Share News

కర్నూలు గడ్డపై అగ్రనేతలు

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:39 PM

2025.. కర్నూలు రాజకీయ ముఖచిత్రంలో సరికొత్త ముద్ర వేసింది. కర్నూలు వేదికగా అద్భుత రాజకీయ శకంగా నిలిచింది.

కర్నూలు గడ్డపై అగ్రనేతలు

జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌

కందనవోలు వేదికగా సాగిన అద్భుత రాజకీయ శకం

అభివృద్ధికి వేగంగా అడుగులు

2025.. కర్నూలు రాజకీయ ముఖచిత్రంలో సరికొత్త ముద్ర వేసింది. కర్నూలు వేదికగా అద్భుత రాజకీయ శకంగా నిలిచింది. అగ్రనేతల రాకతో రాయలసీమ ముఖద్వారం కర్నూలు ఖ్యాతి ఢిల్లీకి చేరింది. ప్రధానమంతి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, మంత్రులు పర్యటించారు. డబుల్‌ ఇంజిన్‌ జోరుతో కర్నూలు జిల్లా అభివృద్ధికి బాటలు వేశారు. అంతేకాదు.. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ సహా కూటమి పార్టీల ప్రముఖ నాయకులు జిల్లాలో పర్యటించారు. వివిధ రంగాల్లో ప్రగతి పరుగులు పెట్టించేందుకు కీలక పాత్ర పోషించారు. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ ఏప్రిల్‌ 3న కర్నూలు నగరంలోని ఓ శుభకార్యానికి హాజరు కావడానికి కర్నూలుకు వచ్చారు. మరో రెండు రోజుల్లో 2025కు వీడ్కోలు పలికి.. 2026 నవ వసంతానికి ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతున్న వేళ.. మధురజ్జాపకాలు మిగిల్చి కాలగర్భంలో కలసిపోతున్న 2025లో కర్నూలు ముంగిట దేశ, రాష్ట్ర అగ్రనేతల పర్యటనలపైౖ ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి)

కర్నూలు వేదికగా అగ్రనేతల ప్రగతి గర్జన

కర్నూలు జిల్లా రాజకీయ ముఖచిత్రంతో 2025 మరవలేనిది. ‘వికసిత ఏపీతోనే వికసిత భారత్‌’ భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రగతి గర్జన చేస్తే.. మోదీ సంస్కరణలు గేమ్‌ చేంజర్లు.. 21వ శతాబ్దం ఆయనదే అంటూ సీఎం చంద్రబాబు.. ప్రతిఫలం ఆశించకుండా దేశానికి సేవ చేస్తున్న ఓ కర్మయోగి మోదీ అంటూ డిప్యూటీ సీఎం వపన్‌ కల్యాణ్‌.. తమది డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌ అంటూ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ గర్జనకు వేదికగా నిలిచింది. ఈ ఏడాది అక్టోబరు 16న సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్‌ పేరిట కర్నూలు గడ్డపై నిర్వహించిన భారీ సభకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ సహా రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. సభా ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర మంత్రులు మొత్తం ఇక్కడే మకాం వేయడంతో పది రోజులకు పైగా రాష్ట్ర పాలన కందనవోలు గడ్డపై నుంచే సాగిందనే చెప్పాలి. సభ అపూర్వ విజయవంతం కావడంతో జిల్లా ఖ్యాతి డిల్లీకి చేరింది. ఏపీ సత్తా, వేగం, సామర్థ్యం.. దేశాభివృద్ధిలో ఏపీ భాగస్వామ్యం.. వికసిత్‌ భారత్‌కు ఏపీ పురోగతే ఆధారం.. అంటూ ప్రధాని కర్నూలు వేదికగా పలుమార్లు కొనియాడారు. జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో వార్తాంశం అయ్యింది. విద్యుత్‌, రైల్వే, రోడ్డు, రక్షణ రంగాలకు చెందిన రూ.13,430 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తే, రూ.4,922 కోట్ల విలువైన ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కేంద్రాలకు శంకుస్థాపనలు చేయడం కొసమెరుపు.

