప్రైవేటు డీలర్లకు సరఫరా చేశారు. మిగిలిన యూరియా త్వరలోనే వస్తుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా యూరియాలో 70 శాతం వరకు ఏపీ మార్క్‌ఫెడ్‌కు ఇస్తుంది. అక్కడి నుంచి గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరస్పర సహకార సంఘాలు (పీఏసీఎస్‌)కు సరఫరా చేస్తుంది. సొసైటీలకు ఇస్తున్న యూరియా మెజార్టీగా రాజకీయ పలుకుబడి కలిగిన బడా రైతుల ఇళ్లకే చేరుతుండడంతో సామాన్య రైతులకు అందని ద్రాక్షగా మారింది. దీనికి తోడు గ్రామ రాజకీయాలు కూడా యూరియా సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. సొసైటీల్లో యూరియా లభించని రైతులు ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. డీలర్లకు 30-40 శాతానికి మించి యూరియా ఇవ్వడం లేదు. దీనికి తోడు యూరియా కావాలంటే బయో ఎరువులు కొనాలని లింక్‌ పెడుతుండటం, కొందరు వ్యాపారులు ధనాపేక్షతో యూరియా కృత్రిమ కొరత సృష్టించడంతో రైతులు ఇబ్బందులు తప్పడం లేదు. దీనిని పసిగట్టిన కూటమి ప్రభుత్వం విజిలెన్స్‌ నిఘా పెట్టడంతో యూరియా వ్యథలు రైతులకు తప్పాయని అంటున్నారు. ముఖ్యంగా ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా పీఏసీఎస్‌ సొసైటీలకు సరఫరా చేస్తున్న యూరియా రైతుకు ఎంత సరఫరా చేశారో పక్కాగా నిఘా పెడితే యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉండదు.

2,299 మెట్రిక్‌ టన్నులు యూరియా వచ్చింది

జిల్లాకు 6,102 మెట్రి క్‌ టన్నులు యూరియా అవసరం ఉందని ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రస్తుతం 2,203 మెట్రిక్‌ టన్నులు కర్నూలు, ఆదోనికి చేరింది. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఏపీ మార్క్‌ఫెడ్‌, ప్రైవేటు డీలర్లకు రేషియో ప్రకారం పంపిణీ చేశాం. యూరియా ఒక్క బస్తా కూడా పక్కదారి పట్టకుండా చర్యలు చేపడుతున్నాం. రైతులకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నాం. ఎక్కడైనా యూరియా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం ఇస్తే తక్షణ చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేస్తాం.

- వరలక్ష్మి, జేడీ, వ్యవసాయ శాఖ, కర్నూలు

2025-26లో ఖరీఫ్‌ సీజన్‌లో

యూరియా ఇలా

వివరాలు మెట్రిక్‌ టన్నులు

కావాల్సిన యూరియా 51,275

ఆగస్టు నాటికి సరఫరా 24,991

స్టాక్‌ (నిల్వ) 1,244

తక్షణ వసరం 6,102

శుక్రవారం వచ్చినది 2,203

Updated Date - Sep 06 , 2025 | 12:24 AM