రూ.15 లక్షలకు టోకరా
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:48 AM
తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మించి రూ.15లక్షలు కాజేసిన ఉదంతం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులో వచ్చింది. శ్రీనివాస్ అనే వ్యక్తి సంతోష్‌నగర్‌లో బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు.
తక్కువ ధరకు బంగారం వస్తుందని...
కర్నూలు క్రైం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మించి రూ.15లక్షలు కాజేసిన ఉదంతం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులో వచ్చింది. శ్రీనివాస్ అనే వ్యక్తి సంతోష్‌నగర్‌లో బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈయన జస్ట్ డయల్ యాప్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోగా.. అందులో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తన పేరు మహేష్ అని, హైదరాబాదులో ఉంటానని చెప్పాడు. తాను కర్నూలు పీఎం జ్యువెలరీ దుకాణంలో 15 తులాల బంగారు నగలు కొనుగోలు చేశానని, కొంత నగదు చెల్లించానని, ఇప్పుడు ఆ నగ వద్దనకుంటున్నానని, తక్కువ ధరకు ఇస్తానని నమ్మించాడు. దీంతో శ్రీనివాస్ పీఎం జువెలరి షాపుకు వెళ్లి ఆ ఆర్నమెంటును పరిశీలించాడు. ఆ తర్వాత మహేష్ సూచించిన మేరకు రూ.15లక్షలు నగదును మహేష్ అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆతర్వాత మరోసారి పీఎం జ్యువలరి షాప్‌కు వెళ్లి తాను మహేష్‌కు రూ.15లక్షలు చెల్లించాననీ, ఆర్నమెంటు ఇవ్వాలని కోరాడు. దీంతో ఆ మహేష్ ఎవరో తనకు తెలియదని ఫోన్‌లో సంప్రదించి శ్రీనివాస్ అనే వ్యక్తి వస్తున్నాడని, ఈ ఆర్నమెంటును చూపించాలన్నాడని, అంతకు మించి ఆయన ఎవరో తమకు తెలియదని పీఎం జ్యువెలరీ షాపు నిర్వాహకులు చెప్పారు. దీంతో శ్రీనివాస్ ఖంగుతిన్నాడు. తాను మోసపోయానని గుర్తించి టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.