చెత్తబుట్ట.. అర్జీల గుట్ట..!
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:20 PM
జిల్లాలోని మండల స్థాయి అధికారులు ప్రజాపరిపాలనను గాలికొదిలేశారు. ఒక్కో మండలంలోని 10నుంచి 25 దాకా గ్రామాలు కలవు.
పైౖసలిస్తేనే పరిష్కారం
లేదంటే సాకులతో పక్కన పడేస్తున్న వైనం
తూతూ మంత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక
మండలాల్లో ఫెవికాల్ వీరులుగా వీఆర్వోలు, కార్యదర్శులు
పర్యవేక్షించని ఉన్నతాధికారులు
జిల్లాలోని మండల స్థాయి అధికారులు ప్రజాపరిపాలనను గాలికొదిలేశారు. ఒక్కో మండలంలోని 10నుంచి 25 దాకా గ్రామాలు కలవు. ప్రతి రోజూ ఏదో ఒక సమస్య పరిష్కారంపై తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు ప్రజలు, రైతులు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు వస్తారు. వినతిపత్రా(అర్జీలు)లు సమర్పిస్తారు. వాటిని కనీసం చూడకుండా చెత్తబుట్టలో వేస్తున్నారు. పైసలు వచ్చే అర్జీలను మాత్రం క్షణాల్లో అర్జీలను పరిష్క రిస్తున్నారు. పైసలిచ్చుకోని వారికి అధికారులు న్యాయం చేయడం లేదని విమర్శలున్నాయి.
కర్నూలు కలెక్టరేట్, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): వివిధ సమస్యల పరిష్కారం కోసం మండలంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు వచ్చే అర్జీలు చెత్తబుట్టలోకి చేరుతున్నాయి. చెత్తబుట్టల్లో గుట్టగుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఫైసలిస్తే మాత్రం అర్జీలకు పరిష్కారం సత్వరమే దొరకుతుంది. ఫైసలివ్వకపోతే మాత్రం ఇక అంతే సంగతులు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీల్లో దాదాపు 80శాతం రెవెన్యూ, భూసర్వే శాఖకు సంబంధించినవే. భూములు సర్వే చేయాలని, ఆన్‌లైన్ చేయలేదని, ఎల్పీఎం నెంబర్ విభజన జరగలేదని, తమ ఆధార్‌తో ఇతర భూములు అనుసంధానం అయ్యాయని, ఇలా పలు రకాల సమస్యలతో అర్జీలు ఇస్తున్నారు. వాటిని అధికారులు తహసీల్దార్ కార్యాలయాలకు పంపుతున్నారు. అక్కడి నుంచి గ్రామాల వారీగా వీఆర్వోలు, సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారించాలి. పరిష్కార మార్గం చూపకపోగా గడువు సమీపిస్తున్న వేళ అర్జీదారుని వద్దకు వెళ్లి పరిష్కారమయిందంటూ సంతకం చేయాలని అధికారులు ఒత్తిడి చేస్త్తున్నారు. అర్జీదారులు అంగీకరించకపోతే సాం కేతిక కారణాలను సాకుగా చూపి అంతటితో ముగిస్తున్నారు. మండలంలో పనిచేసే వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శలు ఫెవికాల్ వీరులుగా మారారు. దాదాపు 10 నుంచి 20 సంవత్సరాలకు పైబడి ఒకే మండలంలో కొనసాగుతున్నారు.
భూసర్వేలో తప్పిదాలు..
జగనన్న భూసర్వేలో అనేక తప్పిదాలు జరిగాయి. చాలా మంది రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సర్వే, రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదా లకు అడంగల్, 1బీ, ఆర్వోఆర్, ఎన్‌వోసీ, ఈసీ అంటూ అధికారులు రైతులను వేధింపులకు గురి చేస్తున్నారు. చదువుకోని రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగు తున్నారు.
అత్యధికంగా రీసర్వే, రెవెన్యూ డిపార్టుమెంట్
రీసర్వే శాఖలో 20,577, రెవెన్యూ శాఖలో 18,621, పోలీసు డిపార్టుమెంట్‌లో 5,060, మున్సిపాలిటీలో 2,183, పంచాయతీ రాజ్ 1,002, సమగ్ర శిక్ష 565, హౌసింగ్ 534, సివిల్ సప్లయ్ 532, అగ్రికల్చర్ 502, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ 436 అర్జీలు వచ్చాయి.
సచివాలయ తప్పిన ఉద్యోగులు
వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. సచివాలయ అధికారులు గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలపై కనీస సమాచారమివ్వడం లేదు. నిరక్షరాస్యులు అత్యధికంగా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. కుల, ఆదాయ సర్టిఫికెట్లు కోసం రోజుల తరబడి సచివాలయాల చుట్టూ తిప్పుతున్నారు. ఉద్యోగులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12లోపు విధులకు హాజరవుతున్నారు. తహసీల్దార్, ఎంపీడీవోలు సచివాలయాలను తనిఖీ చేసిన దాఖలాలు లేవు.
ఇప్పటి వరకు వచ్చిన అర్జీల వివరాలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది జూన్ 15 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వివరాలు:
మొత్తం అర్జీలు : 55,227
పరిష్కారం చూపినవి : 49,146
పురోగతిలో ఉన్నవి 2,850
పెండింగ్‌లో ఉన్నవి 401
ఇంకా చూడని దరఖాస్తులు 51