దిగివచ్చిన వ్యాపారులు
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:52 AM
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వేరుశనగ గ్రేడింగ్ విధానం రద్దుకు వ్యాపారులు సుముఖత వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం మరోమారు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, మార్కెట్ యార్డ్ కార్యదర్శి కల్పన వేరుశనగ వ్యాపారులతో చర్చలు జరిపారు.
గ్రేడింగ్ లేకుండా వేరుశనగ కొనుగోలుకు సుముఖత
సబ్ కలెక్టర్‌తో చర్చలు సఫలం
సబ్ కలెక్టర్‌తో చర్చిస్తున్న వేరుశనగ వ్యాపారులు
ఆదోని అగ్రికల్చర్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వేరుశనగ గ్రేడింగ్ విధానం రద్దుకు వ్యాపారులు సుముఖత వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం మరోమారు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, మార్కెట్ యార్డ్ కార్యదర్శి కల్పన వేరుశనగ వ్యాపారులతో చర్చలు జరిపారు. రైతులకు నష్టం కలిగించే గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని వ్యాపారులను ఆయన హెచ్చరించారు. ఉదయం చర్చల్లో న్యాయవాదులతో కలిసి హాజరైన వ్యాపారులు గ్రేడింగ్ కొనసాగించాలని, లేకపోతే ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్‌లో తూకాలు ఏ విధంగా చాట ద్వారా కొనసాగుతాయో ఆ విధంగా ఇక్కడ హమాలీలు తూకాలు వేస్తే అభ్యంతరం లేదంటూ చెప్పుకొచ్చారు. సబ్ కలెక్టర్ వారం రోజులపాటు యఽథావిధిగా రైతులు తెచ్చిన వేరుశనగ దిగుబడులను గ్రేడింగ్ లేకుండా కొనసాగించాలని, ఏదైనా నష్టం కలిగించే విధంగా ఉంటే తరువాత చూద్దమంటూ వ్యాపారులకు సూచించారు. వ్యాపారులు కలెక్టర్ మాటకు సమ్మతిస్తూ కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చారు. రైతులు ఇంటి వద్దనే బాగా గ్రేడింగ్ చేసుకొని ఆరబెట్టుకొని వేరుశనగను తీసుకురావాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సూచించారు. మార్కెట్ యార్డ్‌లో తేమశాతం అధికంగా ఉంటే రాశులుగా కాకుండా వేరుశనగ పరిచి టెండర్‌కి ఉంచవచ్చన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్, మార్కెట్ యార్డ్ కార్యదర్శి కల్పన, వేరుశనగ వ్యాపార సంఘం నాయకుడు శరణప్ప నాగరాజు, మస్తాన్ పాల్గొన్నారు.