ఇద్దరు బాలికలు అదృశ్యం!
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:05 AM
పట్టణానికి చెందిన ఇద్దరు బాలికలు అదృశ్యమైన కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఎస్పీ సునీల్ షెరాన్ ఆత్మకూరు అర్బన్ సీఐ రామును అభినందించారు.
గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులు
ఆత్మకూరు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పట్టణానికి చెందిన ఇద్దరు బాలికలు అదృశ్యమైన కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఎస్పీ సునీల్ షెరాన్ ఆత్మకూరు అర్బన్ సీఐ రామును అభినందించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రహమత్‌నగర్‌కు చెందిన ఓ బాలిక పాములపాడులో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఫోన్ మాట్లాడొద్దని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన కుమార్తెతో పాటు మేనకోడలు కనిపించడం లేదని ఆమె పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ బాలికలు ఇద్దరికి బంధుత్వంతో పాటు మంచి స్నేహం కూడా ఉంది. బాలికల మిస్సింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు వారి ఆచూకీ కోసం పట్టణంలోని సీసీ కెమెరాలు, అనుమానిత వ్యక్తి లొకేషన్ గుర్తింపుపై ఆరా తీశారు. నందికొట్కూరు పోలీసులతో పాటు కర్నూలు, డోన్ రైల్వేస్టేషన్ల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. అయితే వారి వద్ద సెల్‌ఫోన్ లేకపోవడంతో వారి ఆచూకీని గుర్తించడం పోలీసులకు కష్టమైంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి బాలిక తల్లికి ఒకరు ఫోన్ చేసి మీ ఇంటికి కొరియర్ వచ్చిందా..అని వెంటనే ఫోన్ పెట్టేశారు. విషయాన్ని పోలీసులకు తెలియ జేయడంతో వెంటనే సీఐ రాము ఆ ఫోన్ నంబరు గల వ్యక్తికి ఫోన్ చేయగా హైదరాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఇద్దరు మైనర్ బాలికలు తన వద్ద నుంచి ఫోన్ తీసుకుని మాట్లాడారన్న విషయాన్ని తెలిపారు. వెంటనే హైదరాబాద్‌లో నివాసం ఉండే ఆత్మకూరుకు చెందిన వ్యక్తులను అక్కడికి పంపించి ఆ బాలికల ఫొటోలను వాట్సా్‌పలో పెట్టారు. అక్కడికి వెళ్లిన వారు బస్టాండ్‌లో గాలించగా రాత్రి 11 గంటలకు ఆ ఇద్దరు బాలికలు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. విషయాన్ని సీఐ రాముకు తెలియజేయడంతో ఆయన హైదరాబాద్ బస్టాండ్‌లోని పోలీసు ఔట్ పోస్టుకు సమాచారం ఇచ్చారు. అప్జల్‌గంజ్ పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆత్మకూరు పోలీసులు, బాలికల కుటుంబీకులు హైదరాబాద్‌కు వెళ్లి వారిని ఆత్మకూరుకు తీసుకొచ్చారు. కాగా పారిపోయేందుకు ప్రయత్నించిన ఆ ఇద్దరు బాలికలు బస్టాండ్ నుంచి వెళ్తే పోలీసులు గుర్తిస్తారన్న అనుమానంతో ఆటోలో కరివేన వరకు వెళ్లి అక్కడి నుంచి కర్నూలుకు, కర్నూలు నుంచి హైదరాబాద్‌కు బస్సులో వెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తల్లి మందలించినందుకే వారు ఇంటినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.