అనుమతిలేని లే అవుట్లను క్రమబద్ధీకరించుకోవాలి
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:04 PM
అనుమతిలేని లేఅవుట్లను క్రమబద్ద్ధీకరించుకునేందకు ప్రభుత్వం సువర్ణావకాశాన్ని కల్పించిందని, అలాంటి లే అవుట్లు కలిగిన వారు 90 రోజుల్లో ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ‘కుడా’ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.
‘కుడా’ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
పత్తికొండ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): అనుమతిలేని లేఅవుట్లను క్రమబద్ద్ధీకరించుకునేందకు ప్రభుత్వం సువర్ణావకాశాన్ని కల్పించిందని, అలాంటి లే అవుట్లు కలిగిన వారు 90 రోజుల్లో ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ‘కుడా’ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. పత్తికొండ టీడీడీ కల్యాణ మండపంలో ఆర్డీవో భరత్‌నాయక్ నేతృత్వంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులకు నూతన విధానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిఽథిగా హాజరైన సోమిశెట్టి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు సుమారు 300పైగా అక్రమ లేఅవట్లువేసి ప్లాట్లు విక్రయించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. వీటికిసంబంధించిన అన్నివివరాలు తమవద్ద ఉన్నాయని, అనుమతిలేని లే అవుట్లను 90 రోజులలోపు వాటిని క్రమబద్ధీకరించకపోతే ఆ తర్వాత చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో గురించి ఎల్‌ఆర్‌ఎస్ స్కీం గురించి పాంప్లెట్ల ద్వారా ప్రచారం చేస్తామని, అనుమతిలేని లే అవుట్లు రెగ్యులర్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలను అందులో ప్రజలకు తెలియచేస్తామని సోమిశెట్టి వెంకటేశ్వర్లు చెప్పారు. కార్యక్రమంలో ‘కుడా’ ప్లానింగ్ అధికారులు, స్థానిక కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.