Share News

అనధికారిక ఆర్‌ఐలు!

ABN , Publish Date - Aug 01 , 2025 | 12:05 AM

జిల్లాలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో గ్రేడ్‌-1 వీఆర్వోలు అనధికారికంగా మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లుగా చలామణి అవుతున్నారు.

అనధికారిక ఆర్‌ఐలు!

సీపీటీ సర్వే పరీక్ష ఉత్తీర్ణత కానీ 50 మంది సీనియర్‌ అసిస్టెంట్లు

మున్సిపాలిటీలలో విధులు నిర్వహించని గ్రేడ్‌-1 వీఆర్వోలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 380 మంది మిగులు వీఆర్వోలు

మళ్లీ గ్రేడ్‌-2 వీఆర్వోల పదోన్నతుల ఫైల్‌ సిద్ధం

కర్నూలు కలెక్టరేట్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో గ్రేడ్‌-1 వీఆర్వోలు అనధికారికంగా మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లుగా చలామణి అవుతున్నారు. ప్రభుత్వం జీవో.నెం.154 ప్రకారం గ్రేడ్‌-1 వీఆర్వోలకు 2021 సంవత్సరంలో సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు జిల్లాలో 50 మంది పదోన్నతులు పొందారు. సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన వారు 154 జీవోలోని రూల్‌ నెంబర్‌-4(సీ) ప్రకారం సీపీటీ, సర్వే పరీక్షలను రెండు సంవత్సరాలలోపు ఖచ్చితంగా ఉత్తీర్ణత పొందాలి. ఉత్తీర్ణత సాధించని రెవెన్యూ సీనియర్‌ అసిస్టెంట్లు తిరిగి యథాస్థానంగా గ్రేడ్‌-1 వీఆర్వోలుగా కొనసాగాలి. జిల్లాలో దాదాపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీపీటీ, సర్వే పరీక్షలు ఉత్తీర్ణత కాని మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు 30 మంది ఉన్నారు. వీరికి రెవెన్యూ శాఖలోని అధికారుల అండదండలు ఉండటంతో నేటికీ తహసీల్దార్‌ కార్యాలయంలో మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ హోదాలో కొనసాగుతుండటం కొసమెరుపు. వీరు తహసీల్దార్‌ కార్యాలయంలో రూల్స్‌కు విరుద్దంగా రైతుల భూముల విషయాలలో సంతకాలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ప్రశ్నించక పోవడంతో అనధికారిక రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ల ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉత్తీర్ణత సాధించని మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లను తొలగిస్తే జిల్లాలోని సీపీటీ, సర్వే పరీక్షలు ఉత్తీర్ణత పొందిన క్రింది స్థాయి గ్రేడ్‌-1 వీఆర్వోలకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది.

రేషనలైజేషన్‌లో భాగంగా ఇటీవల గ్రేడ్‌-2 వీఆర్వోలను 30 మందిని ఆదోని డివిజన్‌కు బదిలీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 380 మంది మిగులు వీఆర్వోలుగా గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో మళ్లీ రెవెన్యూ అధికారులు 150 మంది గ్రేడ్‌-2 వీఆర్వోలకు పదోన్నతులు కల్పించేందుకు ఫైల్‌ సిద్ధం చేశారు. రెండు నెలల్లో వీరికి పదోన్నతి కల్పించి బదిలీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 380 మంది వీఆర్వోలు పదోన్నతుల వీఆర్వోలకు పోస్టింగులు ఎక్కడ ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

విధులు నిర్వహించని వీఆర్వోలు

ప్రభుత్వం ఇటీవల జీవోఎంఎస్‌.నెం.4ను విడుదల చేసింది. దీని ప్రకారం రెండు లేదా మూడు సచివాలయాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. ఒక క్లస్టర్‌కు ఒక వీఆర్వో విధులు నిర్వహిస్తారు. మున్సిపాలిటీలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 మంది గ్రేడ్‌-1 వీఆర్వోలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఏదో ఒక సచివాలయంలో విధులు నిర్వహించకుండా ప్రతినెలా వేతనాలు తీసుకుంటూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. మున్సిపాలిటీలలో గ్రేడ్‌-2 వీఆర్వోలకు కమిషనర్‌ డీడీవోగా ఉంటారు. అదేవిధంగా గ్రేడ్‌-1 వీఆర్వోలకు సంబంధిత తహసీల్దార్‌ డీడీవోగా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీలలో పని చేసే గ్రేడ్‌-1 వీఆర్వోలకు ఎలాంటి మ్యాపింగ్‌ గానీ, బయోమెట్రిక్‌ గానీ లేకపోవడంతో తహసీల్దార్‌ కార్యాలయాలకు హాజరుకావడం లేదు.

సీపీటీ సర్వేలో ఉత్తీర్ణత తప్పనిసరి

ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత కలిగిన సీనియర్‌ అసిస్టెంట్లు రెండు సంవత్సరాలలోపు నిర్ధేశించిన పరీక్షలు సీపీటీ, సర్వేలలో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలి. లేనిపక్షంలో గ్రేడ్‌-1 వీఆర్వోలుగా కొనసాగుతారు. ఈ మేరకు ఉత్తీర్ణత సాధించని వారిని త్వరలో గ్రేడ్‌-1 వీఆర్వోలుగా పంపడం జరుగుతుంది. జిల్లాలోని మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న గ్రేడ్‌-1 వీఆర్వోలను ఖచ్చితంగా బదిలీ చేస్తాం. వీరికి మ్యాపింగ్‌, బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తాం.

- వెంకటనారాయణమ్మ, డీఆర్వో, నంద్యాల

Updated Date - Aug 01 , 2025 | 12:05 AM