Share News

తుంగభద్రమ్మ పరుగులు

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:02 AM

తుంగభద్రమ్మ పరుగులు

తుంగభద్రమ్మ పరుగులు
బుధవారం విద్యుత్‌ కాంతుల్లో వెలిగిపోతున్న తుంగభద్ర డ్యాం

జలాశయాలకు కొనసాగుతున్న వరద

శ్రీశైలంలో చేరిన 167.48 టీఎంసీలు

తుంగభద్ర డ్యాం 20 గేట్లెత్తి 58,260 క్యూసెక్కులు విడుదల

ప్రమాద హెచ్చరిక జారీ చేసిన టీబీపీ బోర్డు

నదితీర ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

తుంగభద్రమ్మ ఉరకలెత్తుతూ పరుగులు పెడుతూ కందనవోలు వైపు వస్తుంటే... కృష్ణమ్మ బిరబిరా పోటెత్తుతోంది. రాయలసీమ జలనాడులైన తుంగభద్ర, కృష్ణాలకు ఆశాజనకంగా వరద ఉండడంతో కరువు పల్లెసీమ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలానికి వేల క్యూసెక్కులు వరద చేరుతున్నా.. విద్యుత్‌ ఉత్పత్తి పేరిట వచ్చిన వరదను వచ్చినట్లుగా సాగర్‌కు వదిలేస్తున్నారు. సీమ కాలువలకు నీటిని విడుదల చేయాలని కరువు రైతులు కోరుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో తుంగభద్ర, సుంకేసుల బ్యారేజీకి చేరితే.. కేసీ కాల్వకు సాగునీరు విడుదలపై ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. తుంగభద్ర డ్యాం నుంచి 20 గేట్లెత్తి 58,260 క్యూసెక్కులు విడుదల చేస్తే.. శ్రీశైలానికి 167.48 టీఎంసీలు చేరింది. హంద్రీనీవా, గాలేరు-నగరి, ఎస్సార్బీసీ, తెలుగుగంగ కాలువకు సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

- కర్నూలు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి)

తుంగభద్ర డ్యాం 20 గేట్లెత్తారు

తుంగభద్ర జలాశయానికి ఆశాజనకంగా వరద వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రం 3గంటలకు వరద లెక్కలు పరిశీలిస్తే 28,932 క్యూసెక్కులు ఇన్‌ ఫ్లో కొనసాగింది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 1,633 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు. గతేడాది 19వ నంబరు గేటు కొట్టుకుపోవడం, 32గేట్లు కూడా 45 శాతానికి పైగా పటుత్వం కోల్పో యాయని నిపుణులు నివేదిక ఇవ్వడంతో 80 టీఎంసీలే నిల్వ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో 1,625.46 అడుగుల లెవల్‌లో 78.01 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఎగువన ఉన్న తుంగ ప్రాజెక్టు నుంచి 34,990 క్యూసెక్కు లు విడుదల చేశారు. బుధవారం రాత్రి తుంగ నుంచి 60 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం ఇన్‌ఫ్లో 28,932 క్యూసెక్కులే ఉన్నా.. ఎగువ నుంచి వచ్చే వరదను దృష్టిలో ఉంచుకుని 20 క్రస్ట్‌గేట్లు ఎత్తి 58,260 క్యూసెక్కులు నదికి విడుదల చేశారు. కర్నూలు జిల్లా కౌతాళం, మంత్రాల యం, నందవరం, సి,బెళగల్‌, కర్నూలు మండలాల్లోని నదితీర గ్రామాల ప్రజలు, ముఖ్యంగా సాగునీటి కోసం నదిలో పంపులు ఆన్‌ చేసేందుకు వెళ్లే రైతులు, మంత్రాలయం భక్తులు అప్రమత్తంగా చేయాలని టీబీపీ బోర్డు అధికారులు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే నదిలో స్వల్పంగా వరద ఉండడంతో, జిల్లాలో కూడా వర్షాలు పడుతుండడంతో రెండు మూడు రోజుల్లో తుంగభద్రమ్మ సుంకేసుల బ్యారేజీ చేరే అవకాశం ఉంది. 7న జరిగే ఐఏబీ సమావేశంలో కేసీ కాలువకు సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకుం టారని అంటున్నారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా ముందుగానే కేసీ కాలువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

శ్రీశైలంలో 167.48 టీఎంసీలు

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతున్నా.. సీమ పల్లెల దాహం తీర్చేందుకు కాలువలకు నీరు విడుదల చేయక పోవ డంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శ్రీశైలం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, గురువారం 875.80 అడుగుల లెవల్‌లో 167.48 టీఎంసీలు వరద చేరింది. ఎగువన జూరాల నుంచి 64,611 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతోంది. అయితే వచ్చిన వరదను వచ్చినట్లుగానే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుత్తు ఉత్పత్తి పేరిట దిగువకు వదిలేస్తున్నారు. కుడి గట్టు విద్యుత్తు కేంద్రం నుంచి 23,263 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. 854 అడుగులు లెవల్‌ దాటగానే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా వరద జలాలు తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు-నగరి కాలువకు మళ్లించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు జాప్యం కావడంతో మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీనీవా కాలువకు కూడా కృష్ణా జలాలు ఎత్తిపోయడం లేదు. దీంతో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి విడుదల జాప్యానికి కారణాలు ఏమో పాలకులకే తెలియాలి. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు మేల్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సీమ కాల్వలకు సాగునీరు విడుదల చేసేలా ముమ్మర చర్యలు చేపట్టాల్సి ఉంది.

Updated Date - Jul 04 , 2025 | 12:02 AM