Share News

కార్పొరేషన్‌కు ‘ట్రేడ్‌’ కష్టాలు..!

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:11 PM

కర్నూలు నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఓ పండ్ల వ్యాపారి పాతబకాయిలు సుమారు రూ.37 వేలు ఉన్నాయి.

కార్పొరేషన్‌కు ‘ట్రేడ్‌’ కష్టాలు..!

ట్రేడ్‌ బకాయిల వసూళ్లపై అధికారుల దృష్టి

అడ్డుపడుతున్న ప్రజాప్రతినిధులు, నాయకులు

నోటీసులు జారీ చేస్తున్న నగర పాలక సంస్థ

కర్నూలు నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఓ పండ్ల వ్యాపారి పాతబకాయిలు సుమారు రూ.37 వేలు ఉన్నాయి. ట్రేడ్‌ లైసెన్సు చెల్లించాలని ఆ వ్యాపారిని మున్సిపల్‌ సిబ్బంది ఒత్తిడి చేయడంతో ఓ కార్పొరేటర్‌ రంగంలోని దిగాడు.. ‘ఆయన మాకు బంధువు అవుతాడు. పన్నులు, గిన్నులు చెల్లించేది లేదు..’ అంటూ అధికారులకు హుకుం జారీ చేశాడు. ఇలా ప్రతి వార్డులో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల బంధువులు ట్రేడ్‌ లైసెన్సులు చెల్లించకుండా అడ్డుపడితే.. ఇక ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది.

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర పాలక సంస్థకు ఆదాయం రావాలంటే టేడ్ర్‌ లైసెన్సు ఒక మార్గం. అయితే ఏ వ్యాపారం చేసినా నగర పాలకకు ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం ఫీజు చెల్లించాలి. ఈ క్రమంలో నగర పాలక పరిధిలో 52 వార్డులు ఉండగా ఇందులో 11,814 మంది ట్రేడ్‌ లైసెన్సు తీసుకున్నారు. దీంతో నగర పాలక సంస్థకు సంవత్సరానికి రూ.3 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. లైసెన్సు తీసుకుని ఫీజు చెల్లించాలని నగర పాలక అధికారులు దుకాణ యజమానులకు అడుగుతున్నారు. అయితే ప్రజాప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్ల అండదండలు చూసుకుని కొందరు వ్యాపారులు తాము ఒక్కపైసా కూడా చెల్లించేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. మరీ ముఖ్యంగా లైసెన్సు ఫీజు చెల్లింపులపై వ్యాపారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది కార్పొరేటర్లు ట్రేడ్‌ లైసెన్సులు చెల్లించకుండా అడ్డుకుంటున్నట్లు అధికారులే చెబుతున్నారు.

కర్నూలు నగరంలో 50 వేలకు పైగా దుకాణాలు ఉండగా అధికారుల లెక్కల్లో మాత్రం 11,814 దుకాణాలకు లైసెన్సులు ఉన్నట్లు చూపిస్తున్నారు. లైసెన్సుకు నగదు వసూలు చేయని దుకాణాలు సుమారు 25 వేలకు వరకు ఉంటాయి. నగర పాలక పరిధిలో మొత్తం 11,814 మంది ట్రేడ్‌ లైసెన్సులు తీసుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 6,546 మంది మాత్రమే చెల్లించారు. మిగిలిన 5,268 మంది చెల్లించలేదు. పాత బకాయిలు రూ.2,71,79,970 ఉండగా కొత్తవి రూ.50,99,939గా ఉన్నాయి. మొత్తం రూ.3,22,79,909 పెండింగ్‌ ఉంది. శానిటరీ ఇన్స్‌పెక్టర్లకు ప్రత్యేక డ్యూటీలు వేసి ట్రేడ్‌ లైసెన్సులు వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం వసూలులో ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు.

దోచుకుంటున్నారు

కర్నూలు నగరంలో సుమారు 7 లక్షలకు పైగా జనాభా ఉంది. చిన్న,పెద్ద దుకాణాలు కలిపి 50 వేలకు పైగా సుమారు ఉంటాయి. నగర పాలక పరిధిలో 11,814 దుకాణాలకు మాత్రమే లైసెన్సులు ఉన్నాయి. నగర పాలక ప్రజారోగ్య విభాగం ప్రతి దుకాణం నుంచి లైసెన్సు, రెన్యువల్‌ వసూలు చేయాల్సిఉంది. ఈ ప్రక్రియ ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ ఒకటో తేదీలోగా చేయాలి. ఏప్రిల్‌ నెలాఖరుకు చెల్లించని వారు 25 శాతం అపరాధ రుసుంతో కలిపి చెల్లించాలి. మే ఒకటో తేదీ నాటికి అన్ని దుకాణాల నుంచి పూర్తిస్థాయిలో వసూలు చేయాలని నిబంధనలు ఉన్నాయి. లేదంటే సంబంధిత అధికారి సొంత సొమ్ము జమచేయాలి. రుసుం చెల్లించిన ప్రతి దుకాణంలోనూ లైసెన్సు ధ్రువీకరణ పత్రం ప్రదర్శించాలి. అయితే నగరంలోని పలు కాలనీల్లో పలువురు దుకాణదారులు ట్రేడ్‌ లైసెన్సు తీసుకోకుండానే వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇలాంటి వారికి నగరపాలక అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ప్రజాప్రతినిధుల వద్దకు పంచాయితీ

ట్రేడ్‌ లైసెన్సు ఫీజుల విషయంలో స్థానికంగా ప్రజాప్రతినిధుల కలుగజేసుకుంటుండంతో సమస్య మరింత జఠిలమవుతోంది. దీంతో చాలా మంది కూడా లైసెన్సు తీసుకోవడం లేదు. దీని వల్ల నగర పాలక ఆదాయానికి గండి పడుతోంది. అన్నీ తెలిసినా కూడా ప్రజాప్రతినిధులు వ్యాపారులను వెనుకేసుకుని రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు యజమానులైతే ‘మేం మంత్రితోనే చెప్పి స్తాం. మేము కట్టాల్సిన పనిలేదు..’ అని బాహాటం గానే చెబుతున్నారు. దీంతో ఏమిచేయలేని నిస్సహా య స్థితిలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

పన్ను వసూళ్లపై ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారు

నగర పాలక పరిధిలో ట్రేడ్‌ లైసెన్సు, ఆస్తి,కుళాయి పన్నులు వసూళ్లు చేయించి ఇస్తామని ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారు. ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా భావించే పన్ను వసూళ్లకు ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించాము. ఎవరైనా ట్రేడ్‌ లైసెన్సు చెల్లించని పక్షంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాన్ని సీజ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, వ్యాపారులు గమనించాలని కోరుతున్నాము.

- పి.విశ్వనాథ్‌, కమిషనర్‌, నగర పాలక సంస్థ, కర్నూలు

Updated Date - Aug 11 , 2025 | 11:11 PM