టమోటా కిలో రూ.4
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:14 AM
పత్తికొండ మార్కెట్‌యార్డులో టమోటా ధరలు కిలో రూ.4కు పడిపోయాయి. దీంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.
పత్తికొండ మార్కెట్‌లో పడిపోయిన ధరలు
పత్తికొండ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ మార్కెట్‌యార్డులో టమోటా ధరలు కిలో రూ.4కు పడిపోయాయి. దీంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. 10 కిలోల జత గంపలు రూ.80 నుంచి రూ.100, 25 కిలోల జత గంపలు రూ.180 నుంచి 220 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. దసరా పండుగ సందర్భంగా 1,2 తేదీల్లో మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. దీంతో రెండురోజులు పొలంలో కోతకు సిద్ధంగా ఉన్నపంటను రైతులు కోతకోసి మార్కెట్ తీసుకొచ్చారు. శనివారం మార్కెట్‌కు 5.5 టన్నులు దాటి అమ్మకానికి రావడంతో వ్యాపారులు తక్కువధరకు కొనుగోలు చేసినా రైతులు కూడా పట్టించుకోలేదు. అయితే ఆదివారం కూడా వ్యాపారులు తక్కువ ధరకే పంటను కొనుగోలు చేయడంతో రైతులు ఆగ్రహించి టమోటాను కింద పారబోసి ఆందోళనకు దిగారు.
ప్రభుత్వం తరపున కొనుగోలుచేస్తాం - కార్నలీస్, కార్యదర్శి
దిగుబడులు అధికంగా రావ డం, డిమాండ్ లేకపోవ డంతో పాటు గ్రేడింగ్ లేని టమోటాను మార్కెట్‌కు తీసుకురావడంతో ధరలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్కెట్ యార్డు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆదివారం సుమారు 6.5 టన్నుల టమోటా రైతుల నుంచి కిలో రూ.6 చెల్లించి కొనుగోలు చేశాం. రైతులకు గ్రేడింగ్‌చేసిన పంటను మార్కెట్‌కు తెస్తే గిట్టుబాటు ధరను ఖచ్చితంగా అందిస్తాం. రైతులు కూడా తమకు సహకరించాలి.
జత గంపలు రూ.220 కొన్నారు
25 కిలోల గంపలు పదింటిని మార్కెట్‌కు తెచ్చాను. జతగంపలు రూ.220కి వ్యాపారులు కొనుగోలు చేశారు. గంపకు రూ.20 చొప్పున ఆటోకు 200, వ్యాపారులు 10 శాతం కమీషన్ పోను రూ.825 చేతికి వచ్చాయి. కోతకూలీలు కూడా గిట్టుబాటుకాకపోతే పంటను మార్కెట్‌కు ఎందుకు తీసుకురావాలి.- శివమ్మ దూదే కొండ
జత గంపలు రూ.80కి కొన్నారు
10 కిలోల గంపలు మార్కెట్‌కు 20 తీసుకొచ్చాను. రూ.80తో జతగంపలు వ్యాపారులు కొన్నారు. 10 శాతం కమీషన్, ఆటోబాడుగలు పోను రూ.520 మిగిలింది. కోతకూలీలు చెల్లిస్తే రూ.100 నాకే ఎదురుఖర్చు అవుతుంది.
- శ్రీరంగడు, కోతిరాళ్ల
వ్యాపారులు చెప్పిందే ధర
పత్తికొండ మార్కెట్‌లో వ్యాపారులు చెప్పిందే ధర. అదేం అని అడగలేం. అడిగినా పట్టించుకునే వారు ఉండరు. పది కిలోల గంపలు 20 తీసుకొచ్చాను. జత గంపలు రూ.80కి కొన్నారు. పచ్చిసరుకు వెనక్కు తీసుకుపోలేం. నష్టమో, లాభమో వచ్చినకాడికి అమ్ముకునేందుకు అలవాటుపడ్డాం.
- కొండన్న, పుచ్చకాయలమడ