Share News

నిర్లక్ష్యపు నీడలో ఉర్దూ వర్సిటీ!

ABN , Publish Date - Dec 01 , 2025 | 11:21 PM

కర్నూలు జిల్లాలోని ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది.

నిర్లక్ష్యపు నీడలో ఉర్దూ వర్సిటీ!
కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద అసంపూర్తిగా ఉర్దూ యూనివర్సిటీ భవనాలు

రాష్ట్రంలో తొలి ఉర్దూ విశ్వవిద్యాలయం

గత టీడీపీ ప్రభుత్వంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద 145 ఎకరాల కేటాయింపు

18.30 కోట్లతో శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం

వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యం.. ఆగిన పనులు

ఏళ్లుగా అద్దె భవనాల్లోనే విద్యార్థులకు తరగతులు

కూటమి ప్రభుత్వం వచ్చాక చిగురిస్తున్న ఆశలు

కర్నూలు జిల్లాలోని ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భూమి కేటాయింపుతో పాటు రూ.18 కోట్లతో నిర్మాణాలు ప్రారంభం కాగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ యూనివర్సిటీ అభివృద్ధిపై శీతకన్ను వేసింది. ఒక్క ఇటుక కూడా పేర్చకపోవడంతో నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి. ఫలితంగా గత కొన్నేళ్లుగా విద్యార్థులకు అద్దె భవనాల్లోనే తరగతులు బోధించాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి రావడంతో వర్సిటీ ప్రగతిపై మళ్లీ ఆశలు చిగురించాయి. (కర్నూలు-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర విభజన తరువాత అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొదటి ఉర్దూ వర్సిటీ ఇది. యూనివర్సిటీ క్యాంప్‌సకు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు వద్ద విమానాశ్రయం పక్కనే 145 ఎకరాలు కేటాయించారు. చరిత్రలో నిలిచేలా అద్భుతమైన శాశ్వత భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మొదటి విడతగా రూ.18.30 కోట్లతో పనులు చేపట్టారు. అయితే ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఐదేళ్లూ వర్సిటీ నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. ఒక్క ఇటుక కూడా పెట్ట లేదు. దీంతో అసంపూర్తిగా నిలిచిన భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటి మధ్య ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. మళ్లీ సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభు త్వం రావడంతో వర్సిటీ నిర్మాణంపై ఆశలు చిగురించా యి. అయితే ఏడాదిన్నర కాలం గడిచినా ఉర్దూ వర్సిటీ ప్రగతిపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అద్దె కట్టి.. ప్రైవేటు భవనంలో తరగతులు

2016లో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఏపీ స్టేట్‌ లెజిస్లేచర్‌ యాక్ట్‌-2016 ప్రకారం ఉర్దూ వర్సిటీని ఏర్పాటు చేసింది. 2017-18 విద్యా సంవత్సరం నుంచి స్థానిక ఉస్మానియా కళాశాలలో తాత్కాలిక గదుల్లో తరగతులు ప్రారంభించారు. అక్కడి నుంచి రూ.లక్షల్లో అద్దెతో నగర శివారులో ఓ ప్రైవేటు భవనంలోకి మార్చారు. ఉర్దూ, ఇంగ్లిష్‌, ఎకనమిక్స్‌, కంప్యూటర్స్‌, ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌, ఎంబీఏ వంటి పీజీ, యూజీ కోర్సులను ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, కడప, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన దాదాపు 220 మందికి పైగా విద్యార్థులు వివిధ కోర్సుల్లో పీజీ, డిగ్రీ చదువుతున్నారు. అకడమిక్‌ బ్లాక్‌ సహా హస్టళ్లు, పరిపాలన భవనాలు, ల్యాబ్‌లు.. వంటి సౌకర్యాల కోసం సుమారు 52-60 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు అవసరం ఉంది.

పెరిగిన నిర్మాణ వ్యయం

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదటి విడతగా అకడమిక్‌ బ్లాక్‌, హాస్టల్‌ భవనాలు, రహదారులు వంటి నిర్మాణాలు హయాంలో ప్రారంభించారు. వివిధ దశల్లో పనులు జరుగుతుండగా ప్రభుత్వం మారింది. తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం వర్సిటీ నిర్మాణాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడమే కాకుండా.. కాంట్రాక్టర్‌కు బిల్లులు కూడా ఆపేశారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. జీ ప్లస్‌ 3 తరహాలో అకడమిక్‌, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌ నిర్మాణం చేసేలా డిజైన్‌ చేశారు. జీ ప్లస్‌ 1లోనే స్లాబులు, పిల్లర్ల దశలోనే పనులు నిలిచిపోయాయి. గత ఆరున్నరేళ్లుగా నిర్మాణాలు నిలిచిపోవడంతో.. నిర్మాణం వ్యయం కూడా భారీగా పెరుగుతోంది. ప్రతిపాదించిన నిర్మాణాలు, రహదారులు, ప్రహరీ, తాగునీరు వంటి సౌకర్యాల కోసం రూ.25 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.

క్యాప్టివ్‌ గ్రాంట్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేయడంతో..

విశ్వవిద్యాలయాలకు ఏటేటా ప్రభుత్వం కేటాయించే నిధులు రావాలంటే ‘క్యాప్టివ్‌ గ్రాంట్‌ అకౌంట్‌’ కీలకం. 2024-25 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లు నిధులు కేటాయించింది. కానీ ఆ నిధులు మంజూరు చేయలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్యాప్టివ్‌ గ్రాంట్‌ అకౌంట్‌ను క్లోజ్‌ చేయడమే ఇందుకు కారణం. అకౌంట్‌ను ఓపెన్‌ చేసి నిధులు ఇవ్వాలని ఉన్నత విద్యా శాఖ ద్వారా పంపిన ప్రతిపాదనలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌ ఫైల్‌ను క్లియర్‌ చేసి, వర్సిటీ అభివృద్ధి పాటుపడాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

మంత్రి భరత్‌ రూ. కోటి విరాళం

అసంపూర్తిగా ఉన్న జీ ప్లస్‌ 1 అకడమిక్‌ బ్లాక్‌, హాస్టల్‌ భవనాలు పూర్తి చేసి వర్సిటీని ఓర్వకల్లుకు మారిస్తే.. ఆ తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చేయవచ్చని అధికారులు సంకల్పించారు. ఆ పనుల పూర్తికి తక్షణం రూ.2 కోట్ల నిధులు అవసరం. ఈ విషయాన్ని జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరితో వర్సిటీ అధికారులు చర్చించారు. స్పందించిన మంత్రి.. రూ.కోటి విరాళంగా ఇస్తానని, తక్షణమే అవసరమైన పనులు మొదలు పెట్టమని వారికి సూచించారు. మరో రూ.కోటి ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు కలెక్టర్‌ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితలు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రూ.50 లక్షలతో ఏపీ టూరిజం శాఖకు చెందిన హరిత హోటల్‌కు ఎదురుగా అప్రోచ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వర్సిటీ నిర్మాణం పూర్తి విషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లి.. ఆ దిశగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Dec 01 , 2025 | 11:21 PM