కర్నూలు నుంచే ‘స్త్రీశక్తి’ ప్రకటన

అభివృద్ధి ప్రదాత, సీఎం చంద్రబాబు 2025లో జిల్లాలో పలు మార్లు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కందనవోలులో ప్రగతి పరుగులు పెట్టించే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది మే 17న సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలో పర్యటిం చారు. కర్నూలు నగరంలోని సి.క్యాంపు రైతు బజార్‌ను సందర్శిం చారు. రైతులతో మాట్లాడి, వారితో కూరగాయలు కొనుగోలు చేశారు. పారిశుధ్య కార్మికులతో కలిసి రైతు బజార్‌ మొత్తం కలయతిరిగారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత విన్నపం మేరకు తాగునీటి సమస్యలు శాశ్వత పరిష్కారానికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్న స్పష్టమైన హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో కూటమి ప్రధాన హామీల్లో కీలకమై ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించే స్త్రీశక్తి పథకం ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ఈ గడ్డపై నుంచే ప్రకటించారు. జూలై 17న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి హంద్రీ-నీవా కాలువను సీఎం చంద్రబాబు పరిశీలించారు. నందికొట్కూరు మండలం మల్యాల వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. మాల్యాల పంపింగ్‌ స్టేషన్‌లో పంపులు ఆన్‌ చేసి హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేశారు. దాదాపు రూ.3వేల కోట్లతో యుద్ధప్రాతిపదికన కాలువ విస్తరణ చేశారు. మే 17న జిల్లాలో ఆరు పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ పార్కు లకు ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌ ద్వారా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటి ద్వారా జిల్లాకు రూ.2,977 కోట్లకు పైగా పెట్టుబడులు, దాదాపుగా 4,085 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటనలు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ ఏడాది జనవరి 11న పర్యటించారు. ఓర్వకల్లు మండ లంలో గుమ్మటం తండా, పాణ్యం మండలం పిన్నాపురం గ్రామా ల మధ్య గ్రీన్‌కో కంపెనీ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ, సోలార్‌, విండ్‌ సహా పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టును ఏరియల్‌ వ్యూ ద్వారా, అప్పర్‌ ఇన్‌టెక్‌ పాయింట్‌, లోయర్‌ ఇన్‌టెక్‌ పాయింట్‌ సహా పవర్‌ హౌస్‌ను పరిశీలించారు. టన్నెల్‌లో స్వయంగా కారు నడుపుతూ పరిశీలించారు. మార్చి 22న ఓర్వకల్లు మండలం పుడిచెర్ల గ్రామం వద్ద పంట కుంటల నిర్మాణాలకు భూమి పూజ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించే పంటకుంటల నిర్మాణాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడంతో 2025లో మరవలేని ఘటన ఇది. తరువాత అక్టోబరు 16న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కలసి సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్‌ సభలో పాల్గొన్నారు.

పలుమార్లు పర్యటించిన ఇన్‌చార్జి మంత్రి నిమ్మల

జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 2025లో జిల్లాలో పలుమార్లు పర్యటించారు. ఏప్రిల్‌ 8న పత్తికొండ వద్ద హంద్రీ-నీవా కాలువను పరిశీలించారు. విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించారు. కర్నూలులోని స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో కూటమి నేతలు, ఎమ్మెల్యేలతో జిల్లా సమస్యలపై చర్చించారు. డీఆర్‌సీ సమావేశంలో పాల్గొన్నారు. జూన్‌ 11న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో కలసి కల్లూరు మండలం తడకనపల్లెలో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేశా రు. గోరకల్లు రిజర్వాయర్‌ను పరిశీలించారు. అక్టోబరు 10న హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి 299 చెరువు లకు నీటిని నింపే అంశం పై ఇంజనీర్లతో సమీక్షించారు. 16న జరిగిన ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లలో జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కీలకంగా వ్యవహరించారు.

పరిశ్రమలపై ఫోకస్‌ పెట్టిన మంత్రి టీజీ భరత్‌

జిల్లాకు చెందిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ 2025లో జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడంతో ప్రత్యేక దృష్టి సారించారు. అదే క్రమంలో జిల్లాలో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు బీజం వేశారు. మార్చి 28న మీ సమస్య - మా పరిష్కారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మే 5న పాణ్యం నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కుకు భూమి పూజ చేశారు. ఆ తరువాత ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన చేశారు. మే 23న నగరంలో వివిధ ప్రగతి పనులకు శ్రీకారం చుట్టారు. జూన్‌ 14న రూ.కోటితో నిర్మించిన ఉస్మానియా కళాశాల అదనపు గదులను ప్రారంభించారు. జూలై 1న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్‌) సందర్శించారు. మౌళిక వసతులపై అధికారులతో సమీక్షించారు. 16న నగర అభి వృద్ధిపైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలై 2న ఓర్వకల్లు విమానాశ్రయంలో కర్నూలు-విజయవాడ వినామ సర్వీస్‌ను ప్రారం భించారు. 5న మంత్రాలయం నియోజకవర్గం, 11న ఎమ్మిగ నూరు నియోజకవర్గంలో సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమాల్లో పాలొ ్గన్నారు. సెప్టంబరు 8న కర్నూలులో ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ పేరిట జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో పాలొ ్గన్నారు. అక్టోబరు 13న ప్రధాని మోదీ పర్యటనపై అధికారులో సమీక్షా, 16న ప్రధాని సభలో పాల్గొన్నారు. ఈ నెల 26న కర్నూలు సర్వజన వైద్యశాల వివిధ విభాగాల హెచ్‌ఓడీలతో సమావేశమయ్యారు. రూ.50 కోట్లతో నిర్మించే నాలెడ్జ్‌ సెంటర్‌ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

శ్రీమఠం గురువైభవోత్సవాల్లో లోకేశ్‌

టీడీపీ యువనేత, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ ఏడాది జిల్లాలో పలుమార్లు పర్యటించారు. ముఖ్యంగా విద్యా రంగంలో తీసుకొచ్చేందుకు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టారు. మార్చి 1న మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాల్లో మంత్రి లోకేశ్‌ పాల్గొన్నారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అక్టోబరు 16న ప్రధాని మోదీ హాజరైన సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్‌ సభకు హాజరయ్యారు. దేశంలో ప్రధాని మోదీ పాలన.. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పాలన డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రభుత్వాలు అంటూ కీర్తించారు.

Updated Date - Dec 28 , 2025 | 11:39 PM