Share News

పారదర్శక పంపిణీ

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:10 AM

బియ్యం పంపిణీలో అక్రమాలను అరికట్టాలనే లక్ష్యంగా ఐదేళ్ల తరువాత కూటమి ప్రభుత్వం చౌక దుకాణాల వద్దే రేషన్‌ పారదర్శక పంపిణీకి ఆదివారం శ్రీకారం చుట్టింది.

పారదర్శక పంపిణీ
రేషన్‌ బియ్యాన్ని పంపీణీ చేస్తున్న మంత్రి టీజీ భరత్‌

రేషన్‌ దుకాణాల వద్దే బియ్యం

ఐదేళ్ల తర్వాత పూర్వ వైభవం

తొలి రోజు 1.10 లక్షల కార్డులకు బియ్యం సరఫరా

ప్రజాభీష్టం మేరకే పంపిణీ : మంత్రి భరత్‌

కర్నూలు, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): బియ్యం పంపిణీలో అక్రమాలను అరికట్టాలనే లక్ష్యంగా ఐదేళ్ల తరువాత కూటమి ప్రభుత్వం చౌక దుకాణాల వద్దే రేషన్‌ పారదర్శక పంపిణీకి ఆదివారం శ్రీకారం చుట్టింది. జిల్లాలో వంద శాతం రేషన్‌ షాపులు ఓపన్‌ చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిస్తే.. తొలి రోజే 1.10 లక్షల కార్డుదారులకు బియ్యం అందించి నాలుగో స్థానంలో నిలిచారు. ఎండీయూ వాహనాలు ఎప్పుడొస్తాయో తెలిసేది కాదని, గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. రేషన్‌ డిపోలు తెరవడంతో పగలు పనులు ముగించుకొని సాయంత్రం వేళ బియ్యం తెచ్చుకుంటామని పేర్కొంటున్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు 7 వేల కార్డుదారులకు ఇళ్ల వద్దకే వెళ్లి బియ్యం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం మళ్లీ పాత విధానంలో బియ్యం పంపిణీ చేపట్టడంతో కార్డుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 25 మండలాల పరిధిలో పౌర సరఫరాల శాఖ పర్యవేక్షణలో 1,233 రేషన్‌ పంపిణీ దుకాణాలు ఉన్నాయి. వాటి పరిధిలో 6,71,200 బియ్యం కార్డులు ఉన్నాయి. ప్రతి నెల 11,800 మెట్రిక్‌ టన్నులు బియ్యం కార్డుదారులకు సరఫరా చేయాలి. 1983లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక పేదలకు రాయితీ బియ్యం పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 2021 ఫిబ్రవరి వరకు అంటే 39 ఏళ్లుగా రేషన్‌ దుకాణాల వద్దనే కార్దుదారులకు బియ్యం పంపిణీ చేసేవారు. 2021 ఫిబ్రవరిలో నాటి వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి బియ్యం సరఫరా చేయాలని ‘మొబైల్‌ డిస్పెసింగ్‌ యూనిట్‌ (ఎండీయూ)’కు శ్రీకారం చుట్టింది. ఎండీయూ వాహనాలు పేద బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా మారాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అక్రమార్కులతో కొందరు ఎండీయూ వాహనదారులు కుమ్మక్కై రేషన్‌కార్డుదారులకు బియ్యం ఇవ్వకుండా.. కిలోకు రూ.10 చొప్పున లెక్కకట్టి ఇచ్చేవారు. ఆ బియ్యాన్ని నల్లబ జారుకు తరలించి సొమ్ము చేసుకునేవారనే ఆరోపణులు బలంగా ఉన్నాయి. వాస్తవంగా ప్రభుత్వం ఒక కిలోకు రూ.46కు పైగా ఖర్చు చేస్తోంది. ఎండీయూ వాహనాలే బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా మారిందనే ఆరోపణులు రావడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి పాత పద్ధతిలో రేషన్‌ దుకాణాల వద్దే పంపిణీకి శ్రీకారం చుట్టింది. కర్నూలు నగరంలో మంత్రి టీజీ భరత్‌, నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు రేషన్‌ దుకాణాల్లో పేదలకు బియ్యం పంపిణీ ప్రారంభించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రత్యేక పరిశీలకులు జి.మోహన్‌బాబు, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్‌లు గూడూరు మండలం కె.నాగులాపురం, పెంచికలపాడు గ్రామాల్లో బియ్యం పంపిణీ తీరుపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు.

కార్డుదారుల అభీష్టం మేరకే

పేదలకు బియ్యం పంపిణీలో ఎండీయూ వాహనాలు ద్వారా ఎన్నో ఇబ్బందులు ఉండేవి. ఇంటింటికి వెళ్లి ఇవ్వకుండా వీఽధి చివర్లో వాహనం అపుకొని బియ్యం ఇచ్చేవారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే అక్రమాలకు అడ్డాగా మార్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ విధానంపై 11 నెలలు పరిశీలించాం. కార్డుదారులు అభిప్రాయం, అభీష్టం మేరకు పేదలకు బియ్యం పంపిణీ చేయడంతో పాటు అక్రమాలను అరికట్టాలనే లక్ష్యంగా పాత విధానం అమల్లో తీసుకొచ్చాం. 65 ఏళ్లు పైబడిన, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డీలర్లు ఇళ్ల వద్దకే వెళ్లి బియ్యం పంపిణీ చేస్తారు.

టీజీ భరత్‌, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి

అక్రమాలకు పాల్పడితే లైనెన్స్‌ రద్దు

రేషన్‌ దుకాణాల డీలర్లు నిబంధనల మేరకు ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్‌ దుకాణాలు తెరిచి బియ్యం ఇవ్వాలి. కార్డుదారులతో సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఎక్కువ ధరలు వసూలు చేసినా, చిల్లర ఇవ్వకపోయినా, బియ్యంకు బదులుగా డబ్బులు ఇచ్చినట్లు ఫిర్యాదులు వస్తే లైసెన్స్‌ రద్దుకు చర్యలు తీసుకుంటాం.

రాజా రఘువీర్‌, జిల్లా పౌర సరఫరాల విభాగం జిల్లా అధికారి, కర్నూలు

Updated Date - Jun 02 , 2025 | 12:10 AM