Share News

గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:57 AM

నిషేధిత గంజాయి సాగు చేస్తూ, ప్రయాణికుల ద్వారా ఏళ్ల తరబడి కర్ణాటకకు తరలిస్తున్న వైసీపీకి చెందిన ఇద్దరి వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆదోని రూరల్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): నిషేధిత గంజాయి సాగు చేస్తూ, ప్రయాణికుల ద్వారా ఏళ్ల తరబడి కర్ణాటకకు తరలిస్తున్న వైసీపీకి చెందిన ఇద్దరి వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కర్ణాటకలో ఒక వ్యక్తి గంజాయిని విక్రయిస్తుండగా, అక్కడ పోలీసులు అదుపులో తీసుకోవడంతో ఆదోని మండలం పెద్దహరివాణం కేంద్రంగా గంజాయి దందా బట్టబయలైంది. దీంతో ఆదోని రూరల్‌ పోలీసులు రంగప్రవేశం చేసి గంజాయి సాగు చేస్తున్న పెద్దహరివాణం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కోటేకల్లు అయ్యన్న, మల్లికార్జునను అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన కోటేకల్లు అయ్యన్నకు గజ్జెహళ్ళి రహదారిలో మూడెకరాల పొలం ఉంది. ఆ పొలంలో అయ్యన్నతోపాటు మల్లికార్జున ఏళ్ల తరబడి గంజాయిని సాగు చేసి, గిఫ్ట్‌ బాక్సుల్లో పెట్టి పెద్దహరివాణం నుంచి కర్ణాటకకు రాకపోకలు చేసే ప్రయాణికులు, విద్యార్థుల ద్వారా కర్ణాటక రాష్ట్రం శిరుగుప్పకు తరలిస్తున్నారు.

వెలుగులోకి ఇలా..

20 రోజుల క్రితం మల్లికార్జున సమీప బంధువు శిరుగుప్పలో గంజాయిని విక్రయిస్తుండగా, అక్కడ పోలీసులు అదుపులో తీసుకున్నారు. కర్ణాటక పోలీసుల విచారణలో గంజాయి సాగుతో పాటు విక్రయమంతా ఆంధ్రలోని ఆదోని మండలం పెద్దహరి వాణం నుంచే జరగుతోందని తేల్చి, ఆంధ్ర పోలీసులకు సమాచారం అందజేశారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇస్వీ ఎస్‌.ఐ నాగేంద్ర, అగ్రికల్చర్‌ అధికారి ఆశోక్‌ కుమార్‌రెడ్డి, సిఎస్‌డిటి వలిబాషా సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. అయ్యన్న, మల్లికార్జున సాగు చేస్తున్న మిరప పొలంలోని గంజాయి మొక్కలను, వారి ఇళ్లలో ఉన్న కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసి కర్నూలు కోర్టుకు తరలించినట్లు ఎస్‌.ఐ తెలిపారు.

Updated Date - Mar 11 , 2025 | 12:57 AM