వీడని వర్షం.. తగ్గని వరద
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:52 PM
నంద్యాల జిల్లాను వర్షం ‘నిన్నొదల బొమ్మాళీ’ అన్నట్టు పట్టుకుంది. ఎడతెరిపి లేని వానలతో పంటలు మునిగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి..
జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం
221.4 ఎంఎం వర్షపాతం నమోదు
పంట పొలాల్లో తగ్గని వరద
కోతకు గురవుతున్న రోడ్లు
స్తంభించిన రాకపోకలు
మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు
నంద్యాల జిల్లాను వర్షం ‘నిన్నొదల బొమ్మాళీ’ అన్నట్టు పట్టుకుంది. ఎడతెరిపి లేని వానలతో పంటలు మునిగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.. రాకపోకలు స్తంభిస్తున్నాయి.. రోడ్లు కోతకు గురవుతున్నాయి.. పంటలు నష్టపోతున్నా అధికారులు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా రుద్రవరం మండలంలో 40.2ఎంఎం వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా వెలుగోడు మండలంలో 1.0 ఎంఎం వర్షపాతం నమోదైంది.
నంద్యాల ఎడ్యుకేషన్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో పలు మండలాల్లో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా నల్లమలలో కురిసిన భారీ వర్షంతో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహానంది ప్రాంతంలోని నల్లమలలో కురిసిన భారీ వర్షం వల్ల వరద నీరు పాలేరుకు చేరుకుని అక్కడి నుంచి నంద్యాల పట్టణంలోని చామకాల్వ మీదుగా కుందూ నదిలో కలుస్తుంది. దీంతో పట్టణ నడిబొడ్డున ఉన్న చామకాల్వ ఉధృతి పెరిగింది. జిల్లాలో అత్యధికంగా రుద్రవరం మండలంలో 40.2ఎంఎం వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా వెలుగోడు మండలంలో 1.0 ఎంఎం నమోదైంది. మహానంది 29.2, సంజామల 25.2, నంద్యాల పట్టణం 19.6, ఉయ్యాలవాడ 19.4, గోస్పాడు 15.0, శిరువెళ్ల 11.0, ఆళ్లగడ్డ 10.0, కొత్తపల్లె 8.6, నంద్యాల మండలం 8.6, కోవెలకుంట్ల 6.2, దొర్నిపాడు 4.8, కొలిమిగుండ్ల 4.6, కొలిమిగుండ్ల 4.6, చాగలమర్రి 4.6ఎంఎ వర్షపాతం నమోదైంది.
రుద్రవరంలో భారీ వర్షం
రుద్రవరం: రుద్రవరం మండలంలో శనివారం 40.2 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. చిలకలూరు, పేరూరు ఎర్రగుడిదిన్నె గ్రామాల సమీపంలోని వక్కిలేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. చిలకలూరు గ్రామ సమీపంలో వక్కిలేరు వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. రుద్రవరం - శిరివెళ్ల మధ్యలో ఉన్న వాగు పొంగి ప్రవహించడంతో కోడిపిల్ల వాగు సమీపంలో వాహనాలు నిలిచిపోయాయి.
మహానందిలో కుండపోత వర్షం
ఉధృతంగా ప్రవహించిన పాలేరువాగు
మహానంది: మహానంది మండలంలో శనివారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. దీంతో మహానంది దేవస్థానం పాత కార్యాలయం భవనం ఎదుట వందేళ్ల నాటి భారీ చింత చెట్టు నేలకూలింది. అదేవిధంగా నాలుగు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మహానంది సమీపంలోని పాలేరువాగు ఉధృతంగా ప్రవహించింది. లోలెవెల్ వంతెనపై వరద నీరు పొంగి ప్రవహించడంతో మహానంది నుంచి గాజులపల్లి వైపు రహదారిలో కొన్ని గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే రహదారిలో ఆచార్య ఎన్‌జిరంగా వ్యవసాయ కళాశాల, గాజులపల్లి రైల్వే స్టేషన్ ఉండటంతో అటు వైపు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పాలేరువాగును తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ మహమ్మద్‌దౌలా, పంచాయతీరాజ్ కార్యదర్శి కలువ భాస్కర్‌తోపాటు పోలీసులు పరిశీలించారు.
చాగలమర్రి, : మండలంలో గొట్లూరు, నేలంపాడు గ్రామాల సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. నేలంపాడు గ్రామంలో వరద నీరు తగ్గకుండా ప్రవహిస్తుండటంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గోట్లూరు, నేలంపాడు, రాంపల్లె, జంగాలపల్లె, కొట్టాలపల్లె, రాజోలి గ్రామాల సమీపంలోని పొలాల్లో మూడు రోజుల నుంచి వరద నీరు తగ్గలేదు. దీంతో బెండ, మినుము, మొక్కజొన్న, కంది, జూట్ పంటలు నీట మునిగి కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో 1,800 ఎకరాల దాకా పంటలు దెబ్బతిన్నాయన్నారు. గొట్లూరు గ్రామంలోని 400 ఎకరాల్లో మొక్కజొన్న, 50 ఎకరాల్లో బెండ, 30 ఎకరాల్లో కంది, రాజోలిలో 50 ఎకరాల్లో వరి పంటలు నీట మునిగి నష్టం వాటిల్లింది. వెల్లాల క్షేత్ర సమీపంలోని దేవాలయం వద్దగల వంక పొంగి ప్రవహించడంతో ఆ రహదారి వెంట రాకపోకలు స్తంభించాయి. చాగలమర్రి నుంచి ప్రొద్దుటూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, వాహనదారుల రాకపోకలు నిలిచిపోయాయి.