టమోటా కిలో రూ.4
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:20 AM
పత్తికొండ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.4 పలికింది. ఈనెల 4న 25 కేజీల టామోటా బాక్సు రూ.350 పలుకగా.. శుక్రవారం రూ.250 తగ్గి రూ.100 పలికింది. కూలీ, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
పత్తికొండ మార్కెట్‌లో భారీగా పతనమైన ధర
అన్నదాతకు తీవ్ర నష్టం
దేవనకొండ, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): పత్తికొండ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.4 పలికింది. ఈనెల 4న 25 కేజీల టామోటా బాక్సు రూ.350 పలుకగా.. శుక్రవారం రూ.250 తగ్గి రూ.100 పలికింది. కూలీ, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో టమోటా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పైగా వర్షాలతో కాయలపై మచ్చలు, చెట్టుపైనే ఎర్రపండు కుళ్లిపోతోంది. రైతులు పంట సంరక్షణ కోసం అవస్థలు తప్పడం లేదు. అధిక వర్షాలకు టమోటా పంట దిగుబడి తగ్గిపోవడంతో రైతులకు పెట్టుబడుల భారంతో అప్పుల తిప్పలు తప్పడం లేదు. మచ్చల నివారణ కోసం ఐదు సార్లకు పైగానే పురుగుల మందులను పిచికారీ చేయాల్సి వస్తోందని అన్నదాతలు చెబుతున్నారు. మండలంలో దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా బోర బావుల కింద, వర్షాధారం కింద టమోట పంటను సాగు చేశారు.
రూ.400 నష్టం కలిగింది
ఎకరాన్నర పొలంలో టమోటా సాగు చేశా. లద్దె పురుగు, పచ్చదోమ నివారణకు, కాయకు మచ్చ తెగుళ్లు సోకకుండా ఎనిమిది సార్లు స్ర్పే చేశా. నాలుగుసార్లు భూసారం కోసం భూమిలో నాలుగుసార్లు మందు విత్తాను. రూ.30 వేల వరకు ఖర్చు పెట్టాను. మొదటి కోతకు 20 బాక్సులు దిగుబడి వచ్చింది. పత్తికొండ మార్కెట్‌కు పంట దిగుబడిని తరలిస్తే బాక్సు (25 కిలోలు) రూ.100 పలికింది. ఆరుగురితో పంట కోత కోశాను. వారికి రూ.1,800 ఖర్చు అయింది. ఆటో బాడుగ రూ.600. దీంతో రూ.400 నష్టం కలిగింది.
నాగరాజు రైతు, దేవనకొండ